ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, మే 2010, గురువారం

మనం ముస్లిములమా?హిందువులమా?

మనం ముస్లిములమా?హిందువులమా?

"ఆపదలోని మానవుడిపై అమృతం వర్షించే కరుణాంతరంగమే మతానికైనా, మానవత్వానికైనా సుక్షేత్రం కాగలదు. నిరుపేదలను ఆదుకోవటం వల్ల ముక్కోటి దేవతలను సందర్శించిన దానికంటే మించిన మోక్షం.ఆత్మతృప్తి కలుగుతాయి.(వార్త సంపాదకీయం 30-3-2003).

ఇటీవల ఓ జిల్లా కేంద్రంలో నూర్ బాషాలు అంటే దూదేకుల కులస్థుల సమావేశం జరిగింది. హాజరయిన పెద్దలు "మనం ముస్లిములమా?హిందువులమా?" అనే మీమాంసంలో పడి రసవత్తరమయిన చర్చ జరిపారు.

ఉర్దూ భాష ,నమాజు,రాకపోవటం వలన ముస్లిములు తమను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ పిల్లలకు తమ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి ముందుకు రావడంలేదని కొందరు ముస్లిం దూదేకుల వారు వాపోయారు. మాకు తెలుగు మసీదులు కావాలన్నారు. నిజంగా హిందూ దేవుళ్ళను నమ్ముకొని తిరుపతికి పోయి గుండు చేయించుకొచ్చినా, సాయిబుల పేర్లుండటం వలన హిందువులు కేటాయించి చూస్తున్నారనీ, షేక్ శ్రినివాసరావు, షేక్ పద్మావతులు గూడా హిందువుల ఆదరణకు నోచుకోవటం లేదని, మరికొందరు హిందూ దూదేకులవారు బాధపడ్డారు. మన విలువ పెరగాలంటే దూదేకుల సిద్ధప్పను తలదన్నే తాత్వికులతో పాటు ప్రత్యేక పూజారులు, పురోహితులు కావాలన్నారు. వేటపాలెం దగ్గర మా మందంతా క్రైస్తవ మతం పుచ్చుకొని హాయిగా ఉన్నాం. చర్చిలో మమ్మల్ని ముందు వరసలో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు మాకు ఉర్దూ బెడదలేదు. కులం గొడవాలేదని షేక్ ఏసుపాదం, షేక్ దానియేలు లాంటి క్రైస్తవ దూదేకుల వాళ్ళు సెలవిచ్చారు. పైగా త్వరలో స్వంత చర్చి కడతారట. నూతిలో పడతావా? పాతర్లో పడతావా? అన్నట్లయింది సమావేశం. ఎవరి మతాన్ని వారు సమర్ధించుకున్నారు. మనమంతా ఒక కుల పోళ్ళం కాబట్టి మనకందరికీ ఒకే మతం ఉండాలని కొందరు పిడివాద దూదేకులు వాదించారు. ఎవరి మతం ఎవరు విదిచిపెడతారు? ఎవరి మతం వారిదేనని కొందరు ఉదారవాద దూదేకులు ఎదురు తిరిగారు. ఆహా! ఏమీ లౌకికవాదం! ఎంతటి అద్భుతమీ భిన్నత్వంలో ఏకత్వం! సకల మతాల సారాలను ఆచారాలను తనలో ఇముడ్చుకొని సర్దుకొని చక్కగా పోతున్న దూదేకుల ఐకృత వర్ధిల్లాలని కొందరు సెక్యులర్ దూదేకుల వారు అరిచారు. అన్ని మతాల వాళ్ళూ మనల్ని కరివేపాకుల్లాగా వాడు కొని అవతల పారేస్తున్నారు. వెనుకపడిన కులాల జనాభాలో 4 శాతం ఉన్నాం.


ఎప్పుడన్నా మనకు ఎమ్మెల్యే పదవిచ్చారా? ఒక్క దూదేకుల వాడైనా ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యాడా? ఆర్ధికాభివృద్ధి లేకుండా ఈ మతాలెందుకు? అని కొందరు హేతువాద దూదేకులు ఆక్రోశించారు.దూదేకటం అనే వృత్తి పోయింది. ఇప్పుడెవరూ ఆ వృత్తి చేయటం లేదు. ఇక మీదట ఆ వృత్తినే చేసి బ్రతికే అవకాశమూ లేదు. ఇంకా ఆ వృత్తి పేరుతోనే కులం పేరు ఎందుకు? మన కులానికి మరేదయినా మంచి పేరు పెట్టాలని కొందరు సంస్కరణవాదులు మాట్లాడారు. కూటికీ గుడ్డకూ రాని బ్యాండు మేళాలు,సన్నాయి వదిలేసి సాంకేతిక విద్యలు చదవాలనీ, ప్రభుత్వాన్ని భూములడగాలనీ కొందరు కమ్యూనిస్టు దూదేకులవారు డిమాండ్ చేశారు. బంతికే రావద్దంతే విస్తరాకు తెమ్మన్నట్టుంది మీ వ్యవహారం. ఏదో ఒక మత గుంపులో చేరితే తప్ప బెదురు తీరని బడుగు జీవులం మనం. ఏమతంలో చేరితే మన పేదరికం అంతరిస్తుంది? ఏ మతంలో చేరితే మన పిల్లల భ్వష్యత్తుకు భధ్రత కలుగుతుంది?

