తెలుగు మాతృభాషగా గల ముస్లిములకోసం భాషాపరమైన సంస్కరణలు కోరటం,వారు ఎదుర్కొంటున్న వివిధ సామాజిక సమస్యలను చర్చించటం కోసం ఈ బ్లాగు
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
18, నవంబర్ 2011, శుక్రవారం
కార్తెలలో రైతు విజ్ఞానం
కార్తెలలో రైతు విజ్ఞానం
నూర్ బాషా రహంతుల్లా 9948878833
మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్నాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్నానాన్ని దాచారు.తరువాతి తరాలకూ ఆ జ్నానం అందేలా చేశారు.పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయంగొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు.
జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు,పంచాంగాలు తయారు చేశారు.సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు.కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు.ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.సంవత్సరానికి 27 కార్తెలు.తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని ‘కార్తెలు’ ,వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేశారు. ఆయా కార్తెలు నెలలు రాశులు వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతలలో ఎలా చెప్పుకున్నారో చూడండి:
కార్తెలు 27 :- 1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జేష్ట్య 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రవణం 23.ధనిష్ట 24.శతభిషం 25.పుర్వాభాద్ర 26. ఉత్తరాభాద్ర 27.రేవతి
సామాన్య శాస్త్రం
కొబ్బరి చెట్టుకు కుడితి మృత్యువు
సేద్యానికి పద్దులు పనికిరావు
దుక్కికొద్దీ పంట, బుద్ధికొద్దీ సుఖము
పాటిమీద వ్యవసాయం కూటికైనా రాదు
చేనుకు గట్టు ఊరికి కట్టు
వంటికి తిండిపుష్టి, వరికి దుక్కి పుష్టి
నల్లనేలకు నూవులు, గట్టినేలకు కందులు
కలుపుతీసిన చేను కన్నుల పండుగ
ఎరువు చేసే ఉపకారం బంధువులుకూడా చేయరు
లోతు దుక్కికి ఎక్కువ పంట
పొరుగూరు చాకిరి, పొరుగూరి వ్యవసాయం, తనను తినేవే గానీ, తాను తినేవి కావు.
కరువుకు గ్రహణాలు ఎక్కువ
4 దిక్కులు
తూర్పున ఇంద్ర ధనస్సు దూరాన వర్షం
తూర్పున వరద గూడు వేస్తే తుంగ మడిలో, పడమర వేస్తే బండ మీద పశువుల్ని కట్టాలి.
తూర్పున వరద గూడు వేస్తే తుంగ గడ్డ కూడా తడవదు.పరమాట వేస్తే పల్లాలన్నీ (పెంట గుంటలన్నీ ) నిండుతాయి
తూర్పున కొర్రు వేస్తే దుక్కిటెద్దు రంకె వేస్తుంది
తూరుపు తలాపి దున్నపోతు కూడా పెట్టదు
ఉత్తరాన మబ్బు ఏలితే ఊరకే పోదు
ఉత్తరపు వాకిలి ఇల్లు ఊరకే ఇచ్చినా వద్దు
నెల వంకకు దక్షిణపు కొమ్ము హెచ్చయితే ధాన్యపు ధర హెచ్చు ,ఉత్తరపు కొమ్ము హెచ్చయితే ఉప్పు ధర హెచ్చు
పటమట కొర్రు వేస్తే పాడి ఆవు రంకె వేస్తుంది
పటమట కొర్రు వేస్తే పందిళ్ళ మీద రాజనాలు పండుతాయి
పటమట కొర్రు వేస్తే పాడు గుంటలన్నీ నిండుతాయి .తూర్పున వేస్తే తుంగగడ్డ కూడా తడవదు.
పడమట కుంగిన పొద్దు తూర్పున లేవదా?
పడమటి వాకిలి పగవాడికికూడా వద్దు
పడమట మెరిస్తే పంది కూడా నీళ్ళకు దిగదు
పడమట పావురాయంత మబ్బు నడిస్తే పాతాళం దాకా వాన
కార్తెలు
కార్తె ముందు ఉరిమినా కార్యం ముందర వదిరినా చెడుతుంది.
కార్తె మూల మెరుపు కార్తెకు బలం
కార్తె మూల మబ్బు కారక మానదు
గబ్బరీదు కార్తి వర్షాలకు దిబ్బలూ కరుగుతాయి. చంద్ర పరివేషం వర్ష యోగము
కార్తెల వారీ సామెతలు
1.అశ్వని (ఏప్రిల్ – 14)
అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం
అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.
