ఈ బ్లాగును శోధించు

లోడ్ అవుతోంది...

శుక్రవారం 18 నవంబర్ 2011

కార్తెలలో రైతు విజ్ఞానం

కార్తెలలో రైతు విజ్ఞానం

కార్తెలు అంటే రైతు విజ్ఞానం.విద్యావంతులైన జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు,పంచాంగాలు తయారు చేశారు.సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు.కానీ అక్షరాలు రాని తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు.ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.సంవత్సరానికి 27 కార్తెలు.

కార్తెలు 27 :- 1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జేష్ట్య 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రవణం 23.ధనిష్ట 24.శతభిషం 25.పుర్వాభాద్ర 26. ఉత్తరాభాద్ర 27.రేవతి

ఆయా కార్తెలు నెలలు రాశులు వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతలలో ఎలా చెప్పుకున్నారో చూడండి:

సామాన్య శాస్త్రం
  • కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర వదిరినా చెడుతుంది.
  • గబ్బరీదు కార్తి వర్షాలకు దిబ్బలూ కరుగుతాయి. చంద్ర పరివేషం వర్ష యోగము
  • తూర్పున ఇంద్ర ధనస్సు దూరాన వాత వర్షం
  • తూర్పున ఇంద్ర ధనస్సు వస్తే తుంగ మడిలో పడమర వస్తే బండ మీద పశువుల్ని కట్టాలి.
  • కొబ్బరి చెట్టుకు కుడితి మృత్యువు
  • సేద్యానికి పద్దులు పనికిరావు
  • దుక్కికొద్దీ పంట, బుద్ధికొద్దీ సుఖము
  • పాటిమీద వ్యవసాయం కూటికైనా రాదు
  • చేనుకు గట్టు ఊరికి కట్టు
  • వంటికి తిండిపుష్టి, వరికి దుక్కి పుష్టి
  • నల్లనేలకు నూవులు, గట్టినేలకు కందులు
  • కలుపుతీసిన చేను కన్నుల పండుగ
  • ఎరువు చేసే ఉపకారం బంధువులుకూడా చేయరు
  • లోతు దుక్కికి ఎక్కువ పంట
  • పొరుగూరు చాకిరి, పొరుగూరి వ్యవసాయం, తనను తినేవే గానీ, తాను తినేవి కావు.

కార్తెలపై సామెతలు

1.అశ్వని (ఏప్రిల్ – 14)'

  • అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం
  • అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.
  • అశ్వని కురిస్తే అడుగు తడవదు.

2'.'భరణి' (ఏప్రిల్ – 27)

  • భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.
  • భరణి ఎండకు బండలు పగులుతాయి.
  • భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు
  • భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.

3.కృత్తిక (మే – 11)

  • కృత్తిక పునర్వసులు సత్తువ పంట.
  • కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పదిరినా చెడుతుంది.

4.రోహిణి (మే – 25)

  • రోహిణి ఎండకు రోళ్ళు పగులును
  • రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.
  • రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకును.

5.మృగశిర (జూన్ – 8)

  • మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును
  • మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.
  • మృగశిర ముల్లోకాలు చల్లబడును.
  • మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి.
  • మృగశిరలో బెట్టిన పైరు,మీస కట్టున కొడుకు మేలు.
  • మృగశిరి వర్షిస్తే మఖ గర్జిస్తుంది.
  • మృగశిర కురిస్తే ముంగాలి పండును.
  • మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.

6.ఆరుద్ర (జూన్ – 22)

  • ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు
  • ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.
  • ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.
  • ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.
  • ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.
  • ఆరుద్రతో అదనుసరి.
  • ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.
  • ఆరుద్ర వాన ఆదాయాల బాన.
  • ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.
  • ఆరుద్ర లో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.
  • ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.
  • ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.
  • ఆరుద్ర వాన అరుదు వాన
  • ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి

7.పునర్వసు (జులై – 6) :-

  • పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.

