ఈ బ్లాగును శోధించు

లోడ్ అవుతోంది...

శుక్రవారం 14 మే 2010

బాసరాని సాయిబులు

బాసరాని సాయిబులు
దూదేకుల సిధ్ధప్ప (బ్రహ్మం గారి శిష్యుల్లో మహాజ్ఞాని)కి దూదేకను రాదంటే లోటా? అని సామెత. ఆయనకి దూదేకటం రాకపోయినా ఆయన గురువుగారి కాలజ్ఞాన తత్వాలు పాడుకుంటూ బాగానే బ్రతికాడు. తులసి కడుపున దురదగొండిలా పుట్టాడని అతని తల్లితండ్రులు తిట్టి పోశారు. కులం తక్కువ వాడూ కూటికి ముందా అని బ్రహ్మంగారి కొడుకులు(కంసాలీలు/విశ్వబ్రాహ్మణులు) తన్ని తరిమేశారు. కానీ అతనికి తురకం (ఉర్దూ బాష) రాలేదని ఎవరూ తన్నినట్లు దాఖలా లేదు. కనీసందాన్నొక లోటుగా కూడా ఎంచలేదు.ఆయన మాత్రం "ముట్టున బుట్టిందీ కులము, ముట్టంటున పెరిగిందీ కులము" అని తెలుగు తత్వాలే పాడాడు.
లింగి పెళ్ళి మంగి చావుకొచ్చినట్లుంది దూదేకుల వాళ్ళ వ్యవహారం. చక్కగా సాయిబుల పేర్లు పెట్టుకొని సంఘంలోకెళితే,అసలు సిసలు సాయిబు(ఉర్దూ జబర్దస్తీగా మాట్లాడే మహారాజు) ఎదురైనపుడల్లా వచ్చీరాని భాషలో నంగినంగిగా మాట్లాడి, వంగి దండంపెట్టి వెళ్ళి పోవాల్సి వస్తోంది.ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా పోతున్నారు మీరు అని అసలు సాయిబులు ఆవేదన చెందుతూ ఉంటారు.ఆకారం చూచి ఆశపడ్డామేగాని అయ్యకు అందులో పసలేదని చప్పడిస్తుంటారు.బాష వేరేగానీ భావమొక్కటేనంటాడు దూదేకులాయన. నీవు ఖాన అంటావు. నేను అన్నం అంటాను అంటాడు. ఇంత మాత్రానికే ఇదైపోవాలా అంటూ ఇదై పోతాడు.
ఇటీవల "పింజారీ వెధవ" అనే తిట్టు టీ.వీ. సీరియళ్ళలో సినిమాల్లో విపరీతంగా వినబడుతోంది. బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన ఇటీవల "పింజారి" అనే పుస్తకంగా ప్రచురించాడు. పుస్తకం చదివి వెనకాముందూ తెలుసుకున్న వారు తమ తిట్ల నిఘంటువుని కొద్దిగా సవరించుకొన్నారట. కానీ ఇంకా కన్నూ మిన్నూ కానని దురహంకారంతో కులగజ్జితో బాధపడుతున్న సంభాషణా రచయితలున్నారు. "ఓరీ రజక చక్రవర్తీ" అంటే - ఇంత పెద్ద పేరు మాకందుకు దొరా? మీకే ఉండనివ్వండి అన్నాడట. అనటం తిరిగి అనిపించుకోవటం మన దేశంలో అనాదిగా ఉంది. "ఎస్సీ,ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం" వచ్చిన తరువాత ఆయా కులాల పేర్లతో వారిని సంభోదించటానికే జంకారు. ఇప్పుడు రెడ్డి, నాయుడు, చౌదరి, రాజు, గుప్తా, శర్మ, గౌడల్లాగా వాళ్ళు కూడా మాల, మాదిగ అనే తోకల్ని సగౌరవంగా, సమధీటుగా తగిలించుకొని ఎదురు తిరిగి నిలబడితే, గుడ్లు మిటకరించి చూడటమే మిగతా వారి వంతయ్యింది. ఐతే ఆ తోకలతో పిలవచ్చా పిలువ కూడదా, పిలిస్తే ఏమవుతుందో అనే భయంతో మిన్నకున్నారు. ఒకనాడు అవమాన సూచికగా, తిట్టుకు ఆలంబనగా ఉన్న కుల నామం ఈనాడు కబడ్దార్ అని హెచ్చరించే స్థాయికి ఎదిగింది. రేపు పాదాభివందనం చేయించుకుంటుంది. అలాగే బాసరాని పింజారులు కృంగిపోవద్దు. వృత్తిని కోల్పోయిన దూదేకుల వాళ్ళెంతో మంది ప్రస్తుతం ఆర్ధికంగా బలహీనులే. కానీ పవిత్రమైన ఆశయాలతో కృషి చేస్తే, పది మందికి వెలుగు చూపే చక్రవర్తులుగా "నూర్ బాషా"లుగా మన్నన పొందుతారు.--- గీటురాయి వారపత్రిక 30.4.2004.