అశ్వని కురిస్తే అడుగు తడవదు.
2.భరణి (ఏప్రిల్ – 27)
భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.
భరణి ఎండకు బండలు పగులుతాయి.
భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు
భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.
3.కృత్తిక (మే – 11)
కృత్తిక పునర్వసులు సత్తువ పంట.
కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పదిరినా చెడుతుంది.
కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు
కృత్తికలో కుతిక పిసుకుడు
4.రోహిణి (మే – 25)
రోహిణి ఎండకు రోళ్ళు పగులును
రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.
రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకును.
రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నాచిగిరిస్తవి ,రోళ్ళు పగలనన్నా పగులుతవి
రోహిణిలో జొన్నలు సాహిణిలో గుర్రాలు
రోహిణిలో విత్తులో రోయక వేస్తారు,మృగశిరలో ముంచి పోస్తారు
రోహిణిలో విత్తటం రోటిలో విత్తటం
5.మృగశిర (జూన్ – 8)
మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును
మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.
మృగశిరలో ముల్లోకాలు చల్లబడును.
మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి (ఎలుగిస్తాయి).
మృగశిరలో బెట్టిన పైరు,మీస కట్టున బుట్టిన కొడుకు మేలు.
మృగశిరి వర్షిస్తే మఖ గర్జిస్తుంది.
మృగశిర కురిస్తే ముంగాలి పండును.
మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.
6.ఆరుద్ర (జూన్ – 22)
ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు
ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.
ఆరుద్ర కురిస్తే దారిద్ర్యము లేదు.
ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.
ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడుతాయి .
ఆరుద్రతో అదనుసరి.
ఆరుద్రలో అడ్డెడు చల్లితే పునాశకు ‘పుట్టెడు’పండుతాయి.
ఆరుద్ర వాన ఆదాయాల బాన.
ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.
ఆరుద్ర లో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.
ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.
ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.
ఆరుద్ర వాన అరుదు వాన
ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి
7.పునర్వసు (జులై – 6) :-
పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.
పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు
8.పుష్యమి (జులై – 20) :-
పుష్యమి కురిస్తే పూరి పిట్ట గూడ తడవదు.
9.ఆశ్లేష (ఆగష్టు – 3) :-
ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది
ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.
ఆశ్లేష వాన అరికాలు తేమ
ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేస్తుంది.
ఆశ్లేష ముసురు (ముసలి కార్తె )– ఆగి ఆగి తుంపర కురియును.
ఆశ్లేషలో అడుగు కొక చినుకైనా అడిగినన్ని వడ్లు.
ఆశ్లేషలో అడ్డెడు చల్లటం – పుట్టెడు ఏరుకోవటం
ఆశ్లేషలో ఊడిస్తే – అడిగినంతపంట.
ఆశ్లేష వర్షం – అందరికి లాభం.
ఆశ్లేష వాన అరికాలు తేమ
ఆశ్లేషలో పూస్తే అంతులేని పంట
ఆశ్లేషలో తడిస్తే ఆడది మొగోడౌతాడు
ఆశ్లేష ఉడ్పు ఆరుగురి ఊడ్పు
10.మఖ (ఆగష్టు – 17) :-
మఖకు మానికంత చెట్టయితే – కార్తీకానికి కడవంత గుమ్మడికాయ
మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.
మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి.
మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు(గిట్టినట్లు).
మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు.
మఖా పంచకం సదా వంచకం.
మఖ పుబ్బలు వొరుపైతే మహత్తరమైన కాటకం (క్షామం) .
మఖ ఉరిమితే మదురుమీద కర్రయినా పండును.
మఘలో మానెడు చల్లే కంటే ఆశ్లేషలో ఆడ్డెడు చల్లేది మేలు
11.పుబ్బ (ఆగష్టు – 31):-
పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే.
పుబ్బలో చల్లేది, మబ్బుతో మొత్తుకునేది.