8.పుష్యమి (జులై – 20) :-

  • పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.
  • పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు

9.ఆశ్లేష (ఆగష్టు – 3) :-

  • ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది
  • ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.
  • ఆశ్లేష వాన అరికాలు తేమ
  • ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేయును.
  • ఆశ్లేష ముసురు – ఆగి ఆగి తుంపర కురియును.
  • ఆశ్లేషలో అడుగున కొక చిగురైనా అడిగినన్ని వడ్లు ఇస్తుంది.
  • ఆశ్లేషలో అడ్డెడు చల్లటం – పుట్టెడు ఏరుకోవటం
  • ఆశ్లేషలో ఊడ్చిన – అడిగినంతపంట.
  • ఆశ్లేష వర్షం – అందరికి లాభం.
  • ఆశ్లేష వాన అరికాలు తేమ

10.మఖ (ఆగష్టు – 17) :-

  • మఖ మానికంత చెట్టయితే – కార్తీకానికి కడవంత గుమ్మడికాయ
  • మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.
  • మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి.
  • మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు.
  • మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు.
  • మఖా పంచకం సదా వంచకం.
  • మఖ పుబ్బలు వొరుపైతే మహత్తరమైన కాటకం.
  • మఖ ఉరిమితే మదురుమీద కర్రయినా పండును.

11.పుబ్బ (ఆగష్టు – 31):-

  • పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే.
  • పుబ్బలో చల్లేది, మబ్బుతో మొరపుట్టుకునేది.
  • పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బిబ్బి చెట్టు కింద నానదు
  • పుబ్బ కెరివితే భూతం కెరివినట్లు
  • పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు
  • పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు
  • పుబ్బలో పుట్టెడు చల్లే కంటే మఖలో మానేడు చల్లటం మేలు
  • పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు
  • పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు

12.ఉత్తర (సెప్టెంబర్ – 13):-

  • ఉత్తర చూసి ఎత్తరగంప – విశాఖ చూసి విడవరా కొంప.
  • ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా తప్పదు.
  • ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.
  • ఉత్తర పదును ఉలవకు అదును.
  • ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.
  • ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం
  • ఉత్తర వెళ్ళాక వరి ఊడ్పులు కూడదు

13.హస్త (సెప్టెంబర్ – 27) :-

  • హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.
  • హస్తకు ఆధిపంట – చిత్తకు చివరిపంట.
  • హస్తకు ఆరు పాళ్ళు – చిత్తకు మూడు పాళ్ళు.
  • హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.
  • హస్తలో అడ్డెడు చల్లేకంటే – చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.
  • హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.
  • హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.
  • హస్తలో చల్లితే హస్తం లోకి రావు.
  • హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.
  • హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లబోయల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు వేయించండి అన్నవట గొర్రెలు.

14. చిత్త (అక్టోబర్ – 11):-

  • చిత్త కురిస్తే చింతలు కాయును
  • చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును.
  • చిత్తి ఎండకు బట్టతల పగులును.
  • చిత్తలో చల్లితే చిత్తుగా పండును.
  • ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.
  • చిత్త, స్వాతులు కురవకుండా ఉంటే చిగురాకుగూడ మాడిపోవును.
  • చిత్త నేలలో దుక్కి – పుటం పెట్టిన పుత్తడి.
  • చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.
  • చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.
  • చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.
  • చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.

15.స్వాతి (అక్టోబర్ – 27) :-

  • స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.
  • స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.
  • స్వాతి కురిస్తే భీతి కలుగును.
  • స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.
  • స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.
  • స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.
  • స్వాతి వానకు సముద్రాలు నిండును.
  • స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకే.
  • స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.
  • స్వాతీ! నేను జవురుకొస్తాను – విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.

16.విశాఖ (నవంబర్ – 16) :-

  • విశాఖ వర్షం – వ్యాధులకు హర్షం.
  • విశాఖ కురిస్తే పంటకూ విషమే.
  • విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం
  • విశాఖ విసురుతుంది.

17.అనూరాధ (నవంబర్ – 20) :-

  • అనూరాధ కార్తెలో అనాధ కర్రయినా ఈనుతుంది
  • అనూరాధలో కురిస్తే(తడిస్తే) మనోరోగాలు పోతాయి.

18.జేష్ట్య (డిశంబర్ – 3) :-

  • జ్యేష్ట చెడకురియును – మూల మురగ కురియును

19.మూల (డిశంబర్ – 16) :-

  • మూల కార్తెకు వరి మూలన జేరుతుంది
  • మూల ముంచుతుంది
  • మూల కురిస్తే ముంగారు పాడు
  • మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు
  • మూల మంటే నిర్మూల మంటాడు
  • మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.
  • మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది.