ఈదేశానికి పట్టిన చీడ కులం.దూదేకులవాళ్ళు వచ్చేజన్మలో ఇంకో కులంలో పుట్టొచ్చు.అనేక కులాల వాళ్ళు దూదేకులుగానూ పుట్టొచ్చు.దౌర్భాగ్యం ఏంటంటే భారతీయుడు ఏ మతంలోకి వెళ్ళినా కులం ఉంటున్నది.భారతీయ క్రైస్తవుల్లో,ముస్లిముల్లో కూడా కులాలున్నాయి.అగ్ర కుల ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వకపోయినా షేక్ ల రూపంలో దొంగదారిన రిజర్వేషన్ పొందుతున్నారు.పేదరికమే ఈ కక్కుర్తికి కారణం.రిజర్వేషన్ ఇచ్చిన 14 కులాలూ నికృష్టంగానే ఉన్నాయి.అసలు దూదేకుల వాళ్ళ మాట ఎక్కడ చెలామణి అవుతుంది?ఈరాష్ట్రంలో దూదేకుల వాళ్ళ సంఖ్య చాలా తక్కువ.బి.సి.ఇ గ్రూపులో దూదేకుల కులస్తులను కలపలేదు.వాళ్ళు బి గ్రూపులో ఉన్నారుగా అని వదిలేశారు.అధికారులు కూడా కొన్నిప్రాంతాల్లో మతం హిందూ అనీ, కులం దూదేకుల అని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇస్లాం-దూదేకుల అని సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. మసీదుకు వెళ్ళము అని అఫిడవిట్ దాఖలు చెయ్యాలని ఆంక్షలు పెడుతున్నారు. తల్లిదండ్రులు దూదేకుల వృత్తి చేస్తుంటేనే బీసీ సర్టిఫికెట్‌ ఇస్తామని చెబుతున్నారు.రాష్ట్రంలోని దూదేకుల కులానికి చెందిన ముస్లింలను దళితులుగా చేయాలని మజ్లీస్ పార్టీ విన్నవించింది.అంటే దూదేకుల వారిని ముస్లిములు దళితులుగా భావిస్తున్నట్లేగా?
ఆ మధ్య ఓ కాపులామెను ఇంట్లో పిండి దంచటానికి రమ్మంటే తురకోళ్ళ ఇంట్లో పని చెయ్యనని తిరస్కరించింది. సరే, కూలి పని చేసుకునే ఈ కాపులామె దృష్టిలో తురకసాయిబులు సంపన్నులైనా అంటరాని వాళ్ళు కాబోలులే అనుకొని అవసరం మరొకరి చేత తీర్చుకున్నాం. ఇంకోచోట అప్పటిదాకా సాలీలకు అంట్లుతోమిన ఓ తురకసాయిబులామె మాకు తోమను పొమ్మంది. మేము తక్కువ రకం సాయిబుల మట. మా ఇంట్లో కూలిపని చెయ్యటం తప్పట! ఆయనగారు జిల్లా కలెక్టర్ అయినా సరే వాళ్ళిచ్చే కూలీ నా కొద్దు చాకలోళ్ళ ఇంట్లో అయినా పని చెప్తాను గానీ దూదేకుల వాళ్ళింట్లోపని చెయ్యను అని తెగేసి చెప్పింది. సరే, ఇక చేసేదేముంది? మా పనులు మేమే చేసుకుంటున్నాం. ఉర్దూ రాని దూదేకుల వాళ్ళ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా వుంది.రజక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంజయ్య, చాకలి వాళ్ళు తన ఇంట్లో బట్టలు ఉతకటానికి నిరాకరించారని గతంలో వాపోయిన సంఘటన గుర్తొచ్చింది. ఇది స్వంతకులంలోనే అంతర్గత సమస్య.