పుబ్బ ఉబ్బుబ్బి కురిసినా గుబ్బిచ్చి చెట్టు కింద నానదు
పుబ్బ కెరిలితే భూతం కెరిలినట్లు
పుబ్బ రేగినా బూతు రేగినా నిలవవు
పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు
పుబ్బలో పుట్టెడు చల్లే కంటే మఖలో మానేడు చల్లటం మేలు
పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు
పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు
12.ఉత్తర (సెప్టెంబర్ – 13):-
ఉత్తర చూసి ఎత్తరగంప – విశాఖ చూసి విడవరా కొంప.
ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా తప్పదు.కురవక కరవక మానవు.
ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.
ఉత్తర పదును ఉలవకు అదును.
ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.
ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం
ఉత్తర వెళ్ళాక వరి ఊడ్పులు కూడదు
ఉత్తరలో చల్లిన పైరు,కత్తెరలో నరికిన కొయ్య
ఉత్తరలో చల్లితే ఊల తగులుతుంది
వృష్టికి ప్రమాణం ఉత్తర హస్తలు
13.హస్త (సెప్టెంబర్ – 27) :-
హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన
హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.
హస్తకు ఆది పంట – చిత్తకు చివరిపంట.
హస్తకు ఆరు పాళ్ళు – చిత్తకు మూడు పాళ్ళు.
హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.
హస్తలో అడ్డెడు చల్లేకంటే – చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.
హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.
హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.
హస్తలో చల్లితే హస్తం లోకి రావు (అక్షింతలకు కూడా రావు)
హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.
హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు వేయించండి (కాసుకొక దాన్ని కాలు పట్టి ఈడవండి) అన్నవట గొర్రెలు.
హస్త చిత్తలు వరపైతే అందరి సేద్యం ఒకటే
హస్తకు అణకు (అణుగు) పొట్ట, చిత్తకు చిరు పొట్ట
14. చిత్త (అక్టోబర్ – 11):-
చిత్త కురిస్తే చింతలు కాయును
చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడుతుంది.
చిత్తి ఎండకు బట్టతల పగులును.
చిత్తలో చల్లితే చిత్తుగా పండును (ఉలవ).( చిట్టెడు కావు )
ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.
చిత్త, స్వాతులు కురవకపోతే చిగురాకుగూడ మాడిపోతుంది. చీమకు కూడా నాంబ్రం
చిత్త నేలలో దుక్కి – పుటం పెట్టిన పుత్తడి.
చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.(వీసానికి పుట్టెడు పండుతాను అన్నదట జొన్న)
చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.
చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.
చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.
చిత్త స్వాతి సంధించినట్లు
చిత్తలో పుట్టి స్వాతిలో చచ్చినట్లు
చిత్త జల్లు స్వాతి వాన (చిత్త ఉబ్బ)
15.స్వాతి (అక్టోబర్ – 27) :-
స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.
స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.
స్వాతి కురిస్తే భీతి కలుగుతుంది .
స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.
స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.
స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.
స్వాతి వానకు సముద్రాలు నిండును.
స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకేల?.
స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.
స్వాతీ! నేను జవురుకొస్తాను – విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.
స్వాతి విత్తనం స్వాతి కోపులు
స్వాతి వర్షం చేమకు హర్షం
16.విశాఖ (నవంబర్ – 16) :-
విశాఖ వర్షం – వ్యాధులకు హర్షం.
విశాఖ కురిస్తే పంటకూ విషమే (విషం పెట్టినట్లు)
విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం
విశాఖ విసురుతుంది.
విశాఖ వరదలు సంక్రాంతి మబ్బులు
విశాఖతో మబ్బులు మజ్జిగ బోజనంతో సరి
విశాఖ పట్టితే పిశాచి పట్టినట్లు
విశాఖ చూచి విడవరా కొంప (ఉత్తర చూచి ఎత్తరా గంప)
17.అనూరాధ (నవంబర్ – 20) :-
అనూరాధ కార్తెలో అనాధ కర్రయినా ఈనుతుంది
అనూరాధలో తడిస్తే మనోరోగాలు పోతాయి (ఆడది మగాడవుతాడు)
అనూరాధలో అడిగినంత పంట
18.జేష్ట్య (డిశంబర్ – 3) :-
జ్యేష్ట చెడకురియును – మూల మురగ కురియును
19.మూల (డిశంబర్ – 16) :-
మూల కార్తెకు వరి మూలన జేరుతుంది
మూల ముంచుతుంది,జ్యేష్ట చెరుస్తుంది
మూల వాన ముంచక తీరదు
మూల కురిస్తే ముంగారు పాడు
మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు
మూల మంటే నిర్మూల మంటాడు
మూలలో చల్లిన ఉలవలు మూడు పువ్వులు ఆరు కాయలు
మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది.
20.పూర్వాషాడ (డిశంబర్ – 29) 21.ఉత్తరాషాడ (జనవరి – 11) 22.శ్రావణం (జనవరి – 24) 23.ధనిష్ట ( ఫిబ్రవరి – 6 ) 24.శతభిషం ( ఫిబ్రవరి – 19) 25.పుర్వాభాద్ర ( మార్చి - 4 ) 26. ఉత్తరాభాద్ర ( మార్చి - 4 )
27.రేవతి ( మార్చి - 31 )
రేవతి వర్షం రసమయం – రమణీయం
రేవతి వర్షం అన్ని పంటలకు రేణింపే.
రేవతి వర్షం సర్వ సస్యములకు రమణీయం
6 ఋతువులు – 12 నెలలు—3 కాలాలు
1.ఎండా కాలం
1.వసంత ఋతువు (మార్చి – మే ) -- చైత్ర(మార్చి23) ,వైశాఖ (ఏప్రిల్ 25) – చెట్లు చిగిర్చుతాయి
చైత్ర వైశాఖల్లో పెండ్లి కావిళ్ళు,శ్రావణ భాద్ర పదాల్లో దినం కావిళ్ళు
2.గ్రీష్మ ఋతువు (మే – జూలై ) -- జ్యేష్ట (మే 23) ,ఆషాడ (జూన్ 21) --ఎండలు పెరుగుతాయి
అన్నిపైరులకు ఆషాఢం
ఆషాడ మాసంలో అరిసెలు వండటానికి పొద్దు ఉండదు
ఆషాడానికి ఆకుపోతలు
ఆషాడానికి పిషాణాలు బద్దలౌతాయి
2.వానా కాలం
3.వర్ష ఋతువు (జూలై –సెప్టెంబర్) – శ్రావణ (జూలై 21) ,బాధ్రపద (ఆగస్టు 20,సెప్టెంబర్ 19) –వర్షాలు కురుస్తాయి
శ్రావణం లో శనగల గోల భాద్రపదంలో బాధల పోరు
కరువులో అధిక మాసం (ప్రతి రెండున్నర ఏళ్ళకూ ఒక అధికమాసం వస్తుంది.నందన లో భాద్రపదం అలాంటిదే )
4.శరత్తు ఋతువు (అక్టోబర్ –డిశంబర్ ) –ఆశ్వీయుజ (అక్టోబర్ 18), కార్తీక (నవంబర్ 16) –వెన్నెల బాగా కాస్తుంది.
శరత్కాల వర్షం కృపణుని ఔదార్యం వంటిది.
కార్తీక మాసాన కడవలు కడగటానికి (కడవ నీళ్ళు తెచ్చే పొద్దు) కూడా పొద్దుండదు.
కార్తీక మాసంలో కడపటి వానలు.
కార్తీక వర్షం కర్ణుని యుద్దం.
కార్తీకానికి కరుగు మోపుతుంది
కార్తీక మాసానికి కుదురంత ఉందునా ,మాఘ మాసానికి నా మహిమ చూపిస్తాను
కార్తీక మాసానికి కాకులు తొక్కుతాయి
కార్తీక పున్నమికి కలక పంటలు
3.చలి కాలం
5.హేమంత ఋతువు (డిశంబర్ –ఫిబ్రవరి) –మార్గశిర(డిశంబర్ 16) ,పుష్య( జనవరి 13) –మంచు కురుస్తుంది
మార్గ శిరంలో మహత్తయన చలి
మార్గ శిరంలో మామిడి పూత
మార్గ శిరంలో మాట్లాడటానికి పొద్దు ఉండదు
పుష్య మాసంలో పూలు,పూసలు గుచ్చటానికి కూడా పొద్దుండదు
పుష్య మాసానికి పూసంత వేసంగి.
6.శిశిర ఋతువు (ఫిబ్రవరి –ఏప్రిల్ ) – మాఘ(ఫిబ్రవరి 13) ,ఫాల్గుణ (మార్చి 13) –ఆకులు రాలిపోతాయి
మాఘ మాసపు వాన మగడు లేని చాన
మాఘ మాసపు చలి మంటలో పడ్డాతీరదు.
మాఘ మాసంలో మాకులు సైతం వణుకుతాయి.
ఫాల్గుణ మాసపు వాన పది పనులకు చెరుపు
12 రాశులు
(మేషం వృషభం,మిధునం,కర్కాటకం,సింహం,కన్య,తుల,వృశ్చికం,ధనుస్సు,మకరం,కుంభం,మీనం).
సింహం లో చీరి ఊడ్చడము ,కన్యలో కంగా పింగా ఊడ్చడము ఒకటే
కన్యలో చల్లితే కను గుంటల్లోకి రావు (ఊదుకు తినటానికి కూడా రావు)
కర్కాటకం కురిస్తే కాటకం బందు (కాడి మోకు కూడా తడవదు)
కర్కాటకం బిందిస్తే కాటకముండదు
మిధునంలో పుట్టిన మొక్క మీసకట్టులో పుట్టిన కొడుకూ అక్కరకు వస్తారు
మీన మేషాలు లెక్క బెట్టినట్లు
మూలాలు:
తెలుగు సామెతలు: కెప్టెన్ ఎం.డబ్ల్యు.కార్, వి. రామస్వామి శా స్త్రులు 1955
లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు పి.కృష్ణమూర్తి ది మోడర్న్ ప్రెస్ తెనాలి 1955
సాటి సామెతలు నిడుదవోలు వెంకటరావు,విజయా పబ్లికేషన్స్ మద్రాసు 1961
తెలుగు సామెతలు: దివాకర్ల వెంకటావధాని, పి.యశోదా రెడ్డి, మరుపూరి కోదండరామరెడ్డి.- తెలుగు విశ్వవిద్యాలయం మూడవ కూర్పు పునర్ముద్రణ 1986
తెలుగు సామెతలు: పి. రాజేశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1993.
తెలుగు సామెతలు: గీతికా శ్రీనివాస్, జే.పి.పబ్లికేషన్స్ 2002
తెలుగు సామెతలు:రెంటాల గోపాలకృష్ణ, నవరత్న బుక్ సెంటర్ 2002
సంపూర్ణ తెలుగు సామెతలు, మైథిలీ వెంకటేశ్వరరావు ,జె.పి.పబ్లికేషన్స్ విజయవాడ 2011
హిందూ సంప్రదాయం ప్రకారం :
* ఏడు నక్షత్రాలను సప్తర్షులు"Big Dipper" లేదా "Ursa Major" అంటారు.వారు మరీచి,అత్రి,అంగీరసు,పులస్త్యుడు,పులహుడు,క్రతువు,వశిష్టుడు.కొన్ని చోట్ల భరద్వాజుడు , గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, విశ్వామిత్రుడు , భృగువు, కశ్యపుడు,కుత్సుడు కూడా ఉంటారు. వీళ్ళ నుండే అన్నివంశాలు వృద్ధి చెందాయి అంటారు.
భారతీయ
నామం Bayer
Desig పాశ్చాత్య
నామం
క్రతు α UMa Dubhe
పులహ β UMa Merak
పౌలస్త్య γ UMa Phecda
అత్రి δ UMa Megrez
అంగీరస ε UMa Alioth
వశిష్ఠ ζ UMa Mizar
మరీచి η UMa Alkaid
"వశిష్ఠ" నక్షత్రానికి ప్రక్కన తక్కువ కాంతితోకనిపించే జంటనక్షత్రం పేరు "అరుంధతి" (Alcor/80 Ursa Majoris).
ఇస్లాం లో నక్షత్రాలు,వర్షం,వాతావరణ విశేషాలు :
చంద్రుడు,నక్షత్రం బొమ్మను ఇస్లాం కు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు.దీనికి ఇస్లాం మత లేఖనాల్లో ఆధారం ఏమీలేదు.అయినా ముస్లిం దేశాల జెండాలు,అంతర్జాతీయ రెడ్ క్రీసెంట్ లాంటి సంస్థలూ ఈ నెలవంక గుర్తునే ఉపయోగిస్తున్నాయి. నెలవంక బొమ్మ కొన్ని వేల ఏళ్ళనుండి సూర్య చంద్రులు,ఆకాశ దేవతలను పూజించే వారినుండి ఇస్లాం లో ప్రవేశించాయి.ప్రవక్త కాలంలో ముస్లిముల జండాలపై ఎలాంటి గుర్తులూ ఉండేవి కావు.1453 లో కాన్ స్టాంటినోపుల్ (ఇస్తాంబుల్) ను టర్కీయులు జయించినప్పుడు ఈ గుర్తును పెట్టారు.ఒట్టామన్ సామ్రాజ్య స్థాపకుడు ఉస్మాన్ కు నెలవంక గుర్తున్న జెండా భూమి ఈకొన నుండి ఆకొన వరకూ రెపరెప లాడినట్లు కల వచ్చిందట .