20.పూర్వాషాడ (డిశంబర్ – 29) 21.ఉత్తరాషాడ (జనవరి – 11) 22.శ్రావణం (జనవరి – 24) 23.ధనిష్ట ( ఫిబ్రవరి – 6 ) 24.శతభిషం ( ఫిబ్రవరి – 19) 25.పుర్వాభాద్ర ( మార్చి - 4 ) 26. ఉత్తరాభాద్ర ( మార్చి - 4 )

27.రేవతి ( మార్చి - 31 )

  • రేవతి వర్షం రసమయం – రమణీయం
  • రేవతి వర్షం అన్ని పంటలకు రేణింపే.
  • రేవతి వర్షం సర్వ సస్యములకు రమణీయం

నెలల వారీగా సామెతలు

ఆషాఢము
అన్నిపైరులకు ఆషాఢం

కార్తీక మాసం
  • కార్తీక మాసాన కడవలు కడగటానికి కూడా పొద్దుండదు.
  • కార్తీక మాసంలో కడపటి వానలు.
  • కార్తీక వర్షం కర్ణుని యుద్దం.
మాఘ మాసం
  • మాఘ మాసపు వాన మగడు లేని చాన
  • మాఘ మాసపు చలి మంటలో పడ్డాతీరదు.
  • మాఘ మాసంలో మాకులు సైతం వణుకుతాయి.
మార్గ శిరం
  • మార్గ శిరంలో మహత్తయన చలి
పుష్య మాసం
  • పుష్య మాసంలో పూలు గుచ్చటానికి కూడా పొద్దుండదు
  • పుష్య మాసానికి పూసంత వేసంగి.

రాశులు వారీగా సామెతలు

కన్య

కన్యలో చల్లితే కను గుంటల్లోకి రావు (ఊదుకు తినటానికి కూడా రావు)

కర్కాటకం

కర్కాటకం కురిస్తే కాటకం బందు (కాడి మోకు కూడా తడవదు)

మూలాలు:

  • తెలుగు సామెతలు: కెప్టెన్ ఎం.డబ్ల్యు.కార్, వి. రామస్వామి శా స్త్రులు 1955
  • తెలుగు సామెతలు: సంపాదక వర్గం- దివాకర్ల వెంకటావధాని, పి.యశోదా రెడ్డి, మరుపూరి కోదండరామరెడ్డి.- తెలుగు విశ్వవిద్యాలయం మూడవ కూర్పు పునర్ముద్రణ 1986
  • తెలుగు సామెతలు: సంకలనం - పి. రాజేశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1993.
  • తెలుగు సామెతలు: గీతికా శ్రీనివాస్, జే.పి.పబ్లికేషన్స్ 2002
  • తెలుగు సామెతలు:సంకలనం- రెంటాల గోపాలకృష్ణ, నవరత్న బుక్ సెంటర్ 2002
  • లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు పి.కృష్ణమూర్తి ది మోడర్న్ ప్రెస్ తెనాలి 1955
  • సాటి సామెతలు నిడుదవోలు వెంకటరావు,విజయా పబ్లికేషన్స్ మద్రాసు 1961
హిందూ సంప్రదాయం ప్రకారం :
* ఏడు నక్షత్రాలను సప్తర్షులు"Big Dipper" లేదా "Ursa Major" అంటారు.వారు మరీచి,అత్రి,అంగీరసు,పులస్త్యుడు,పులహుడు,క్రతువు,వశిష్టుడు.కొన్ని చోట్ల భరద్వాజుడు , గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, విశ్వామిత్రుడు , భృగువు, కశ్యపుడు,కుత్సుడు కూడా ఉంటారు. వీళ్ళ నుండే అన్నివంశాలు వృద్ధి చెందాయి అంటారు.

భారతీయ
నామం
Bayer
Desig
పాశ్చాత్య
నామం
క్రతు α UMa Dubhe
పులహ β UMa Merak
పౌలస్త్య γ UMa Phecda
అత్రి δ UMa Megrez
అంగీరస ε UMa Alioth
వశిష్ఠ ζ UMa Mizar
మరీచి η UMa Alkaid

"వశిష్ఠ" నక్షత్రానికి ప్రక్కన తక్కువ కాంతితోకనిపించే జంటనక్షత్రం పేరు "అరుంధతి" (Alcor/80 Ursa Majoris).

ఇస్లాం లో నక్షత్రాలు,వర్షం,వాతావరణ విశేషాలు :

పన్నెండవ శతాబ్దం లోనే ఉమర్ ఖయ్యాం జలాలీ సౌర కేలండర్ ను ప్రవేశ పెట్టాడు. అబ్దుల్ రహ్మాన్ సూఫీ,నసీరుద్దీన్ తూసీ,కుతుబుద్దీన్ సిరాజీ లాంటి ముస్లిం ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త నక్షత్రాలను కనుగొన్నారు.