ఏ మతంలో చేరితే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మనల్ని హృదయ పూర్వకంగా కలుపుకుంటారు? మనం దాడిచేసేవాళ్ళం కాదు ఎప్పుడూ దాడులకు గురవుతున్న వాళ్ళం. ఇప్పుడు కావలసింది మన ఆత్మల రక్షణ కాదు. మన ప్రాణాలకు భౌతిక రక్షణ, ఆర్ధిక రక్షణ, సాంఘిక రక్షణ, ఏ మతంలో దొరుకుతుంది? కుల విచక్షణ చూపకుండా మానవతాభావంతో కరుణ రసాన్ని కురిపించి మనపట్ల సమ గౌరవం చూపే మతమేది? ఆ మనవతా మత మేది? అంటూ కొందరు సభ లోనే అన్వేషించారు. కానీ ఫలితం కానరాలేదు.రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.ఇప్పుడు కుల మత సంఘాల పేరుతో గిరులు గీసుకొని కంచెలు కట్టుకొని స్వకీయ రక్షణ. పరపీడన సిద్ధాంతాలతో సాగిపోతున్న నరహంతక ముఠలు ఎన్నని చెప్పగలం? భారతీయ సమాజం కుల మతాల విభజన వల్ల మానసికంగా చిందర వందరై పోయింది. కుహనాఇక్యత వర్ధిల్లుతోంది. మానవత్వాన్ని, ప్రోది చేసి మనందరినీ నిజంగా ఐక్యపరిచే సాధనం మానవతావాదమే. దేవుడి పేరుతో స్ధాపించబడిన కులమతాలు మానవ ఐక్యతకు, మానవ సౌభాగ్యానికి బాటలు వేయాలంటే మతదురభిమానాపు పొరలు కప్పిన వారి కళ్ళల్లో మానవత్వపు కరుణా కాంతులు నిండాలి. హత్యలు చేసే చేతులు పదిమందికి అన్నం పెట్టాలి. ఆస్తులు, ప్రాణాలు, మానాలు దోచుకునే దుర్మాగులు పరోపకారులుగా మారాలి. ఇలా మనుషుల్ని కారుణ్యమూర్తులుగా మలచలేని మతాలు వ్యర్ధం. మానవత్వాన్ని కాలరాచే మతాలు మన పాలిట శాపాలు. మతాలకు మానవత్వమే గీటురాయి. ----నూర్ బాషా రహంతుల్లా ,గీటురాయి వారపత్రిక 18.7.2003


దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటేలోటా? ఎంతమాత్రం లోటు కాదు. ఒకే రకం ఈకలు గల పక్షులు ఒకేచోట చేరతాయంటారు. ఈ మద్య "పరుపులుకుడతాం" అంటూ కవ్వాను బద్ధ భుజాన వేసుకుని తిరుగుతున్న ఇద్దరు మనుషులు నా కంటబడ్డారు. ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పరుపు కొనుగోలు ప్రతిపాదన వాళ్ళను, చూడగానే మంజూరయ్యింది. పరుపు కుట్టడం పూర్తయ్యాక మీరు 'దూదేకుల సాయిబులేనా?' అని అడిగాను, "కాదండీ బాబూ,మేముకాపులం మాది ఏలూరు" అని జవాబిచ్చారు.
కులంగాదు, తలంగాదు కురవోళ్ళ పిల్ల దయ్యమై పట్టినట్లు, కాపులు గూడా దూదేకుతున్నారంటే వీళ్ళను, బీసీల్లో ఎందుకు చేర్చగూడదు అనిపించింది.
తురకలు లేని ఊళ్ళో దూదేకుల వాదే ముల్లా అంటుంటారు. దూదేకుల వాళ్ళు కూడా లేని ఊళ్ళో ముల్లాపని ఏమోగానీ దూదేకేపని మాత్రం ఏదో ఒక కులపోళ్ళు నెత్తిన వేసుకొని చేస్తుండటం వల్ల "కులవృత్తి" సిద్దాంతం దెబ్బతిని పోయింది.
టర్కీ(తురక) భాష మాట్లాడే వాళ్ళను పూర్వం తురక వాళ్ళు అని ఉంటారు. కాని ఇప్పుడు ఉర్దూ మాట్లాడే ముస్లిములందరినీ 'తురకోళ్ళు '
అంటున్నారు. సర్వీస్ కమీషన్ పరీక్షల్లో కూడా ఇదే మాట ప్రయోగించారు. దూదేకుల సాయిబుల్నీ, మామూలు సాయిబుల్నీ వేరు చేసి ఇలా రెండు పేర్లుతో పిలుస్తున్నారు. "తురకా దూదేకుల పొత్తులో మురిగీ ముర్దార్" అనే సామెత ఉంది. "కాకర బీకర కాకు జాతారే?" అంటే దూబగుంటకు దూదేకును జాతరే అని ఇద్దరు దూదేకుల వాళ్ళూ సంభాషించుకున్నారట. బావి తవ్వితే భూతం బయట పడ్డట్లు లోతుకు పోయే కొద్దీ కొత్త సంగతులు బయట పడుతున్నాయి.
ఈ మధ్య నన్ను ఆకివీడుకు బదిలీ చేశారు. బదిలీ కాగితం చేతికిస్తూ ఓ సాయిబుగారు నాకు ఉర్దూ రానందుకు చాలాసిగ్గుపడిపోయారు. ఆయన భాషాభిమానం ఎంత గొప్పదంటే ఖురాను ఉర్దూలోనే అవతరించిందట. బావిలోని కప్పకు గానుగ ఎద్దుకూ అవే లోకాలు అన్నట్లు ఉర్దూ పిచ్చి పట్టిన వాళ్ళకు మరో సంగతి తలకెక్కదు.
అలాగే తెలుగు మాట్లాడటం మన ప్రత్యేకత మన సంస్కృతి అంటూ ఉపన్యాసం చేసిన ఒక నూర్ భాషా నాయకుణ్ని సంకుచితత్వం వదిలి పెట్టమని హితోపదేశం చేశాను." భాషలు ఆయా ప్రాంతాలకు సంబంధించినవి. అయితే దైవ ధర్మం విశ్వవ్యాప్తమైంది. అన్ని భాషల ద్వారా దైవ ధర్మం వ్యాపించాలి." అంటుండగానే, మరో సాయిబుగారు "ఆకివీడులో మీ కేడర్ వాళ్ళు చాలా మంది ఉన్నారండీ" అన్నారు. "ఇస్లాంలో చేరిన తరువాత అంతా ఒకే కేడర్ అవుతారు. ఇంకా ఎందుకీ భేదాలు?"
అన్నాను. "రంగాహత్యానంతరం జరిగిన దౌర్జన్యకాండలో నువ్వు సాయిబువైతే ఉర్దూలో మాట్లాడు అని దూదేకుల సాయిబుని తన్నారుగదా? మీకు మాకు తేడా లేదా?" అన్నాడాయన.
గూని వీపు నయం కాదు లెమ్మని నేను మౌనం వహించి ఆకివీడు చేరాను. అక్కడ ఇంకో సాయిబుగారు నా వివరాలన్నీ అడిగి " ఈ దూదేకుల వాళ్ళంతా ఒక ముస్లిం తండ్రికి హిందూ తల్లికీ జన్మించిన సంతానమండీ" అన్నాడు. కన్ను కైకలూరులో కాపురం డోకిపర్రులో అన్నట్లయింది నాపని.
ఎంతగా ధర్మ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ రెండు రకాల సాయిబులూ కలిసి పోవటం లేదు. ఏమిటి దుస్థితి అని ఒక స్థానిక ముస్లిం నాయకుడిని అడిగాను". గోంగూరలో చింతకాయ వేసినట్లు, గోకి దురద తెచ్చుకున్నట్లు వీళ్ళతో మాకెందుకండీతంటా? బయటి వాళ్ళకు చెప్పుకోవటం నయం" అన్నాడు. సాయిబుల పిల్లల్ని చేసుకొని వాళ్ళలో కలిసిపోగూడదా ఎందుకీ అదగస్తపు బతుకు అని ఒక దూదేకుల స్రీ వారిని అభ్యర్ధించాను. "అమ్మో ఇంకా ఏమయినా ఉందా? మనం బ్రతకడానికేనా? అడుగడుగనా లధాఫ్, లధాఫ్ అని ఎత్తి పొడవరూ?" అని ఎదురు బెదిరించాడు. గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంది. హైదరాబాదులో తల పండిన పెద్దలు, పట్టణాలలోని ముస్లిం పండితులు ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. (అక్కడ కూడా ఇలాగే లేకపోతే)
-- నూర్ బాషా రహంతుల్లా (గీటురాయి 28.6.91