ఈ బ్లాగును శోధించు

25, ఆగస్టు 2013, ఆదివారం

దళిత ముస్లింల దీనస్థితి


దళిత ముస్లింల దీనస్థితి (నమస్తే తెలంగాణా 14.7.2013)

దళితులంటే అందరికీ తెలుసు.కానీ దళిత ముస్లింలంటే.. వీరెవరు? అనేది ముస్లింలలోనే కాదు, ముస్లిమేతరుల మెదళ్లలోనూ మెదిలే ప్రశ్న. సమాజంలో అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ..,ఏ సామాజిక గౌరవం, గుర్తింపుకు నోచుకోని ప్రజలు దళిత ముస్లింలు. అనేక అపరిశుభ్ర (అంటరాని వృత్తులు) పనుల్లో జీవిస్తూ.. సమాజంతో ఈసడింపుకు గురవుతున్న వారే దళిత ముస్లింలు. దళిత ముస్లింలది సుదీర్ఘ చరిత్ర. బ్రిటిష్ ప్రభుత్వం 1901లో చేపట్టిన జనాభా లెక్క ల ప్రకారం భారతదేశంలోని ముస్లింలలో 133 కులాలను (వర్గాలు లేదా గ్రూపులు) గుర్తించారు.1911,1932,1935 సంవత్సరాల్లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన జనగణన తర్వాత 96 కులాలను దళిత ముస్లింలుగా షెడ్యూల్డ్ చేసి, వీరికి 1936 నుంచి ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు కల్పించింది. వీటిని దళితముస్లిం వర్గాలు 1950 జూలై వరకు పొందారు. ఇప్పటికీ లక్షదీవుల నుంచి ఎస్టీ రిజర్వేషన్ ద్వారా ఎంపీలుగా ఎన్నుకోబడుతున్నారు. కానీ 10- 08-1950న కాన్సిట్యూషనల్(షెడ్యూల్డ్ కాస్ట్)ఉత్తర్వులతో (దీన్నే ప్రెసిడెన్సియల్ ఆర్డర్‌గా పిలుస్తారు)దళిత ముస్లింలకు, క్రిస్టియన్‌లకు, సిక్కులకు, బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించకుండా చేశారు.ఆ తరువాత వీరిని ఓబీసీలుగా చేసినారు. నాటి నుంచి దళిత ముస్లింలే కాకుండా సిక్కలు, క్రిస్టియన్‌లు రిజర్వేషన్లకు దూరం చేయబడ్డారు.

సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళిత ముస్లింలలో 70 శాతం విద్యార్థులు పదవ తరగతి వరకే పరిమితమవుతున్నారు.విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం70 ఉన్నది. ఉన్న త చదువుల దరిదాపులకు కూడా వీరు నేటికీపోలేదు. ఉన్నత ఉద్యోగాలు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో దేశ వ్యాప్తంగా ఒక్కరు కూడాలేరు. దళిత ముస్లింలలోని దూదేకుల లాంటి కులాల్లో ఎక్కువ శాతం కూలీలు, చప్రాసీలుగా, స్వీపర్లుగా పనిచేస్తున్నారు. దూదేకుల, మెహతర్, ఫకీరు, అత్తరు, బండలుకొట్టే కాశోల్లు, పాములు ఆడించే, గారడీ చేసే లాంటి అనేక వృత్తులు చేసేవారు ఎక్కువ శాతం ఈ దళిత ముస్లింల నుంచే ఉన్నా రు. వీరు ఈ ఆధునికకాలంలో జీవనోపాధిని కోల్పోయి అనేక అవస్థలు పడుతున్నారు. దళిత ముస్లింల్లో స్వంత భూములున్న వారు అరుదు. మనరాష్ట్రంలో ముస్లిం జనాభా సుమారుగా కోటి పైచిలుకే ఉన్నట్లుగా అంచనా.దీనిలో 70శాతం దళిత ముస్లింలే. వీరిలో ఇన్నేళ్ల స్వాతంవూత్యానంతర భారతదేశంలో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన దాఖలాలు లేవు. కానీ జనాభాలో ఒక్కశాతం కూడా లేని వెలమ కులస్తులు ఎమ్మెల్యేలుగా 13 మంది ఉన్నారు. ఇంకా ఇతర అగ్రకులాల వారు సమాజంలో 4 - 6 శాతం ఉంటారు. కానీ వీరి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి సంఖ్య 100కు పైగానే ఉన్నది. జనాభాలో తొమ్మిది శాతంగా ఉన్న దళిత ముస్లింలకు ఈ ప్రజాస్వామ్యంలో చోటు దొరకలేదు.