*ఆయనే దేదీప్యమానంగా వెలిగిపోతున్న నక్షత్రానికి ప్రభువు (నజ్మ్53.49)

*వారు నక్షత్రాల వలన దారినీ ప్రదేశాలను గుర్తు పెట్టుకుంటారు(నహ్ల్ 16.16)

* ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు, మీ సిరిసంపదల్లోనూ సంతానంలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు, మీ కొరకు తోటల్ని ఉత్పత్తి చేస్తాడు, ఇంకా మీ కొరకు నదీనదాలను, కాలువలను ప్రవహింపజేస్తాడు”. (నూహ్ 71:10-12).

*వర్షం నక్షత్రాల వలనకాదు వచ్చేది అల్లాహ్ దయ వలన" (బుఖారీ1.807)

* వర్షం కురిపించమని అల్లాహ్ ను వేడుకోవాలి.దీనినేసలాతుల్ ఇస్తిస్ కాఅంటారు.సలాతుల్ ఇస్తిస్ కా గురించి వెళ్ళేటప్పుడు నిరాడంబరమైన వస్త్రాలు ధరించి, ఎంతో వినయవినమ్రత, అణుకువతో వెళ్ళాలి.ఒక వేళ వర్షం అవసరానికి మించి కురిస్తేఅల్లాహ్ మాచుట్టుప్రక్కల్లో , కొండల్లో, లోయల్లో, చెట్లు చేమలు ఉన్నచోట వర్షంకురిపించు.మాపై వద్దు అని ప్రార్దించాలి.

* అల్లాహ్ మిమ్మల్ని భయపెట్టటానికి, ఆశపెట్టటానికి మెరుపును చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడు. మరి దాని ద్వారా మృతభూమికి జీవం పోస్తున్నాడు. ఇందులో బుద్ధిజీవుల కోసం ఎన్నో నిదర్శనాలున్నాయి”. ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు. వాటివల్ల మీకు భయం కలగటంతో పాటు, మీలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి.బరువైన మబ్బులను సృజిస్తున్నాడు. ఉరుము సయితం ఆయన పవిత్రతను కొనియాడుతోంది, ఆయననే ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతివల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి, తాను కోరినవారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్ విషయంలో పిడివాదానికి దిగుతున్నారు! ఆయన మహా శక్తిమంతుడు ,యుక్తిపరుడు”. (రఅద్ 13:12,13).

మీరు త్రాగే మంచినీరు గురించి ఎన్నడైనా ఆలోచించారా? దానిని మేఘాల నుంచి మీరు కురిపిస్తున్నారా? లేక దానిని కురిపించేది మేమా? మేమే గనక తలచుకుంటే దానిని చేదునీరుగా మార్చేయగలం. మరలాంటప్పుడు మీరు ఎందుకు కృతజ్ఞత చూపరు?”. (వాఖియ 56:68-70)

మీరు త్రాగే నీరు గనక భూమిలో ఇంకిపోతే మీ కొరకు నీటి ఊటను బయటికి తెచ్చేదెవరో చెప్పండి”. (అల్ ముల్క్ 67:30)

*ఒక చీమ తన వెనుక కాళ్ళను ఆకాశం వైపుకు ఎత్తి “దేవా! నీవు సృష్టించిన ఇతర ప్రాణుల మాదిరిగానే మేము కూడానీ ప్రాణులం. నీ వర్షపు నీరు లేకుండా మేము బ్రతుకలేము” అని వేడుకొంది. ఇది విన్న సులైమాన్ ప్రవక్త మరలిపోదాం పదండి, ఇతర జీవాల ప్రార్థనా ఫలంగా మీపై వర్షం కురిసినట్లే” అని వెనుతిరిగారు. (ముస్నద్ అహ్మద్).

బైబిల్ లో నక్షత్రాలు :

సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. ద్వితీయోపదేశ కాండము 4:19
ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు యోబు 9:9

*కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా? జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటినిబయటికి రప్పింపగలవా? యోబు 38:31-35
నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.(కీర్తన 147:3)
ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు (ఆమోసు5:8)

నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను.నక్షత్రములు తమ మార్గములలోనుండిసీసెరాతోయుద్ధముచేసెను. న్యాయాధిపతులు5:20


నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును యెషయా 14:13
యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి మత్తయి 2:2

నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు గదా 1 కోరింథీయులకు 15:41

ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూత. (ప్రకటన గ్రంథం1:20)

9 వ్యాఖ్యలు:

  1. అజ్ఞాతNov 21, 2011 10:18 AM

    baagundandi.pantala gurinchi,raitula gurinchi inka vrayandi.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. పులికొండ సుబ్బాచారి గారు psubbachary@gmail.com పంపిన సమాచారం:
    రహమతుల్లా గారూ చాలా సంతోషం అయింది మీ బ్లాగులో ఇచ్చిన వివారలు చూసి.

