ధన్యజీవి అబుల్ ఇర్ఫాన్ (గీటురాయి 24.1.2020)
మిత్రుడు అబుల్ ఇర్ఫాన్ గారు 7.1.2020 న పరమపదించారు.1977 ప్రాంతాల్లో
నాగార్జునసాగర్ కెనాల్స్ చీమకుర్తి,సత్తెనపల్లి ప్రాంతాలలో చిరుద్యోగులుగా
కలిసి పనిచేశాం .ఉద్యోగాన్ని వదిలేసి గీటురాయి పత్రికలో సబ్ ఎడిటర్ గా
పనిచేయటానికి వెళ్ళాడు.మంచి స్నేహస్వభావి,తనకు ఉన్నదానిలోనే
అతిద్యాన్నిగొప్పగా ఆచరించేవాడు.అనునిత్యం రాయటమే పని.కురాన్ భావామృతం ఆయన
తెలుగు జాతికి అందించిన ఆస్తి. అప్పట్లో తెలుగుకు ఇన్ని ఫాంట్లు
లేవు.అయినాసరే ఫాంట్లతో కుస్తీ పట్టాడు.కంప్యూటర్ నేర్చుకొని దివారాత్రాలు
దానిదగ్గరే కష్టపడి ఎన్నో ఇస్లామిక్ పుస్తకాలు తెలుగులో తయారుచేసి తన జన్మ
సార్ధకం చేసుకున్నారు.తెలుగు వికీపీడియాలో ఆయన కురాన్ భావామృతం ద్వారా
కురాన్ లోని వాక్యాలను తెలుగులో తీసుకోగలుగుతున్నాం,ఖురాన్ తెలుగు
వాక్యాలను మళ్ళీ మళ్ళీ టైపు చేసుకోకుండా కాపీ పేస్టు పద్ధతి కల్పించిన
ఇర్ఫాన్ గారు ధన్యజీవి.రహమాన్ గారు భావామృతాన్ని కొన్ని నెలలపాటు శ్రమపడి
యూనీకోడ్ లోకి మార్చి వికీపీడియాలో ఎక్కించారు.
1980 లో నేను ఒక
భగవద్గీతను గ్రాంధిక బాష నుండి వాడుక బాషలోకి స్వయంగా మార్చుకుని అధ్యయనం
చేస్తుంటే అభినందించారు. నేను బైబిల్ మీద పెడుతున్న శ్రద్ధ ఖురాన్ మీదకూడా
పెట్టాలని హితబోధ చేశాడు. ఆయన ప్రోద్భలం వలన ఇస్లామిక్ ధార్మిక గ్రంథాల
అధ్యయనం ఆరంభించాను.1986 లో గౌలిగూడా ప్రధాన గ్రంథాలయంలో ‘ఎన్
సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం‘ లోని అన్ని సంపుటాలను చదివి నోట్స్
తయారుచేసుకున్నాను .అలా సమకూర్చుకున్న సమాచారంతో ఇస్లాంకు సంబంధించిన
వందలాది వ్యాసాలు రాశాను.ఇర్ఫాన్ గారు కూడా సర్వమత సమభావనతో అన్ని ధార్మిక
గ్రంథాలను అందరూ చదవాలి. అన్నిటినీ వివక్ష లేకుండా అధ్యయనం చేయాలి
అనేవారు.ఆయన సంపాదకుడిగా ఉన్నరోజుల్లో నన్ను గీటురాయిలో రాయమని
ప్రోత్సహించాడు. నా వ్యాసాలకు ఆయన పెట్టిన శీర్షిక పేరు “మనలోమాట”. మలిక్
గారు దానిని “ఉబుసుపోక” గా మార్చారు.ఆతరువాత అది ఉబుసుపోకగానే కొనసాగింది.
“తెలుగు బాషలో నమాజు” (19-7-1987 ఆంధ్రపత్రిక) అనే నా వ్యాసాన్ని ఆయన
ససేమిరా ఒప్పుకోలేదు.అరబ్బీ లోనే నమాజు చెయ్యాలి అనేవాడు. అలాగే బైబిల్
లాగా అరబ్బీ లేకుండా తెలుగులో మాత్రమే ఖురాను రావాలి అనే విషయమై
మాయిద్దరిమధ్య వాదోపవాదాలు జరిగేవి.అరబీ లేకుండా వట్టి తెలుగు నమాజుకానీ
,అరబీ లిపిలోని సూరాలు లేకుండా ఖురాన్ అనువాదం గానీ వ్యర్ధం అని
వాదించేవాడు.రకరకాల ఫాంట్లనుండి తెలుగు యూనీకోడ్ లోకి మార్చటం కోసం చాలా
కష్టపడ్డారు.తన అనువాదాన్ని అడగగానే తెలుగు వికీపీడియాలో ఉచితంగా
ప్రచురించటానికి వెంటనే అంగీకరించారు. ఇర్ఫాన్ గారి తెలుగు ఖురాన్
భావామృతం ఎంత ప్రఖ్యాతి చెందిందో మన అందరికీ తెలుసు. పెళ్ళిళ్ళ‘నిఖానామా’
ను ఉర్దూ భాషతోపాటు తెలుగు లో కూడా రాయాలి అనే పనికి మాత్రం (సాక్షి
దిపత్రిక 19-10-2010) సంతోషంగా అంగీకరించారు.ఎంతో ఓర్పుగా శ్రమపడి
ఆయనకు,ఆయనకోసం వచ్చే మిత్రులకు సపర్యలు చేసిన ఆయన భార్య స్వర్గీయ జకీయా
బేగం అక్క సహకారం ఇర్ఫాన్ గారి విజయం వెనుక ఎంతో ఉంది.మామధ్య ఇలాంటి
అభిప్రాయబేధాలు ఎన్నివచ్చినా దశాబ్ధాల మా స్నేహం వదులుకోలేదు.“మీరు ప్రజల
మేలకోసం సులువైన పద్ధతి అడుగుతారు.వాటికి ఖురాను హదీసుల్లో అనుమతి లేకపోతే
నేనేం చేసేది? అనుమతి ఉంటే నేనే అమలు చేసేవాడిని కదా? అని నన్ను
సమాధానపరిచేవాడు.ఆయన రాసిన ఎన్నో ఉత్తరాలలోనుంచి 1978 నాటి ఒక ఉత్తరం
ఉదాహరణ కోసం చూడండి:
https://www.facebook.com/search/top?q=%E0%B0%A7%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%20%E0%B0%85%E0%B0%AC%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AB%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D
-- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి