ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, మే 2010, గురువారం

మనం ముస్లిములమా?హిందువులమా?

మనం ముస్లిములమా?హిందువులమా?

"ఆపదలోని మానవుడిపై అమృతం వర్షించే కరుణాంతరంగమే మతానికైనా, మానవత్వానికైనా సుక్షేత్రం కాగలదు. నిరుపేదలను ఆదుకోవటం వల్ల ముక్కోటి దేవతలను సందర్శించిన దానికంటే మించిన మోక్షం.ఆత్మతృప్తి కలుగుతాయి.(వార్త సంపాదకీయం 30-3-2003).

ఇటీవల ఓ జిల్లా కేంద్రంలో నూర్ బాషాలు అంటే దూదేకుల కులస్థుల సమావేశం జరిగింది. హాజరయిన పెద్దలు "మనం ముస్లిములమా?హిందువులమా?" అనే మీమాంసంలో పడి రసవత్తరమయిన చర్చ జరిపారు.

ఉర్దూ భాష ,నమాజు,రాకపోవటం వలన ముస్లిములు తమను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ పిల్లలకు తమ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి ముందుకు రావడంలేదని కొందరు ముస్లిం దూదేకుల వారు వాపోయారు. మాకు తెలుగు మసీదులు కావాలన్నారు. నిజంగా హిందూ దేవుళ్ళను నమ్ముకొని తిరుపతికి పోయి గుండు చేయించుకొచ్చినా, సాయిబుల పేర్లుండటం వలన హిందువులు కేటాయించి చూస్తున్నారనీ, షేక్ శ్రినివాసరావు, షేక్ పద్మావతులు గూడా హిందువుల ఆదరణకు నోచుకోవటం లేదని, మరికొందరు హిందూ దూదేకులవారు బాధపడ్డారు. మన విలువ పెరగాలంటే దూదేకుల సిద్ధప్పను తలదన్నే తాత్వికులతో పాటు ప్రత్యేక పూజారులు, పురోహితులు కావాలన్నారు. వేటపాలెం దగ్గర మా మందంతా క్రైస్తవ మతం పుచ్చుకొని హాయిగా ఉన్నాం. చర్చిలో మమ్మల్ని ముందు వరసలో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు మాకు ఉర్దూ బెడదలేదు. కులం గొడవాలేదని షేక్ ఏసుపాదం, షేక్ దానియేలు లాంటి క్రైస్తవ దూదేకుల వాళ్ళు సెలవిచ్చారు. పైగా త్వరలో స్వంత చర్చి కడతారట. నూతిలో పడతావా? పాతర్లో పడతావా? అన్నట్లయింది సమావేశం. ఎవరి మతాన్ని వారు సమర్ధించుకున్నారు. మనమంతా ఒక కుల పోళ్ళం కాబట్టి మనకందరికీ ఒకే మతం ఉండాలని కొందరు పిడివాద దూదేకులు వాదించారు. ఎవరి మతం ఎవరు విదిచిపెడతారు? ఎవరి మతం వారిదేనని కొందరు ఉదారవాద దూదేకులు ఎదురు తిరిగారు. ఆహా! ఏమీ లౌకికవాదం! ఎంతటి అద్భుతమీ భిన్నత్వంలో ఏకత్వం! సకల మతాల సారాలను ఆచారాలను తనలో ఇముడ్చుకొని సర్దుకొని చక్కగా పోతున్న దూదేకుల ఐకృత వర్ధిల్లాలని కొందరు సెక్యులర్ దూదేకుల వారు అరిచారు. అన్ని మతాల వాళ్ళూ మనల్ని కరివేపాకుల్లాగా వాడు కొని అవతల పారేస్తున్నారు. వెనుకపడిన కులాల జనాభాలో 4 శాతం ఉన్నాం.