పరిస్థితి ఇలా ఉంది. తల పండిన పెద్దలు, పండితులు ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
ఈ మధ్య మా అపార్ట్ మెంట్లోకి ఒక సాయిబుల కుటుంబం చేరింది.మాది పొదిలి అంటూ మంచిగా మా ఆవిడను పరిచయం చేసుకుంది. మాయింటి పేరు నూర్ బాషా అని తెలియగానే ఆవిడ ముఖం రంగు మారి పోయింది.”వాళ్ళు వేరు మేము వేరు ” అని పని గట్టుకొని అందరికీ చెప్పింది.”ఇద్దరూ సాయిబులేగా” అంటే “కాదు మేము తురకసాయిబులం వాళ్ళు దూదేకుల సాయిబులు, వాళ్ళకు ఉర్దూ రాదు మాకు ఉర్దూ వచ్చు, వాళ్ళకు మాకు చాలా తేడా వుంది” అని చెప్పిందట.విశాఖపట్నంలో ఇంత నాగరికత గల ఊళ్ళో ఈనాడు ఈ కుల ఫీలింగ్ ఉండదు అన్న నాభావన కరిగిపోయింది.ఆవిడ కొడుకు ఒక డాక్టర్ .కేరళ క్రిస్టి యన్ నర్సును ఆదర్శ వివాహం చేసుకొన్నాడు.ఆయనకు లేని కులం పట్టింపు ఈమెకుంది.పక్క అపార్ట్ మెంట్ లోని సాయిబులామె అప్యాయంగా కలుపుకొమె పలకరిస్తుంటే ,ఈమె కులం కోసం బిగుసుకు పోతుందేమిటీ? ఈమెకేమయ్యిందీ?అనుకునేవాళ్ళం.
కొన్ని రోజుల క్రితం చీరాల నుండి మా చుట్టాల్లో ఒకామె వచ్చింది.ఇద్దరూ చాలా సేపు ఆప్యాయంగా ఉర్దూలో మాట్లాడుకున్నారు.చివరికి మా చుట్టం “పొదిలావిడ మన కులమే .ఆవిడ మాకు చుట్టం” అని తేల్చింది.
అరెరే, మాకులం దానివై వుండీ,క్రిస్టియన్ కోడలిని పెట్టుకొనీ ,తురక సాయిబులమంటూ ఎంత పోజు కొట్టావే ముసలమ్మా అనుకొన్నాం.ఈ చేదు అనుభవాలను చాలా మంది ఎదుర్కొని ఉంటారు. నేటికీ సమాజంలో కొనసాగుతున్న ఈ రుగ్మతల పట్ల సంఘ సంస్కర్తలు శ్రద్ధ చూపడం అవసరం.

దూదేకుల సాహెబుకు రైల్లో ప్రయాణించేటప్పుడుకుడా నమాజు చేసేంత భక్తి ఉండదు.అసలైన విశ్వాసాలు సామాన్య ప్రజలు ఆచరించే మూఢ విశ్వాసాలు అంతగా విడమరిచి చెప్పలేడు.హిందువులాగా బొమ్మలకీ..రాళ్ళకీ రప్పలకీ కూడా మొక్కుతాడు.ఉర్దూవచ్చినవాడే సాహెబు అనే స్థితినుండి ఇస్లాంను తెలుగులోకి తరలివచ్చేలా చేసిన తెలుగువాడు దూదేకుల సాహెబు.ఉర్దూ భాషరాదనే ఈసడింపులను సహించాడు.మసీదులోకి తెలుగును తీసికెళ్ళాడు.అందుకే అతను తెలుగు ముస్లిం అయ్యాడు.ఇతన్ని బాసరాని సాయిబుగా విడదీసి చూస్తారు.వీళ్ళని మంచి ముస్లిములుగా చెయ్యాలని ముస్లిం సంస్థలు కృషి చేస్తుంటే,ఇన్నాళ్ళూ అద్దె ఇళ్ళలో ఉన్నారు తిరిగి మీసొంత ఇంటికి రండి అని హిందూ సంస్థలు పిలుపునిస్తున్నాయి.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి