ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, ఆగస్టు 2010, బుధవారం

దళిత గోవిందాన్ని,కల్యాణమస్తును ముస్లిములకు కూడా పొడిగిస్తే మంచిది

డాక్టర్ అంబేద్కర్ కుల నిర్ములన జరగాలని ఎందుకుకోరారు? బౌద్దమతాన్ని ఎందుకు స్వీకరించారు? హిందూ మతానికి ఈ రోజు కుల వ్యవస్థే ప్రధానశత్రువు.నిజమైన శత్రువుని ఎదుర్కోవటానికి ఎంతో దైర్యం కావాలి.సమస్యలను గుర్తిస్తే వాటి పరిష్కారం కోసం మనం ప్రయత్నించాలి. పిరికిపందలు, తప్పించుకునే స్వభావం కలవారు ఈ సమస్యలను గుర్తించటానికి తిరస్కరిస్తారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించరు. మనమంతాలౌకికవాదులం,శాంతినిప్రేమించేవాళ్ళం, అహింసావాదులం.కానీ లేఖనాలు చెప్పిన విషయాల్ని పాటించాల్సి వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తాం.అధర్మాన్ని ఎదుర్కోవాలని- ఉపదేశాలు చేసే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర మత గ్రంధాలను మనం మర్చిపోయాం.కులవివక్ష అనేది తప్పు మరియు క్రూరమయినది.మన అసమర్ధతను కప్పిపుచ్చుకోవటానికి ఓర్పు, లౌకికవాదం అనే ముసుగును వాడుతున్నాం. అహింసావాదులమని చెప్పుకుంటాము. అధర్మాన్ని ఎదిరించకపోవటం మరింత అధర్మాన్ని ప్రొత్సహించడమే అవుతుంది.అది మరీ పాపకార్యం. నిప్పుకోడి మనస్తత్వం మనకు ఉపయోగపడదు. మన సమస్యలను పట్టించుకోకుండా గుడ్డి చూపుతో చూస్తే సమస్యలు పరిష్కారం కావు, పైగా సమస్యలు పెరుగుతాయి. గుడ్డివాడిలాగా బూకరిస్తే మరిన్ని కష్టాలు వచ్చిపడతాయి.
హిందువులు ద్వైతీయులు, అద్వైతీయులు, విశిష్టద్వైతీయులు, నాస్తికులు, జైన్లు, బుద్దులుగా ఉండవచ్చు.అలాగే వారికిష్టమైన ఏ దేవుడినైనా, దేవతనైనా పూజించవచ్చు. హిందువులు ఎక్కువగా పూజలద్వారా, యాగాలుద్వారా, భాగవతమార్గంద్వారా, స్వాములను, బాబాలను దర్శించటం ద్వారా సమయాన్ని, ధనాన్ని,శ్రమను ఖర్చు చేస్తారు. వాళ్ళు క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగాన్ని గౌరవిస్తారు. ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే, కొట్టినవాడికి రెండవ చెంప చూపించు అన్నాడు క్రీస్తు.
మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలలో మతమార్పిడి నిషేధచట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు తి.తి.దే. దళితుల్ని హిందూమతంలోనే ఉంచే ఉద్దేశంతో “దళిత గోవిందం” అనే కొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది.దీనిని భారతీయ ముస్లిములకు వర్తింపచేస్తే ఎంతో బాగుంటుంది, ఎందుకంటే వారి పూర్వీకులు కూడా హిందువులే కదా! హిందూ సమాజం క్రమేణా దానిలోని వైరుధ్యాలను నియంత్రించుకుంది. ఇప్పుడు వారు కులవ్యవస్ధను రద్దు చేసుకొని హిందువులందరూ సాంఘికంగా సమానులే అని చెప్పడానికి సిద్దపడుతున్నారు. కాబట్టి మనమంతా ఈ “దళిత గోవిందం”ని సాదరంగా ఆహ్వానిద్దాం.

*ఈ దళిత గోవిందాన్ని దళిత ముస్లిములకు కూడా పొడిగిస్తే బాగుంటుంది. వారి తాత ముత్తాతలు కూడా హిందువులే… షేక్ శ్రీనివాసరావు, ఇబ్రహీం రాజు, మక్బూల్ నాయుడు, అహ్మద్ రెడ్డీ, గనీఖాన్ చౌదరి, సులేమాన్ మాదిగ…. మొదలగు వారు ఈ దళిత గోవిందాన్ని గురించి ఆలోచిస్తారు.ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిం సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ "స్వర్ణ పుష్పార్చన" లేదా "అష్టదళ పాద పద్మారాధన" చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన రెండు మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.
http://ravindrasriramanujadasan.co.cc/tirumala/impq/tfaq13.html