దళిత ముస్లింల పట్ల వివక్ష సమాజంలో అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. ఏ రంగంలో చూసినా దళిత ముస్లింలకు దక్కింది శూన్యం అనే చెప్పవచ్చు.1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు పేరా 3 ప్రకారం ఎస్సీ రిజర్వేషన్‌లు కేవలం హిందూ మతంలోని దళితులకు మాత్రమే పరిమితం చేశారు. కానీ 1956లో సిక్కు మతం స్వీకరించిన దళిత సిక్కులకు, 1990లో బౌద్ధమతం స్వీకరించిన దళితబౌద్ధులకు 1950 నాటి ఉత్తర్వులను సవరించి రిజర్వేషన్లు వర్తించేట్లుగా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. దీని ప్రకారం హిం దూ మతేతర హిందూ, సిక్కు,బౌద్ధ మతాలను ఆచరించరో వారిని షెడ్యూల్డ్ కులస్తులుగా గుర్తించబడరు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనోద్యమాలు చెలరేగాయి. దళిత ముస్లింలు, క్రిస్టియన్‌లు, బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమించారు. దీంతో ప్రభు త్వం రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది. ఈ కమిషన్ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా విస్తృతంగా అధ్యయనం చేసి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు మత సామరస్యానికి, లౌకిక స్ఫూర్తికి భంగకరమని పేర్కొన్నది. రాజ్యంగ విరుద్ధమని కూడా ప్రకటించింది. దళిత బౌద్ధులకు, సిక్కులకు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. ఈనేపథ్యంలో దళిత ముస్లింలకు ఈ సామాజికాభివృద్ధిలో భాగస్వామ్యం దక్కాలంటే..ఎస్సీ రిజర్వేషన్‌లు అమలు చేయాలి. అంబేద్కర్ కృషి ఫలితంగా రిజర్వేషన్ ఫలితాలు అనుభవిస్తున్న దళితులు, ఎస్టీలు దళిత ముస్లింల సమస్యల పట్ల సానుభూతితో తోడ్పాటు నందించాలి.ఈ పరిస్థితుల్లోనే దళిత క్రైస్తవులు తాము కోల్పోయిన రిజర్వేషన్ల కోసం 2004లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్రలోని దళిత ముస్లింలు, దళిత క్రిస్టియన్‌లు దమాషా ప్రకారం రిజర్వేషన్ల కోసం పిటీషన్‌లు దాఖలు చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వీటిపై స్పందించకుండా.. కాలయాపన చేసే ధోరణితో వ్యవహరిస్తున్నది. పిటీషన్‌లకు సమాధానాలు ఇవ్వకుండా కాలం వెళ్లదీసే విధానాన్ని అనుసరిస్తున్నది. ఆంధ్రవూపదేశ్ లో కూడా దళిత ముస్లింల పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది. రాష్ట్రం లో వివిధ వృత్తు ల్లో (వీటిలతో చాలా వరకు అపరిశుభ్ర పనులే) వున్న వారిని సుమారుగా 60 దళిత ముస్లిం కులాలనున్నట్లు తేలింది. వీరిలో ప్రధానంగా దూదేకుల, హజామ్ (బార్బర్ లేక మంగలి), ఫకీరు, బుడిబుడిక్కి, పాములోల్లు, ఎలగొడ్లవారు, గారడిచేసే వారు, మెహతర్ (పాకీ పనిచేసేవారు), అత్తరు అమ్మేవారు, బండలుకొట్టేవారు. బోరేవాలా తదితర కులవృత్తుల వారున్నారు.

సమాజంలోఅట్టడుగు,అంటరాని పనులను చేస్తూ.. సామాజిక న్యాయం, గౌరవం దక్కని కులంగా దళిత ముస్లింలు అనేక విధాలుగా నష్టపోతున్నారు. సమాజంలో గణనీయ సంఖ్యలో ఉన్నా ముస్లిం మతం పుచ్చుకున్న నేరానికి వారిని అభివృద్ధికి, రిజర్వేషన్‌లకు దూరం చేయ డం అన్యాయం. వీరికి విద్యా, ఉద్యోగ, చట్టసభల్లోనూ రిజర్వేషన్‌లు వర్తింపచేయాలి. దళిత ముస్లింలు, దళిత క్రిస్టియన్‌లు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అఫిడవిట్ రూపంలో సమాధానమి వ్వాలి. జస్టిస్ రాజేందర్ సచార్, జస్టిస్ రంగనాథ్‌మిశ్రా సిఫారసులను అమలు చేయాలి. 1950 నాటి ఎస్సీ రిజర్వేషన్ బిల్లును తొలగించి దళిత ముస్లిం, క్రిస్టియన్‌లకు రిజర్వేషన్‌లు కల్పించాలి. దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు వర్తింప చేసిన విధంగానే రిజర్వేషన్‌లను దళిత ముస్లింలకు, దళిత క్రిస్టియన్‌లకు వర్తింపచేయా లి. నూర్‌బాష్, దూదేకుల,లద్దాఫ్, పింజారి ముస్లింలకు దామాషా ప్రకారం అన్నిరంగాల్లో రిజర్వేషన్‌లు కల్పించాలి. ముస్లిం ల్లో అంతర్భాగమైన వీరికి మైనారిటీ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, హజ్‌కమిటీ, వక్ఫ్ బోర్డుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ విధమైన రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిస్తూ.., ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అప్పుడే దళిత ముస్లింలు అభివృద్ధి పథాన నడుస్తారు. తరతరాలుగా చీకటి బతుకులతో అష్టకష్టాలు పడుతున్న దళిత ముస్లింల జీవితాల్లో వెలుగులు నిండుతాయి.
-షేక్ సత్తార్ సాహెబ్

రాష్ట్ర నూర్‌బాష్, దూదేకుల, ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం  
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=229534
నమస్తే  తెలంగాణ 13.10.2013.
https://www.facebook.com/photo.php?fbid=645158858849441&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

1 వ్యాఖ్య:  1. మీ వాదన సమంజసమే.హిందూమతంలోనే కులవిభజన,వివక్షత ఉన్నాయికాబట్టి వారికిమాత్రమే రిజర్వేషన్లు వర్తింపజేయాలని చాలామంది అభిప్రాయం.ఇది theoriticalగాసరీఇనదే.కాని ఆచరణలో అన్నిమతాలలోను (చాలామంది హిందూమతం నుంచి convert ఐనవారుకాబట్టి ) కులవివక్షత,దళితులు,ఉన్నారు.కాని సుప్రీం కోర్టు ఆదేశాలప్రకారం 50% కన్న రిజర్వేషన్లు మించకూడదు..అందువలన ముస్లిం దళిత రిజర్వేషన్లకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి.

    ప్రత్యుత్తరంతొలగించు