    వ్యవసాయ విజ్ఞానం పైన ఇప్పటికే చాలా పరిశోధన జరిగింది. విశేషించి 1965 ప్రాంతాలలో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వ్యవసాయ పదకోశాన్ని తయారు చేసినప్పుడు చాలా క్షేత్ర పరిశోధన చేశారు.
    అంతే కాదు. ప్రాతఃస్మరణీయులు అలనాటి జానపద విజ్ఞాని నేదునూరి గంగాధరంగారు. 1950లోనే వ్యవసాయ విజ్ఞానాన్ని చాలా విస్తారంగా సేకరించి వ్యవసాయ ముహుర్త దర్పణం అనే గ్రంథాన్ని తయారు చేసారు. అది ఒక సారి చూడండి. అందులో చాలా విస్తృతమైన సమాచారమే కాక, 600 సామెతలు పలుకుబడులు వ్యవసాయానికి సంబంధించినవి ఉన్నాయి.
    నేను ఇటీవల ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వారి ప్రాజెక్టు కోసం "Agriculture: A Synergy of Knowledge System and Belief System" అనే పెద్ద వ్యాసాన్ని రాసి పంపాను. ఇది వారు పుస్తక రూపంలో వేస్తారు.
    వీలు వెంట మీకు పంపుతాను.

    తెలుగు వాఙ్మయానికి ముస్లిములు ఇంతకు ముందు ఎంతో కృషి చేసినవారు ఉన్నారు. మా ఊర్లోనే అబ్దుల్ కరీమ్ అనే గొప్ప సాహితీ వేత్త ఉండేవాడు.
    మీ కృషి నిజంగా అభినందనీయం ఇంకా కొనసాగించండి.

    *పులికొండ గారూ విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.నేదునూరి గంగాధరంగారి పుస్తకం నెట్ లో ఉంటే లింకు ఇవ్వండి.మీ పుస్తకం రాగానే పంపండి.అలాగే తెలుగు ముస్లిం రచయితల డైరెక్టరీ నసీర్ అహమద్(ఫోన్.9440241727) 'అక్షరశిల్పులు' పేరుతో ప్రచురించాడు.వారికి అబ్దుల్ కరీమ్ గారి సమాచారం కూడా తెలుపండి.
    రహంతుల్లా ఫోన్.8885551644.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. శ్రీదేవీ మురళీధర్ shridevimuralidhar@gmail.com గారు పంపిన సమాచారం:
    సోదరులు శ్రీ రహమతుల్లా గారు
    నమస్తే.

    మీ బ్లాగ్ లో 'కార్తెలు-రైతు విజ్ఞానం 'చదివాను.
    ఎంత ఉపయోగకరమో,ఎంత బాగున్నదో చెప్పలేను.
    ఇంత వయసు వచ్చి,ఇంత మౌలికమైన విషయాలు తెలియటానికి ఇన్నేళ్ళు పట్టడం నిజానికి తెలుగు మనిషికి సిగ్గు చేటు.
    పిల్లలకి కూడా చూపిస్తే చదివి సంతోషించారు.కృతజ్ఞతలు

    ప్రత్యుత్తరంతొలగించు
  4. రహమతుల్లా గారు,
    చాలా విషయాలు సేకరించారు. అభినందనలు.
    ప్రపంచం వేడేక్కటం మొదలు పెట్టాక ఆ సామెతలలో కొన్నింటికి కాలదోషం పడుతోందనుకొంటా!

    ప్రత్యుత్తరంతొలగించు
  5. అవును.అప్పుడు ప్రజలు కొత్త సామెతలు పుట్టిస్తారు

    ప్రత్యుత్తరంతొలగించు
  6. చాలా విషయాలు సేకరించారు.మాకు తెలిపినందుకు ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  7. అజ్ఞాతDec 17, 2011 06:05 AM

    Chaalaa Baagaa undandi Mee vivarana, Malli maaku maa chinnapati maa uurini, maa peddavaalla maatalani gurthuchesukunelaa chesaru...

    ప్రత్యుత్తరంతొలగించు
  8. http://pravasarajyam.com/1/blog/2011/12/29/panchagam-done-by-experience/

    ప్రత్యుత్తరంతొలగించు