ఎప్పుడన్నా మనకు ఎమ్మెల్యే పదవిచ్చారా? ఒక్క దూదేకుల వాడైనా ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యాడా? ఆర్ధికాభివృద్ధి లేకుండా ఈ మతాలెందుకు? అని కొందరు హేతువాద దూదేకులు ఆక్రోశించారు.దూదేకటం అనే వృత్తి పోయింది. ఇప్పుడెవరూ ఆ వృత్తి చేయటం లేదు. ఇక మీదట ఆ వృత్తినే చేసి బ్రతికే అవకాశమూ లేదు. ఇంకా ఆ వృత్తి పేరుతోనే కులం పేరు ఎందుకు? మన కులానికి మరేదయినా మంచి పేరు పెట్టాలని కొందరు సంస్కరణవాదులు మాట్లాడారు. కూటికీ గుడ్డకూ రాని బ్యాండు మేళాలు,సన్నాయి వదిలేసి సాంకేతిక విద్యలు చదవాలనీ, ప్రభుత్వాన్ని భూములడగాలనీ కొందరు కమ్యూనిస్టు దూదేకులవారు డిమాండ్ చేశారు. బంతికే రావద్దంతే విస్తరాకు తెమ్మన్నట్టుంది మీ వ్యవహారం. ఏదో ఒక మత గుంపులో చేరితే తప్ప బెదురు తీరని బడుగు జీవులం మనం. ఏమతంలో చేరితే మన పేదరికం అంతరిస్తుంది? ఏ మతంలో చేరితే మన పిల్లల భ్వష్యత్తుకు భధ్రత కలుగుతుంది?

ఏ మతంలో చేరితే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మనల్ని హృదయ పూర్వకంగా కలుపుకుంటారు? మనం దాడిచేసేవాళ్ళం కాదు ఎప్పుడూ దాడులకు గురవుతున్న వాళ్ళం. ఇప్పుడు కావలసింది మన ఆత్మల రక్షణ కాదు. మన ప్రాణాలకు భౌతిక రక్షణ, ఆర్ధిక రక్షణ, సాంఘిక రక్షణ, ఏ మతంలో దొరుకుతుంది? కుల విచక్షణ చూపకుండా మానవతాభావంతో కరుణ రసాన్ని కురిపించి మనపట్ల సమ గౌరవం చూపే మతమేది? ఆ మనవతా మత మేది? అంటూ కొందరు సభ లోనే అన్వేషించారు. కానీ ఫలితం కానరాలేదు.రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.ఇప్పుడు కుల మత సంఘాల పేరుతో గిరులు గీసుకొని కంచెలు కట్టుకొని స్వకీయ రక్షణ. పరపీడన సిద్ధాంతాలతో సాగిపోతున్న నరహంతక ముఠలు ఎన్నని చెప్పగలం? భారతీయ సమాజం కుల మతాల విభజన వల్ల మానసికంగా చిందర వందరై పోయింది. కుహనాఇక్యత వర్ధిల్లుతోంది. మానవత్వాన్ని, ప్రోది చేసి మనందరినీ నిజంగా ఐక్యపరిచే సాధనం మానవతావాదమే. దేవుడి పేరుతో స్ధాపించబడిన కులమతాలు మానవ ఐక్యతకు, మానవ సౌభాగ్యానికి బాటలు వేయాలంటే మతదురభిమానాపు పొరలు కప్పిన వారి కళ్ళల్లో మానవత్వపు కరుణా కాంతులు నిండాలి. హత్యలు చేసే చేతులు పదిమందికి అన్నం పెట్టాలి. ఆస్తులు, ప్రాణాలు, మానాలు దోచుకునే దుర్మాగులు పరోపకారులుగా మారాలి. ఇలా మనుషుల్ని కారుణ్యమూర్తులుగా మలచలేని మతాలు వ్యర్ధం. మానవత్వాన్ని కాలరాచే మతాలు మన పాలిట శాపాలు. మతాలకు మానవత్వమే గీటురాయి. ----నూర్ బాషా రహంతుల్లా ,గీటురాయి వారపత్రిక 18.7.2003


దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటేలోటా? ఎంతమాత్రం లోటు కాదు. ఒకే రకం ఈకలు గల పక్షులు ఒకేచోట చేరతాయంటారు. ఈ మద్య "పరుపులుకుడతాం" అంటూ కవ్వాను బద్ధ భుజాన వేసుకుని తిరుగుతున్న ఇద్దరు మనుషులు నా కంటబడ్డారు. ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పరుపు కొనుగోలు ప్రతిపాదన వాళ్ళను, చూడగానే మంజూరయ్యింది. పరుపు కుట్టడం పూర్తయ్యాక మీరు 'దూదేకుల సాయిబులేనా?' అని అడిగాను, "కాదండీ బాబూ,మేముకాపులం మాది ఏలూరు" అని జవాబిచ్చారు.
కులంగాదు, తలంగాదు కురవోళ్ళ పిల్ల దయ్యమై పట్టినట్లు, కాపులు గూడా దూదేకుతున్నారంటే వీళ్ళను, బీసీల్లో ఎందుకు చేర్చగూడదు అనిపించింది.
తురకలు లేని ఊళ్ళో దూదేకుల వాదే ముల్లా అంటుంటారు. దూదేకుల వాళ్ళు కూడా లేని ఊళ్ళో ముల్లాపని ఏమోగానీ దూదేకేపని మాత్రం ఏదో ఒక కులపోళ్ళు నెత్తిన వేసుకొని చేస్తుండటం వల్ల "కులవృత్తి" సిద్దాంతం దెబ్బతిని పోయింది.
టర్కీ(తురక) భాష మాట్లాడే వాళ్ళను పూర్వం తురక వాళ్ళు అని ఉంటారు. కాని ఇప్పుడు ఉర్దూ మాట్లాడే ముస్లిములందరినీ 'తురకోళ్ళు '
అంటున్నారు. సర్వీస్ కమీషన్ పరీక్షల్లో కూడా ఇదే మాట ప్రయోగించారు. దూదేకుల సాయిబుల్నీ, మామూలు సాయిబుల్నీ వేరు చేసి ఇలా రెండు పేర్లుతో పిలుస్తున్నారు. "తురకా దూదేకుల పొత్తులో మురిగీ ముర్దార్" అనే సామెత ఉంది. "కాకర బీకర కాకు జాతారే?" అంటే దూబగుంటకు దూదేకును జాతరే అని ఇద్దరు దూదేకుల వాళ్ళూ సంభాషించుకున్నారట. బావి తవ్వితే భూతం బయట పడ్డట్లు లోతుకు పోయే కొద్దీ కొత్త సంగతులు బయట పడుతున్నాయి.
ఈ మధ్య నన్ను ఆకివీడుకు బదిలీ చేశారు. బదిలీ కాగితం చేతికిస్తూ ఓ సాయిబుగారు నాకు ఉర్దూ రానందుకు చాలాసిగ్గుపడిపోయారు. ఆయన భాషాభిమానం ఎంత గొప్పదంటే ఖురాను ఉర్దూలోనే అవతరించిందట. బావిలోని కప్పకు గానుగ ఎద్దుకూ అవే లోకాలు అన్నట్లు ఉర్దూ పిచ్చి పట్టిన వాళ్ళకు మరో సంగతి తలకెక్కదు.
అలాగే తెలుగు మాట్లాడటం మన ప్రత్యేకత మన సంస్కృతి అంటూ ఉపన్యాసం చేసిన ఒక నూర్ భాషా నాయకుణ్ని సంకుచితత్వం వదిలి పెట్టమని హితోపదేశం చేశాను." భాషలు ఆయా ప్రాంతాలకు సంబంధించినవి. అయితే దైవ ధర్మం విశ్వవ్యాప్తమైంది. అన్ని భాషల ద్వారా దైవ ధర్మం వ్యాపించాలి." అంటుండగానే, మరో సాయిబుగారు "ఆకివీడులో మీ కేడర్ వాళ్ళు చాలా మంది ఉన్నారండీ" అన్నారు. "ఇస్లాంలో చేరిన తరువాత అంతా ఒకే కేడర్ అవుతారు. ఇంకా ఎందుకీ భేదాలు?"
అన్నాను. "రంగాహత్యానంతరం జరిగిన దౌర్జన్యకాండలో నువ్వు సాయిబువైతే ఉర్దూలో మాట్లాడు అని దూదేకుల సాయిబుని తన్నారుగదా? మీకు మాకు తేడా లేదా?" అన్నాడాయన.
గూని వీపు నయం కాదు లెమ్మని నేను మౌనం వహించి ఆకివీడు చేరాను. అక్కడ ఇంకో సాయిబుగారు నా వివరాలన్నీ అడిగి " ఈ దూదేకుల వాళ్ళంతా ఒక ముస్లిం తండ్రికి హిందూ తల్లికీ జన్మించిన సంతానమండీ" అన్నాడు. కన్ను కైకలూరులో కాపురం డోకిపర్రులో అన్నట్లయింది నాపని.
ఎంతగా ధర్మ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ రెండు రకాల సాయిబులూ కలిసి పోవటం లేదు. ఏమిటి దుస్థితి అని ఒక స్థానిక ముస్లిం నాయకుడిని అడిగాను". గోంగూరలో చింతకాయ వేసినట్లు, గోకి దురద తెచ్చుకున్నట్లు వీళ్ళతో మాకెందుకండీతంటా? బయటి వాళ్ళకు చెప్పుకోవటం నయం" అన్నాడు. సాయిబుల పిల్లల్ని చేసుకొని వాళ్ళలో కలిసిపోగూడదా ఎందుకీ అదగస్తపు బతుకు అని ఒక దూదేకుల స్రీ వారిని అభ్యర్ధించాను. "అమ్మో ఇంకా ఏమయినా ఉందా? మనం బ్రతకడానికేనా? అడుగడుగనా లధాఫ్, లధాఫ్ అని ఎత్తి పొడవరూ?" అని ఎదురు బెదిరించాడు. గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంది. హైదరాబాదులో తల పండిన పెద్దలు, పట్టణాలలోని ముస్లిం పండితులు ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. (అక్కడ కూడా ఇలాగే లేకపోతే)
-- నూర్ బాషా రహంతుల్లా (గీటురాయి 28.6.91