* హిందూత్వాన్ని ఒక మతంలా చూడకుండా ఒక జాతిగా చూడాలని హిందూనాయకులు కొందరు కోరుతున్నారు."భారతీయులంతా హిందువులే. హిందువులు కానివారు భారతీయులేకాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు, అది జీవనవిధానం" అని చెప్పిన ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ నిర్వచనం ప్రకారం మనదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే .భారతీయ ముస్లిములు,క్రైస్తవులు- హిందువులు కాకుండా ఎలా ఉంటారు?నేనూ హిందువునే .ఈ కర్మ భూమిలో భారతీయుడిగా పుట్టినందుకు సంతోషిస్తాను.హిందూ అనేది నా జాతి.తెలుగు వాడిగా పుట్టటం నాకు లభించిన వరం.ఎంతో తపస్సు చేస్తే గానీ ఈ తెలుగు జన్మ లభించదు. "ఆంధ్రత్వమాంధ్ర భాషాచ నాల్పశ్ఛ తపసః ఫలమ్‌" అనే వాక్యాలు నా విలువను పెంచాయి. తి.తి.దే.మత పెద్దలు కులవివక్ష నిర్మూలించటానికి ఈ పధకాన్ని రూపొందించారు. అందరు హిందువులు సాంఘికంగా ఆధ్యాత్మికంగా సమానులేనని చెప్పటమే ఈ కార్యక్రమ ఉద్దేశం. మన భారతీయ ముస్లిములు, క్రైస్తవుల పూర్వీకులు అరబ్ దేశాలనుండి రాలేదు. వారికీ పాకిస్ధానీయులకు ఎలాంటి సంబంధం లేదు. ఆత్మ గౌరవంకోసం, సాంఘిక సమానత్వం కోసం తపిస్తూ ఈ కులవివక్షను తట్టుకోలేక విసుగు చెంది ఇస్లామునీ,క్రైస్తవాన్నీ అంగీకరించి స్వీకరించి వుంటారు.
ఒకవేళ తి.తి.దే. ఇలాంటి వాళ్ళందర్నీ హిందూత్వంలోకి తిరిగి మార్చటానికి మార్గాన్ని తెరిస్తే అది మంచి పరిణామమే.హిందువులు అంత తేలికగా ముస్లిములుగా లేదా క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు? ధనం కోసమా? లేక సాంఘిక ఐక్యతతో కూడిన ఎగువస్దానం కోసమా? లేక రెండింటి కోసమా? విశ్వాసం మీద, సిద్ధాంతాల మీద ఆధారపడిన ఆధ్యాత్మిక తౄప్తి కూడా వారి మీద ప్రభావం చూపుతుంది. కాని దానివల్ల భౌతికంగానో, ఆధ్యాత్మికంగానో ఉపయోగం ఉండాలి. ఇన్నాళ్ళూ దళితులను దేవాలయాల్ని దర్శించటానికి, పూజారులవటానికి, వేదాలు నేర్చుకోవడానికి అనుమతించలేదు, కాని ముస్లిములు, క్రైస్తవులు వారిని సోదరులుగా మనస్పూర్తిగా ఆదరించి పాస్టర్లుగా, ముల్లాలుగా చేశారు. హిందూ పెద్దలు ఇప్పటికైనా వారి తప్పుని తెలుసుకొని తప్పును సరిదిద్దుకుంటున్నారు. కాబట్టి అందరూ ఈ విప్లవాత్మకమైన పరిణామాన్ని ఆహ్వానించాలి. భవిష్యత్తులో అణగదొక్కబడిన కులస్దులకు హిందూత్వంలో ఏ మాత్రం సమాన హక్కులు ఇచ్చి సంఘంలో గౌరవంగా చూస్తారో మనమంతా వేచి చూడాలి. నన్ను హిందూత్వంలోకి ఆహ్వానించి బ్రాహ్మణుడిగానో, రెడ్డిగానో, రాజుగానో, కమ్మగానో చేస్తే ఆనందంగా స్వీకరిస్తాను.అందుకోసం నా బి.సి.రిజర్వేషన్ను కూడ వదులుకుంటాను. ఎందుకంటే మా తాత ముత్తాతలు పూర్వీకులు ఏ కులం నుంచి ఇస్లాంలోకి మారారో, నాకు తెలియదు.అలా మార్చటం కుదరదంటే హిందువులకు ఒకే ఒక మార్గం మిగిలింది: అదేంటంటే నాలుగు వర్ణాలను వందలాది కులాలను నిర్మూలించటం, అందర్నీ హిందువులని పిలవటం. దేవుడు ఒక్కడే కాని వేలపేర్లుతో పిలుస్తున్నారు. అతను ఎవరో తెలియదు, ఎవరికీ కనిపించడు కాని ఆయన సృష్టించిన దళితులు, ముస్లిములు మన తోటి సహోదరులు. వారు మనకు మనలాగే మనంత సమానం. కులవివక్ష వర్ణవివక్ష అనేది మనిషి సృష్టించిన ఘోర పాపం. ఈ దళిత గోవిందం ద్వారా ఆ పాపకార్యానికి ప్రాయశ్చిత్తం జరుగుతోంది.

* మన తప్పులేకపోయినా మతవాదులు మానవత్వాన్ని మరచి మనపై ఆధిక్యాన్ని సంపాదించటానికి మనల్ని అనేక కులాలుగా విభజించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు కులం గురించి తెలియదు కాని కాలక్రమేణా దాని గురించి తెలుపుతాము, ఎంత నీచమైన పద్దతి? ఎవరైనా తప్పు చేస్తే దాని ఆధారంగా కొన్ని తరాల తరువాత వారి వారసులను శిక్షించొచ్చా? అది ఎంత వరకు న్యాయం? గొర్రెపిల్ల, తోడేలు కధ మనకు గుర్తు రావడంలేదా?
మనలో ఉన్న శక్తిని అంతఃకరణ శుద్ధికి వెచ్చిద్దాం. మన నమ్మకాలని మనం తేలికగా విడిచిపెట్టలేము. ఎవరు ఎలా పని చేయాలి? ఏ క్రమంలో, ఏ పద్ధతిలో చెయ్యాలో మన మతాల పెద్దలు నిర్ణయించారు. అవి ఎంతవరకు న్యాయబద్ధంగా ఉన్నాయో విశ్లేషిద్దాం. లోపాలుంటే సరిచేద్దాం. అప్పుడే ఆధ్యాత్మిక సంతోషాన్ని పొందగలుగుతాము.
మన ధ్యాసంతా తప్పుడు పనులమీద ఉంది. మరో పక్క ప్రపంచం మంచిగా మారుతూ ఉంది.
మంచి మార్పుల్ని మనమూ స్వీకరించాలి, మారాలి.
ఆర్యులు భారతదేశానికి వలస వచ్చి కులవ్యవస్థను స్థాపించారని రొమిల్లా తాపర్ చెప్పారు.సెల్యులార్ అండ్ మోలికులర్ బయోలజీ హైదరాబాద్ డైరెక్టర్ లాల్జిసింగ్ ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 తర్వాత నుండే భారతదేశానికి వచ్చారనీ, కుల వ్యవస్థ అనేది 8000 సంవత్సరాల క్రితమే ఏర్పడిందనీ అంటే మనిషి వేటాడడం నుండి వ్యవసాయానికి మారిననాటి నుండే ఏర్పడిందనీ చెప్పారు.
మన ఆలోచనలు ఇతరులకు శక్తినివ్వాలి. అవి ఇతరుల్ని మానసికంగా అణచివేయకూడదు.
అవి తిరోగమనంగా, వక్రంగా ఉండకూడదు. అవి ఇతరుల బుద్దిని హరించి అశక్తుల్నిగా చేయకూడదు. అనుత్పాదకంగా ఉండకూడదు.
కుక్కలు చింపిన విస్తరిలా చిరిగిపోయి చిన్నాభిన్నమై నిరాశతో ఉన్న దేశంలోకి ఒక కొత్త ఊపిరిని ఆశను తెద్దాం. వివేకవంతమైన ఉత్పాదకమైన ఆలోచన అశక్తులకు సరైన దారిని చూపిస్తుంది,నడిపిస్తుంది. అవివేకులను ఉత్తేజ పరుస్తుంది. అణగారిన వర్గాలను లేపుతుంది. ప్రతి మనిషికీ అంతులేని తెలివి ఉంటుంది. మనం బలంగా తయారవటానికి ఇతరులపై పడి దోచుకోవడం మానుకుందాం. మరొకరి చాకిరినీ, మేధాశక్తినీ ఉపయోగించుకొని బలంగా, మందంగా, కావరంగా తయారవ్వకూడదు.
ఇతరుల శక్తియుక్తులను పిండుకుని బలంగా అహంకారులుగా తయారవ్వటం అభివృద్ధి యొక్క ప్రామాణిక న్యాయ సూత్రాలను అతిక్రమించినట్లే.
మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం ప్రతి ఒక్కరికీ తెలిసుండాలి. తన కడుపూ తన స్వార్ధమే పరమార్ధమనే భావన జాతి నాశనానికి దారి తీస్తుంది.
“మీరు పెరగాలంటే ఇంకొకరు తగ్గాలా? మీరు ఇష్టులుకావాలంటే, ఇతరులు అంటరానివాళ్ళు కావాలా?
ఇతరులు మాత్రం అల్పులుగా, స్వల్పులుగా ఉండాలా?” ఇదే మీలో ఉన్న వినాశకర శక్తి.
మర్యాదస్తుడు మరొకరికి మర్యాదనిస్తాడు తనతో సమానగౌరవం ఇస్తాడు. నిరంకుశుడు ఇతరులకు స్వేచ్చను ఇవ్వడు. ఎల్లప్పుడు ఏది మంచో ఏది చెడో చెబుతూనే ఉండాలి.
స్వేచ్చ కోసం సమానత్వం కోసం, సోదరభావం కోసం పోరాటం చేయాలి. మిగతా ప్రజల్ని కూడా ఆలోచించి స్వేచ్చగా మాట్లాడనివ్వండి. స్వతంత్రంగా ఆలోచించటానికి సాహసం చేయండి, ఇతరులు కూడా స్వతంత్రంగా ఆలోచించేలా చేయండి.
అభివృద్ది పెరుగుదల అందరి హక్కు అనే ప్రాధమిక న్యాయసూత్రాన్ని గౌరవించండి. ఓ వ్యక్తి అభివృద్ది చెందడం, సమర్ధత ద్వారా సాధించడం అనేవి అవకాశాలు, అతనిలో దాగి ఉన్న నిపుణత మీద ఆధారపడి ఉన్నాయి. అతన్ని శత్రువుగా భావించి అణగదొక్కకూడదు.ఇతరులని పీడించి నాశనం చేయటానికి సమయాన్ని, ఆలోచనని, శక్తిని వృదాచేయవద్దు.ఉపయోగకరమైన గొప్ప పనులకోసం శక్తిని వెచ్చించండి.
మీలోని శక్తిని ప్రజావ్యతిరేకంగా వాడకండి.సంఘాన్ని విచ్చిన్నం చేయకండి. అందరి ఐక్యత కోసం అంటరాని తలంపుల్ని వదులుకోండి. అందర్నీ రానివ్వండి.అందరితో కలవండి.అదే పనిగా పడిన దెబ్బలు శతాబ్దాల తరబడి దళితుల్లో,మైనారిటీలలో సృజనాత్మకతను, సకారాత్మక స్పందనను చంపేసాయి.అవమానాన్ని, పేదరికాన్ని తలరాతగా భావిస్తూ జీవనాన్ని గడుపుతున్నారు. పరాజితులై అవమానంతో నిరాశ చెందడం వల్ల వారిలో ఇక పైకి లేవాలి అనే చైతన్యం, శక్తి నశించింది. నకారాత్మక శక్తి ఆవరించింది.
నిరాశావాది తన నైరాశ్యాన్ని తలరాతగా భావిస్తూ తననుతానే శిక్షించుకుంటాడు.తాను ఎవరో, ఎందుకు పుట్టాడో, తానెలా ఉండాలో అన్నీ సోదాహరణంగా తెలుసుకుని నోరు మూసుకుని బ్రతుకుతాడు. నోరు విప్పినా, కాలు కదిలినా ఏం జరుగుతుందో అతనికి తెలుసు. అందుకే అతను తనపైతానే జాలి పడతాడు. తన మీద తనకే రోత కలుగుతుంది కాబట్టి తనను తాను తిరస్కరించుకుంటాడు. బాధే సౌఖ్యమనే భావనతో ఉంటాడు. మిగతావాళ్ళతో నేను సమానుణ్ణి కాదనుకుంటాడు. కాబట్టి పోటీపడే శక్తులన్నీ పోగొట్టుకుని అడుక్కు తినే స్వభావాన్ని పెంచుకుంటాడు. మరొకరి అదుపాజ్ఞల్లో బ్రతకడంలోనే ఆనందిస్తాడు.
ఆధ్యాత్మికమైన స్వేచ్చ సృజనాత్మక శక్తికి జీవాన్నిస్తుంది. ఆధ్యాత్మికమైన స్వేచ్చ మనిషి ఎదుగుదలకు అపార అవకాశాలనిస్తుంది. దళిత గోవిందం ఈ ఆధ్యాత్మికమైన స్వేచ్చను ఇచ్చే ఒక ఆశాకిరణం.
మారిన వ్యక్తి తనను తాను తెలుసుకుంటాడు. తనకు తాను సంపాదించుకుంటాడు.
అతని మనసు ఉత్తేజితమై వెలుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు చీకటి గుహకు సూర్యుని కాంతి, చంద్రుని కాంతి ఎట్లా ఉంటుందో తెలియకపోవచ్చు. కాని చిన్న దివిటీ కాంతి రెప్పపాటు కాలంలో చీకటిని చీల్చి వెలుగు తెస్తుంది. అలాగే
వందల సంవత్సరాల తరబడి రాజ్యమేలిన హిందూ చీకటి తనంపై ఈ దళిత గోవిందం తన వెలుగును ప్రసరించింది. సాంఘిక, ఆధ్యాత్మిక సమానత్వం వైపు దారి చూపింది. దైర్యమిచ్చింది. అడుగులు వేయించింది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలి. అన్ని దేవాలయాల వాళ్ళూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర రెడ్డినీ,పాల్గొన్న అర్చకులను అభినందిద్దాం.(నేను 2007 లో రాసిన వ్యాసం).
అలాగే కల్యాణమస్తు కూడా.2006 వ సంవత్సరంలో బోర్డు ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2007 ఫిబ్రవరి 21 న దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అంకురార్పణ జరిగింది.సరాసరి ఒక్కో జంటకు రూ 7 వేల వరకు వ్యయం అవుతున్నది.ఇప్పటివరకూ 34,017 జంటలను ఒక్కటి చేసిన టిటిడికి అయిన ఖర్చుసుమారు 24 కోట్ల రూపాయలు.స్వామిని దర్శించి,ముడుపులు చెల్లించే వారిలో తమిళనాడు, కర్నాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుకూడా ఉన్నారు కనుక కళ్యాణమస్తును దేశ వ్యాపితం చేయాలని కొందరు వాదిస్తున్నారు.బంగారపు తాళిబొట్టు, వెండి మట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లిసామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్లి భోజనాలు ఉచితంగా కల్పిస్తున్నది.చౌకగా జరిగే ఇలాంటి మూకుమ్మడి కళ్యాణాలకు గౌరవంతక్కువ అనే భావనతో ప్రజలనుండి తగినంత స్పందన లేదు.రాష్ట్ర వ్యాపితంగా ఈ కార్యక్రమాన్నిఏడాది పొడవునా కాకుండా ఏడాదికి ఒక్క రోజుమాత్రమే చేపట్టటంతో నిరాశ చెందుతున్నారు.గోదాదేవి లాగానే బీబీ నాంచారి అనే ముస్లిం స్త్రీ కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతర వివాహాలు కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని సుబ్బన్న శతావధాని చెప్పారు.http://beta.thehindu.com/arts/books/article415269.ece .శ్రీవేంకటేశ్వరుని పై భక్తి విశ్వాసాలున్న హిందూ-ముస్లిము జంటలకు కూడా కళ్యాణమస్తు కార్యక్రమం విస్తరించి మతసామరస్యం,లౌకికత్వం బలపడేలా చెయ్యాలని వేంకటేశ్వరుని పై భక్తి విశ్వాసాలున్నముస్లిములు కోరుతున్నారు.

22 కామెంట్‌లు:

  1. abba..enta adbutam gaa undi andi mee vyaasam..One of the best articles I have ever read in my life...keep writing sir..

    రిప్లయితొలగించండి
  2. .... దేవస్థానం చైర్మన్ కరుణాకర రెడ్డి ....

    ఒక కిరస్తానీని (కరుణాకర రెడ్డి) తమ పవిత్ర మైన దేవాలయానికి చైర్మన్ గా ఒప్పుకున్న హిందువులు గొప్పవారు. ఇది కని విని ఎరుగని విషయము.

    ఈ విదముగా ఒక హిందువును, చెర్చ్ లు manage చెయడానికి నియమించ గలిగినప్పుడే, India can see real progress.

    రిప్లయితొలగించండి
  3. మీరు చెప్పింది బాగానేవుంది. కరక్ట్గా చెప్పారు. కాని , హిందూ మతాన్ని మీరు సంస్కరించుకునేముందు, మీరు మీ మహోతృష్టమైన ఇస్లాంను సంస్కరించాల్సిన అవ్సరం వుందా లేదా అని ఓ సారి చూసుకోండి. ఇస్లాంలో వున్న కులాల మాట ఏమిటి? 'కులాలు ' అని హిందువులంటే మీరు సున్నీ, షియా, అహమ్మదీయ, దూదేకుల వర్గాలు అని అంటారు. షియాలమీద , అహమ్మదీయుల మీద సున్నీ ఇస్లాం దేశాల్లో జరుగుతున్న మారణహోమం గురించి మాట్లాడండి, వింటాం. తస్లిమా పై భౌతిక దాడులు చేసిన ఎం.ఐ.ఎం నేతలకు మీ సిద్ధాంతాలు వినిపించండి.

    ఏదో సంఘసంస్కర్త లా పోజులు తరవాత. మీ కింది నలుపు మీరు గుర్తించండి, సార్. హిందుఊ మతం మీలాగా ఓ బుక్కు ఫాలో అయ్యేది కాదు. కులదురహంకారం, ఎక్కువ తక్కువలు సొసైటీ లో వచ్చిన మార్పులు, మతం సృష్టించినవి కావు అని ఏ కొంచెం పురాణ జ్ఞామ వున్న వాళ్ళకైనా అర్థమవుతుంది.
    ఉ.దా: యాదవుడైన కృష్ణుడిని ఆరాధించే వైష్ణవులు, బెస్త మత్సగందిని పెళ్ళిచేసుకున్న క్షత్రియ రాజు శంతనుడు

    కులవ్య్వస్థ నుంచి ఎవరికీ ఇబ్బందిలేదు, కులగజ్జి , దురహంకారం వల్ల వుంది. దళితగోవిందం లా ముస్లిం గోవిందం అని మీరు రహంతుల్లా అనే పేరుతో అనగలరు, ఆమాట ఏ రెడ్డి, నాయుడో అంటే ఫత్వాలు జారీ అయ్యేవి. మీకు హిందూ మతం మీద విశ్వాసం వుంటే ఆర్యసమాజ్, హరేరాం హరేకృష్ణ లాంటి సమ్ష్థల్ద్వారా హిందువు కండి, ఎవరొద్దన్నారు? అలీఖాన్ అనే హిందూస్థానీ సితార్ పండిట్ రుద్రాఖలు వేసుకుని, తిలం పెట్టుకుని యు ట్యూబ్లో బాహాటంగా తన హిందూ విశ్వాసాలపై గౌరవం చాటుకున్నాడు, వెతికి చూడండి.

    అంచేత నే చెప్పోచేదేమంటే ... ముందు ఉగ్రవాద ఇస్లామ్ను, అందులోని కౌల వ్యవస్థను సంస్కరించండి. ఆ తరువాత హైయర్ లెవల్స్ గురించి చూద్దాం అని నా మనవి.

    రిప్లయితొలగించండి
  4. ఇది కొంచెం కొంచెం గా జఱగాల్సి ఉంది. ఒక్కసారిగా జఱగదు. ముందు కులాల్లోని ఉపకులాలూ, శాఖలూ నిర్మూలన కావాలి. ఆ తరువాత ఒకే వృత్తి చేసే రెండుకులాలు ఒకే కులంగా కలిసిపోవాలి. ఆ తరువాత దళితులంతా ఒకే కులం అవ్వాలి. అగ్రవర్ణాలన్నీ కలిసి ఒకే కులం అవ్వాలి. మిగతావారంతా ఒకే కులం అవ్వాలి. ఈ ప్రాసెస్ లో మొదట్లో కొంచెం సామాజిక ఘర్షణ ఉంటుంది. కానీ ప్రపంచం అనివార్యంగా ఏకత్వం వైపు ప్రయాణిస్తున్నది కనుక నెమ్మదిగా అందఱూ ఒకే కులంగా మారతారు, ఒకటి-రెండు శతాబ్దాలలో నైనా !

    రిప్లయితొలగించండి
  5. రహంతుల్లా గారు... మీ ఆలోచనని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. నిజానికి భారతీయులందరిదీ సామూహికంగా ఒక జీవన విధానం. ఇది మత తత్వానికి అతీతమయినది. మధ్యయుగాల్లో వేళ్ళునిన కులతత్వాన్ని రూపుమాపి ప్రాచీన వైదిక జీవిన విధానాన్ని పునరుద్ధరించగలిగితే, అది ప్రపంచంలోనే ఒక అధ్భుతమయిన సమాజంగా రూపుదిద్దుకుంటుంది. మొన్న మా డ్రైవర్ బాషా వాళ్ళమ్మాయి నిశ్చితార్ధం జరిగితే, అక్కడ అన్నీ హిందూ సాంప్రదాయ పద్దతిలో జరగడం చూసి ఆశ్చర్యపోయాను. పంతులుగారి దగ్గర ముహూర్తం పెట్టించండం నుండి, అక్షింతలు చల్లడం వరకు ఇంచుమించు అన్నీ మా పద్దతిలోనే జరిగాయి. చర్చ్ లో పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుని, ఉంగరం మార్చుకొనే వారిని ఎంతో మందిని నేను చూసాను. అందుచేతనే దీన్ని ఒక మత విధానంగా చూసే బదులు ఒక జీవన విధానంగా అందరూ గుర్తించాలి. మీరు పైన చెప్పినట్లుగా ఇక్కడ ఎవరూ నిజమయిన ముస్లింగాని, నిజమయిన క్రిష్టియన్‌గాని ఉండరు. అందరు వారి వారి చారిత్రక, సామాజిక, ఆర్ధిక కారణాల వల్ల వైదిక మతం నుండి మార్చబడినవారు మాత్రమే. అటువంటి వారినందరినీ మరలా వారి పూర్వ మూలాలికి కొనిపోవడానికి తప్పనిసరిగా మంచి ప్రయత్నం జరగాలి. మంచి పోస్ట్ రాసినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  6. అంతటి మహోతృష్టమైన ఇస్లాంలో వుంటూ మళ్ళీ 'దళిత ముస్లిం గోవిందం ' గా పొడిగించడం ఎందుకండి? ఇప్పుడు మీకు అక్కడ ఏమి తక్కువైందని? ఇక్కడ బాగలేదు అనే కదా అక్కడికెళ్ళారు, మళ్ళీ పొడిగించమని అంటున్నారు!? కొన్నాళ్ళు ఆగండి అంతా ఒకేచోటికి పోయేటోళ్ళమే.

    ఇక్కడ మతం మారణకాండల్లేవు, చంపమని ఫత్వాలిచ్చే మతాచార్యులు లేరు, సున్నీలు, ఖుర్దులు, అహమ్మదీయుల వూచ కోతలు లేవు ఏదో చిన్న చిన్న సాంఘిక దురాచారాలు తప్ప. అవి మతం చెప్పినవి కావు. కురువంశ రాజ మాత ఓ బెస్తపిల్ల అని మీకు తెలియనిది కాదు. మీరక్కడినుంచి మొదలెట్టి సంస్కరించుకుంటూ రండి. హిందవాన్ని ఆతరువాత చూద్దాం.
    హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ తాను హిందువునని ప్రకటించుకొందట, ఆపని మీరూ చేయవచ్చు, మరీ అంత ప్రేమ వుంటే

    రిప్లయితొలగించండి
  7. @indrathinks,durgeswara,ఎస్పీ జగదీష్
    ధన్యవాదాలు.
    @అజ్ఞాత,snkr
    20.8.2010 నాటి గీటురాయి సంపాదకీయం లో ఇలా రాశారుః
    "ముస్లింలలో సహనం,దాతృత్వ గుణాల పెంపుదలకై దేవుడు ప్రతి ఏటా రంజాన్ ఉపవాసాలద్వారా నెలరోజులపాటు శిక్షణ ఏర్పాటు చేశాడు.కనీసం ఈ శిక్షణ కాలంలో మనల్ని మనం సంస్కరించుకోకపోతే ఉపవాసాలవల్ల ప్రయోజనం ఏమిటి?గందరగోళాల జోలికి పోని ఉపవాసకులే రంజాన్ శుభాభినందనలకు అర్హులు"
    హింసాత్మక ధోరణిని సంస్కరించేందుకు,అరికట్టేందుకు అనేకమంది అభ్యుదయవాదులు ముస్లింలలో కృషి చేస్తున్నారు.వారిని ప్రోత్సహించండి.ఇన్నాళ్ళూ వేరే భాషలో ఉన్న ఆ మతబోధనలు మన మాతృ భాష తెలుగులోకి వస్తూ ఉన్నందువల్ల అర్ధంచేసుకొని క్రమేణా ప్రశ్నించే తత్వం తెలుగు ముస్లిముల్లో వస్తూ ఉంది.

    రిప్లయితొలగించండి
  8. అది సరే నండి. దళిత ముస్లిం లకు గోవిందం పొడిగించమని కోరారు ఎందుకు?

    ఆ టైటిల్ కింద హిందూ కులవివక్ష అన్నారు, అది సాంఘిక దురాచారం, హిందుత్వంతో పనిలేదు, అంత తీవ్రమైనదీ కాదు అని నేనంటున్నాను. ప్రపంచమంతా హడలెత్తిస్తున్న ఉగ్రవాదమతమేదో పేపర్ చూస్తే తెలుస్తుంది. ఆ ఉద్ధరించడమేదో అక్కడ నుండి జరిగితే హిందువులొక్కరే కాదు, బౌద్ధులు, కమ్యూనిస్ట్లు, క్రిస్టియన్లు,యూదులు, అంతా ప్రోత్సహిస్తారు.

    రిప్లయితొలగించండి
  9. @snkr
    కులవివక్ష,ఉగ్రవాదం రెండింటినీ నిరసిస్తాను.దళిత ముస్లిం లకు గోవిందం పొడిగించమని కోరటానికి కారణం తెలుగుముస్లిముల్లో ఉన్న లక్షలాది హిందూ భక్తులకు కూడా ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని.శ్రీవేంకటేశ్వరుని రెండవ భార్య ముస్లిం స్త్రీ అని మా నమ్మకం.ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.ఆమె వారసులమని చెబుతూ మా బంధువుల్లో కొన్ని వందల కుటుంబాలు వెంకన్న కు ముడుపులు కడుతున్నాయి.అదే నా ధైర్యం.విజయవాడ వస్తే ఎన్నో గ్రామాల్లో తిప్పి చూపిస్తాను.ముస్లిములు ఆ వెంకన్నను ఇష్టపడి నాంచారమ్మ లాగా మతం మారదలుచుకుంటే ఆమెను వెంకన్న చేర్చుకున్నట్లుగా హిందువులు చేర్చుకోవాలని నా కోరిక.

    మత ఉద్ధరణ గురించిః
    భారతీయ ముస్లిములు హజ్ యాత్రకోసం చేసే ఖర్చు,ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పేదముస్లిముల సంక్షేమానికిస్తే పెద్ద ఉద్ధరణే జరుగుతుంది.గుళ్ళలో,మసీదుల్లో బాంబులు పెట్టే రాక్షసులవల్ల మత ఘర్షణలు పెరుగుతాయే కానీ ఎవరూ మారరు.మార్పు ప్రేమ ద్వారానే కలుగుతుంది.

    రిప్లయితొలగించండి
  10. ఈ పైన కొన్ని వ్యాఖ్యల్లో కొంత ఎకసక్కెం ధ్వనిస్తున్నట్లున్నది. విభేదించక తప్పడం లేదు. లోపాలు లేని మతమంటూ ఏదీ లేదు. ఏ మతం నుంచైనా మనక్కావాల్సిన మంచిని ఏరి తీసుకొని మిహతావాటి సంగతి మర్చిపోవడమే దేవుడిచ్చిన పరిమితాయుర్దాయకాలంలో మానవులుగా మన కర్తవ్యం. ప్రపంచంలో 100 కోట్లమంది ముస్లిములున్నారు. వారిలో కొన్నివేలమంది మాత్రమే హింసాయుత చర్యలకు పాల్పడుతున్నారు. తతిమ్మా అందఱూ హిందువుల/ క్రైస్తవుల మాదిరే అతిసామాన్యమైన, అతిసాధారణమైన జీవితాలు గడుపుతున్నారు. కనుక సంస్కరణవాదులైన ముస్లిములకు పదేపదే ఆ తీవ్రవాదుల సంగతి జ్ఞప్తికి తెచ్చి వారిని మానసికంగా గాయపఱచడం సరికాదు.

    హిందూమతంలో మర్యాదా, మన్ననలకు నోచుకోక ఇస్లాముకి వలసపోయిన తెలుగు ముస్లిములకు దళితగోవిందం లాంటి కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక హక్కుల్ని, హోదాని, గౌరవాన్ని కల్పించి హిందూధర్మంలో వారు ఇదివఱకు పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి ఇవ్వాలనేది రచయిత ఉద్దేశంలా నాకు తోస్తున్నది. అదే నిజమైతే నాకు ఆ ప్రతిపాదనలో తప్పేమీ కనిపించడం లేదు. మన ముస్లిములెవఱూ అరేబియా నుంచి వలసరాలేదు. వీరంతా అనాదిగా స్థానికులే, మనవారే, మనలో భాగమే, మన రక్తమేనని గమనించగోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
  11. తాడేపల్లి గారూ
    నా అభిప్రాయాన్ని చక్కగా అర్ధంచేసుకొని స్పందించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. " హిందూ మతానికి ఈ రోజు కుల వ్యవస్థే ప్రధానశత్రువు"
    రహంతుల్లా గారు మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు సత్యం. కాని ఇప్పుడు ఏం చేయగలం?