13 కామెంట్‌లు:

  1. రహమతుల్లా గారు,
    కులం పేరున దారుణాలు చూసినప్పుడల్లా మీరు చెప్పిన ఈ కింది మాట నాకు కూడా అనిపిస్తుంది.
    "రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది."

    నేను ఒక పెద్ద కథ రాసి దాంట్లో ఒక దూదేకుల సాయిబ్బు పాత్ర పెట్టాను. అది రాసినప్పుడు నాకు అది వాస్తవ దూరం గా ఉందేమో అన్న సందేహం వచ్చింది. మీరు కొంచెం చదివి చెప్తారా?
    The link is below:
    http://wp.me/pGX4s-6l

    రిప్లయితొలగించండి
  2. @శరత్ 'కాలమ్'
    ధన్యవాదాలు
    @Rambondalapati
    తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు కాబట్టి ..దూదేకుల సాయిబ్బేమో…అనుకొని,ఆ కధ ఊహించారు.అసలు దర్గాకు పోవటమే ఒక మూఢవిశ్వాసం.దూదేకుల సాహెబుకు రైల్లో ప్రయాణించేటప్పుడుకుడా నమాజు చేసేంత భక్తి ఉండదు.అసలైన విశ్వాసాలు సామాన్య ప్రజలు ఆచరించే మూఢ విశ్వాసాలు అంతగా విడమరిచి చెప్పలేడు.హిందువులాగా బొమ్మలకీ..రాళ్ళకీ రప్పలకీ కూడా మొక్కుతాడు.వీళ్ళని మంచి ముస్లిములుగా చెయ్యాలని ముస్లిం సంస్థలు కృషి చేస్తుంటే,ఇన్నాళ్ళూ అద్దె ఇళ్ళలో ఉన్నారు తిరిగి మీసొంత ఇంటికి రండి అని హిందూ సంస్థలు పిలుపునిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  3. రహమతుల్లా గారూ,
    వెంటనే స్పందించినందుకు థాంక్స్. మీకు వీలైతే మిగతా కథ కూడా చదవండి. ఒక హిందువు గా నాకున్న అపోహలనీ ,మళ్ళీ వాటిని తొలగించుకొనే ప్రక్రియనీ సుబ్బా రావు పాత్ర ద్వారా చూపిద్దామనుకొన్నాను. మస్తాన్ వలీ ని సైన్స్ టీచర్ గా పెట్టి కొంచెం రేషనల్ విషయాలు మాట్లాడించాను.

    రిప్లయితొలగించండి
  4. ప్రస్తుత సామాజిక పరిస్థితులు గురించి చాలా బాగా చెప్పారు,అందులో మతం కులం ఆసరా ఎంతొ?మనం కావాలి అనుకుంటె అవసరం వద్దు అనుకుంటె అనవసరం.
    కామెంట్ల రూపంలో మిమ్మలిని గమనించే వాడీని.మీ అభిప్రాయాలు చూచాయగా మాత్రమే తెలిసాయి.మీ బ్లాగుని చూడగలిగినందుకు సంతోషం.కొంచెం రెగ్యులర్గా రాయగలరా?
    @బొందలపాటి గారు ..మీకు ఎన్ని బ్లాగులు వున్నాయండీ?ఇంతకు ముందు ఆంధ్రుడు..ఇప్పుడూ ఇది.వీలు చూసుకుని మీ బ్లాగులన్ని వెతికి పట్టుకోవాలి.

    రిప్లయితొలగించండి
  5. @Rambondalapati,venkatakrishnanaram
    ఉర్దూవచ్చినవాడే సాహెబు అనే స్థితినుండి ఇస్లాంను తెలుగులోకి తరలివచ్చేలా చేసిన తెలుగువాడు దూదేకుల సాహెబు.ఉర్దూ భాషరాదనే ఈసడింపులను సహించాడు.మసీదులోకి తెలుగును తీసికెళ్ళాడు.అందుకే అతను తెలుగు ముస్లిం అయ్యాడు.ఇతన్ని బాసరాని సాయిబుగా విడదీసి చూస్తారు.తెలుగు మాతృభాషగా గల దూదేకుల,నూర్ బాషా,పింజరి,లదాఫ్ మొదలైన తెలుగు ముస్లిములకు ఇస్లాం మతంలో భాషాపరమైన సంస్కరణలు కోరటం,వారు ఎదుర్కొంటున్న వివిధ సామాజిక సమస్యలను చర్చించటం కోసం ఈ బ్లాగు ప్రారంభించాను.

    రిప్లయితొలగించండి
  6. బాసరాని సాయిబులు
    దూదేకుల సిధ్ధప్ప (బ్రహ్మం గారి శిష్యుల్లో మహాజ్ఞాని)కి దూదేకను రాదంటే లోటా? అని సామెత. ఆయనకి దూదేకటం రాకపోయినా ఆయన గురువుగారి కాలజ్ఞాన తత్వాలు పాడుకుంటూ బాగానే బ్రతికాడు. తులసి కడుపున దురదగొండిలా పుట్టాడని అతని తల్లితండ్రులు తిట్టి పోశారు. కులం తక్కువ వాడూ కూటికి ముందా అని బ్రహ్మంగారి కొడుకులు(కంసాలీలు/విశ్వబ్రాహ్మణులు) తన్ని తరిమేశారు. కానీ అతనికి తురకం (ఉర్దూ బాష) రాలేదని ఎవరూ తన్నినట్లు దాఖలా లేదు. కనీసందాన్నొక లోటుగా ఎంచినట్లూ నాకూ తెలియదు. ఆయన మాత్రం "ముట్టున బుట్టిందీ కులము, ముట్టంటున పెరిగిందీ కులము" అని తెలుగు తత్వాలే పాడాడు.
    లింగి పెళ్ళి మంగి చావుకొచ్చినట్లుంది దూదేకుల వాళ్ళ వ్యవహారం. చక్కగా సాయిబుల పేర్లు పెట్టుకొని సంఘంలోకెళితే,అసలు సిసలు సాయిబు(ఉర్దూ జబర్దస్తీగా మాట్లాడే మహారాజు) ఎదురైనపుడల్లా వచ్చీరాని భాషలో నంగినంగిగా మాట్లాడి, వంగి దండంపెట్టి వెళ్ళి పోవాల్సి వస్తోంది. ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా పోతున్నారు మీరని అసలు సాయిబులు ఆవేదన చెందుతూ ఉంటారు. ఆకారం చూచి ఆశపడ్డామేగాని అయ్యకు అందులో పసలేదని చప్పడిస్తుంటారు. బాష వేరేగానీ భావమొక్కటేనంటాడు దూదేకులాయన. నీవు ఖాన అంటావు. నేను అన్నం అంటాను అంటాడు. ఇంత మాత్రానికే ఇదైపోవాలా అంటూ ఇదై పోతాడు.

    ఇటీవల "పింజారీ వెధవ" అనే తిట్టు టీ.వీ. సీరియళ్ళలో సినిమాల్లో విపరీతంగా వినబడుతోంది. బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంఖట్ రమణమూర్తి అనే ఆయన ఇటీవల "పింజారి" అనే పుస్తకంగా ప్రచురించాడు. పుస్తకం చదివి వెనకాముందూ తెలుసుకున్న వారు తమ తిట్ల నిఘంటువుని కొద్దిగా సవరించుకొన్నారట. కానీ ఇంకా కన్నూ మిన్నూ కానని దురహంకారంతో కులగజ్జితో బాధపడుతున్న సంభాషణా రచయితలున్నారు. "ఓరీ రజక చక్రవర్తీ" అంటే - ఇంత పెద్ద పేరు మాకందుకు దొరా? మీకే ఉండనివ్వండి అన్నాడట. అనటం తిరిగి అనిపించుకోవటం మన దేశంలో అనాదిగా ఉంది. "ఎస్సీ,ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం" వచ్చిన తరువాత ఆయా కులాల పేర్లతో వారిని సంభోదించటానికే జంకారు. ఇప్పుడు రెడ్డి, నాయుడు, చౌదరి, రాజు, గుప్తా, శర్మ, గౌడల్లాగా వాళ్ళు కూడా మాల, మాదిగ అనే తోకల్ని సగౌరవంగా, సమధీటుగా తగిలించుకొని ఎదురు తిరిగి నిలబడితే, గుడ్లు మిటకరించి చూడటమే మిగతా వారి వంతయ్యింది. ఐతే ఆ తోకలతో పిలవచ్చా పిలువ కూడదా, పిలిస్తే ఏమవుతుందో అనే భయంతో మిన్నకున్నారు. ఒకనాడు అవమాన సూచికగా, తిట్టుకు ఆలంబనగా ఉన్న కుల నామం ఈనాడు కబడ్దార్ అని హెచ్చరించే స్థాయికి ఎదిగింది. రేపు పాదాభివందనం చేయించుకుంటుంది. అలాగే బాసరాని పింజారులు కృంగిపోవద్దు. వృత్తిని కోల్పోయిన దూదేకుల వాళ్ళెంతో మంది ప్రస్తుతం ఆర్ధికంగా బలహీనులే. కానీ పవిత్రమైన ఆశయాలతో కృషి చేస్తే, పది మందికి వెలుగు చూపే చక్రవర్తులుగా "నూర్ బాషా"లుగా మన్నన పొందే భాగ్యాన్ని త్వరలోనే దేవుడు ప్రసాదిస్తాడు!

    రిప్లయితొలగించండి
  7. భారతదేశంలోనీ కులమత సంక్షోభం వుందని తెలుసును గానీ, మఱీ ఇలా దూదేకుల తీరులా అది ఎన్నో వింత వింత రూపాల్లో ఉందని మీ ఈ వ్యాసం చదివాకే తెలిసింది।
    మా గురువుగారు ఒకాయన అన్నారు, కంప్యూషన్ మంచిదే, దానినుండి అన్వేషణ మొదలవుతుందని।

    రిప్లయితొలగించండి
  8. రాకేశ్వరరావు గారూ
    మీ గురువుగారు చెప్పినట్లు" కన్ ప్యూషన్ మంచిదే, దానినుండి అన్వేషణ మొదలవుతుంది". సమస్య పదిమంది చర్చల్లోపడి నలిగీ నలిగీ చివరికి ఏదో ఒక పరిష్కారం వస్తుంది.ఈ వింత సమస్య ఎంతకాలం ఉంటుందో మరి.

    రిప్లయితొలగించండి
  9. నాకు ఈ వీషయంలోచాలా అనుమానాలు వునాయ్ కోంత తీరింది , ఇంకా లోతు అంటే చరిత) లోకివేలితే 500 సం,లు కి ముందుకి వేలితే అపుడు మనం ఎలావునాం అదినిజమైన విషయం అవోచు.దూదేకుల నూర్ భాష గా ఎపుడు ఏరపడింది.తేలియపరచగలరు.

    రిప్లయితొలగించండి
  10. https://www.facebook.com/photo.php?fbid=234015786630419&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

    రిప్లయితొలగించండి
  11. https://www.facebook.com/photo.php?fbid=2250290951669549&set=a.233025936729404&type=3&theater

    రిప్లయితొలగించండి
  12. ఉర్దూ ముస్లిముల సొంత భాషా?సాయిబు అంటే ఉర్దూనే మాట్లాడాలా?

    ఈరోజు ఉదయం కృష్ణా కరకట్ట దిగువన ఉన్న రవిశంకర్ ఆశ్రమం లోజరిగే సుదర్శన క్రియకు వెళ్ళాను.అక్కడ పరిసరాలను శుభ్రం చేసే బేగం అనే ముసలమ్మ నేను సాయిబునని తెలుసుకుంది. దగ్గరకొస్తే బాగున్నావా అమ్మా అని పలకరించాను.నన్ను ఉర్దూలో మాట్లాడమంది.నాకు రాదమ్మా అన్నాను. ఆశ్చర్యపోయింది. సాయిబులకు ఉర్దూ రావాలి,రాకపోతే నేర్చుకోవాలి అంది.తప్పదా?ఎందుకని?అని అడిగాను.ఉర్దూ రాకపోతే మాసాయిబులకింద లెక్కేయ్యరు,సాయిబుల భాష ఉర్దూనే కదా? అని నన్ను ప్రశ్నించింది.
    ఆలాగేం కాదమ్మా,మేము తెలుగు ముస్లిములం,మీకు ఉర్దూ ఎలానో,మాకు తెలుగు అలాగా.తమిళ ముస్లిములు,కన్నడ ముస్లిములు ఇలా ఎన్నో భాషలు ముస్లిములు మాట్లాడుతున్నారు.మన ప్రవక్త మహమ్మదు గారికి అరబ్బీ వస్తాది గానీ ఉర్దూ రాదు. ఉర్దూ మనదేశంలో మాత్రమే ఉంది అన్నాను.

    ఉర్దూ ముస్లిములందరికీ మత భాష ,మాతృభాష అనే తప్పుడు అభిప్రాయం ఇప్పటికీ ఉన్నవారు తమ అభిప్రాయం మార్చుకోవాలి.
    ఉర్దూ సాయిబుల భాష కాదు. ఉర్దూకు మతం రంగు పులమబడింది.వాస్తవానికి ఉర్దూ కూడా తెలుగు లాగానే భారతీయ భాష . పైగా సామాన్యుల వాడుక భాష. హిందుస్తానీ (కారి బోలీ ) భాష.ఇది భారతదేశంలో పుట్టిపెరిగి అభివృద్ధి చెందింది. 1947 వరకు మనదేశంలో రాజ భాష ఉర్దూనే.హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టులో న్యాయ వ్యవహారాలు ఉర్దూలోనే జరిగేవి. న్యాయవాదులు (వకీళ్ళు)వాదనలు ఉర్దూలో చేసేవారు. తీర్పులు ఉర్దూలో వచ్చేవి. ఉర్దూలో న్యాయశాస్త్ర పుస్తకాలు ఉండేవి.రెండు హైకోర్టుల విలీనం వల్ల ఉర్దూ బెంచిని ఏడు సంవత్సరాలు నడిపిస్తామని చెప్పి మధ్యలోనే ఆపేశారు.ఉర్దూను కొందరు ముస్లిములు తమ మత భాషగా వేరుచేసి చెలామణి చేసిన ఫలితంగా ఆ భాష పట్ల వ్యతిరేకత పెరిగింది.ఉర్దూ రానివాళ్ళు ముస్లిములే కాదు అని గతంలో కొందరు ఉర్దూ ముస్లిములు తెలుగు ముస్లిములను చిన్నచూపు చూసేవారు. అయితే క్రమేణా ముస్లిముల మతగ్రంధాలన్నీ తెలుగులోకి దిగి వస్తున్నాయి.ఏ భాషకూ మతం ఉండదు.మతస్తులే ఆయా భాషలను వారి అవసరాల కోసం వాడుకుంటారు.ఉర్దూవచ్చినవాడే సాహెబు అనే స్థితినుండి ఇస్లాంను తెలుగులోకి తరలివచ్చేలా చేసిన తెలుగువాడు దూదేకుల సాహెబు.ఉర్దూ భాషరాదనే ఈసడింపులను సహించాడు.మసీదులోకి తెలుగును తీసికెళ్ళాడు.అందుకే అతను తెలుగు ముస్లిం అయ్యాడు.ఇతన్ని బాసరాని సాయిబుగా విడదీసి చూస్తారు.తెలుగు మాతృభాషగా గల దూదేకుల,నూర్ బాషా,పింజరి,లదాఫ్ మొదలైన తెలుగు ముస్లిములకు ఇస్లాం మతంలో ఎదురౌతున్న భాషాపరమైన సమస్యలపై సంస్కరణలు కోరాలి,వారు ఎదుర్కొంటున్న వివిధ సామాజిక సమస్యలను చర్చించాలి.

    రిప్లయితొలగించండి