    రిప్లయితొలగించండి
  13. ప్రతి కులం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కులం మారే అవకాశం ఎవరికీ ఉండదు.సమాజం విస్తరించకుండా ఇతర మతస్థులను కలుపుకోకుండా కులమే అడ్డుపడింది. కులాలున్నంతవరకు మతం విశ్వజనీన సేవా మతం కాలేదు.కులం సంస్కర్తలనూ,సంస్కరణ లనూ నాశనంచేసే ఆయుధం .తన కులంకాని వాడిలో ఉన్న ప్రతిభ ను ప్రశంసించే శక్తి కులంలో ఉండదు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ను సమూలంగా తుడిచిపెట్టారు.కులాంతర మతాంతర వివాహాలు కొన్ని దశాబ్దాలపాటు నిర్బంధం కావాలి.కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నవారికే రిజర్వేషన్లు పరిమితం చెయ్యాలి.కులాంతర/మతాంతర వివాహాలు భారీగా చేయాలి. తి.తి.దే.వారి కళ్యాణమస్తు కార్యక్రమం కులాంతర/మతాంతర వివాహాలకు మాత్రమే పరిమితం చెయ్యాలి.హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగటం వల్ల కులనిర్మూలన జరుగుతుంది.

    రిప్లయితొలగించండి
  14. ఆర్థిక సమానత్వం లేకపోతే సామాజిక సమానత్వం రాదు. ఈ లింక్ చదవండి: http://telugu.stalin-mao.in/33533830

    రిప్లయితొలగించండి
  15. /కులాంతర మతాంతర వివాహాలు కొన్ని దశాబ్దాలపాటు నిర్బంధం కావాలి/
    హ్వ్హాహ్వాహ్వా కల్నల్ గడ్డాఫీ, సద్దాం హుసేన్, ముల్లా ఓమర్,మావో సే టుంగ్, అసాద్‌ల పాలనలోనే అలాంటి ఫత్వాలు/చట్టాలు అవుతాయేమో.
    /తి.తి.దే.వారి కళ్యాణమస్తు కార్యక్రమం కులాంతర/మతాంతర వివాహాలకు మాత్రమే పరిమితం చెయ్యాలి/
    అంటే మత ధార్మిక సంస్థల్లో రాజకీయ జోక్యాలు అవసరమని మీరు భావిస్తున్నారా? వ్యక్తి మత స్వేచ్చను కాలరాయమని మన రాజ్యాంగలో లేదండీ, రహంతుల్లా గారు. మీ వుద్దేశ్యాలు మంచివే, ఆచరణ చేయాలన్న విధానాలు సరైనవి కావనిపిస్తోంది. :)

    హిందూ జీవనవిధానంలో ప్రతి కులమూ ఓ తెగ/శాఖ అనుకోవాలి. అంటే.. సున్నీ, షియా, వహాబీ, బహాయ్, సూఫీ, అహమ్మదీ, దూదేకుల... ఇవన్నీ ఇస్లాం అయినట్టు.

    రిప్లయితొలగించండి
  16. "భారతీయులంతా హిందువులే. హిందువులు కానివారు భారతీయులేకాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు, అది జీవన విధానం.--ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (సాక్షి 1.3.2010) ఈ విస్తృత నిర్వచనం ప్రకారం మనదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే కదా?భారతీయ ముస్లిములు,క్రైస్తవులు- హిందువులు కాకుండా ఎలా ఉంటారు?
    http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%A4_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82 చూడండి.

    రిప్లయితొలగించండి
  17. దళిత గోవిందం మాకొద్దు గానీ మీరుంచేసుకోండి
    రహమతులా గారూ !
    ఇంతకీ దళిత గోవిందం తర్వాత మీదే కులమో చెప్పాలి మరి.
    హిందువుగా మతం మారితే అప్పుడు మీదే కులమో చెప్పాలి మరి
    మర్చిపోవద్దు సుమా !

    తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

    రిప్లయితొలగించండి
  18. విల్సన్ సుధాకర్ గారూ తాడేపల్లి గారి వ్యాఖ్యానం లో మీకు సమాధానం ఉంది.

    రిప్లయితొలగించండి
  19. దళిత గోవిందం కార్యక్రమంలో రాజకీయ నాయకుల్ని కుర్చీల మీద కూర్చోబెట్టి దళితులని నేల మీద కూర్చోబెట్టడం బహిరంగంగానే జరిగింది. దాన్ని ముస్లింలకి కూడా వర్తింపచేస్తే మజ్లిస్ నాయకుల్ని కుర్చీల మీద కూర్చోబెట్టి మెహతర్, ఖస్సాబ్ లాంటి కులాలకి చెందిన ముస్లింలని నేల మీద కూర్చోబెడతారు. ఆర్థిక సమానత్వం లేనప్పుడు సామాజిక సమానత్వం గురించి మాట్లాడితే జరిగేది ఇదే.

    రిప్లయితొలగించండి
  20. Dear sarma garu,

    we are opposing your comment because of islam is a unique system we oppose shirk(vigraha puja)so please dont confuse people

    thank you

    రిప్లయితొలగించండి
  21. కబుర్లు ఎందుకు సలీం గారు? మజ్లిస్ నాయకుడు ఏర్పాటు చేసే ఇఫ్తార్ పార్టీలో పేద ముస్లింకి ప్రవేశం ఉంటుందా? ఏ మతమైనా ఊహాజనితమే. సమాజాన్ని ప్రభావవంతంగా శాసిస్తున్నది డబ్బు ఒక్కటే కానీ మతం కాదు.

    రిప్లయితొలగించండి