ఇది శుభ శకునంగా భావించి ఆయన ఈ గుర్తును తన సామ్రాజ్యచిహ్నంగా ఖరారు చేశాడట.నక్షత్రం లోని అయిదు ముక్కులూ ఇస్లాం బోధించే అయిదు మూలవిశ్వాస స్థంభాలకు సూచనగా ఊహించారు.వాస్తవానికి ఇది ప్రకృతి ఆరాధకుల చిహ్నమే.ఒట్టామన్ టర్కులు ఈ బొమ్మను వాడారుకాబట్టి అది స్థిరపడిపోయింది గానీ నిజానికి ఇస్లాం విశ్వాసాలకు నెలవంక బొమ్మకూ సంబంధం లేదు.
కొంతమందిమాత్రం నెలవంక బొమ్మ వాడొచ్చు అనటానికి ఈ వాక్యాన్ని సూచిస్తారు.They ask thee, (O Muhammad), of new moons, say: They are fixed seasons for mankind and for the pilgrimage. It is not righteousness that ye go to houses by the backs thereof (as do the idolaters at certain seasons), but the righteous man is he who wardeth off (evil). So go to houses by the gates thereof, and observe your duty to Allah, that ye may be successful.ఖురాన్ 2:189 http://en.wikipedia.org/wiki/Symbols_of_Islam
పన్నెండవ శతాబ్దం లోనే ఉమర్ ఖయ్యాం జలాలీ సౌర కేలండర్ ను ప్రవేశ పెట్టాడు. అబ్దుల్ రహ్మాన్ సూఫీ,నసీరుద్దీన్ తూసీ,కుతుబుద్దీన్ సిరాజీ లాంటి ముస్లిం ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త నక్షత్రాలను కనుగొన్నారు.
*ఆయనే దేదీప్యమానంగా వెలిగిపోతున్న నక్షత్రానికి ప్రభువు (నజ్మ్53.49)
*వారు నక్షత్రాల వలన దారినీ ప్రదేశాలను గుర్తు పెట్టుకుంటారు(నహ్ల్ 16.16)
* “ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు, మీ సిరిసంపదల్లోనూ సంతానంలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు, మీ కొరకు తోటల్ని ఉత్పత్తి చేస్తాడు, ఇంకా మీ కొరకు నదీనదాలను, కాలువలను ప్రవహింపజేస్తాడు”. (నూహ్ 71:10-12).
*వర్షం నక్షత్రాల వలనకాదు వచ్చేది అల్లాహ్ దయ వలన" (బుఖారీ1.807)
* వర్షం కురిపించమని అల్లాహ్ ను వేడుకోవాలి.దీనినే ‘సలాతుల్ ఇస్తిస్ కా’ అంటారు.సలాతుల్ ఇస్తిస్ కా గురించి వెళ్ళేటప్పుడు నిరాడంబరమైన వస్త్రాలు ధరించి, ఎంతో వినయవినమ్రత, అణుకువతో వెళ్ళాలి.ఒక వేళ వర్షం అవసరానికి మించి కురిస్తే ఓఅల్లాహ్ మాచుట్టుప్రక్కల్లో , కొండల్లో, లోయల్లో, చెట్లు చేమలు ఉన్నచోట వర్షంకురిపించు.మాపై వద్దు అని ప్రార్దించాలి.
* అల్లాహ్ మిమ్మల్ని భయపెట్టటానికి, ఆశపెట్టటానికి మెరుపును చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడు. మరి దాని ద్వారా మృతభూమికి జీవం పోస్తున్నాడు. ఇందులో బుద్ధిజీవుల కోసం ఎన్నో నిదర్శనాలున్నాయి”. “ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు. వాటివల్ల మీకు భయం కలగటంతో పాటు, మీలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి.బరువైన మబ్బులను సృజిస్తున్నాడు. ఉరుము సయితం ఆయన పవిత్రతను కొనియాడుతోంది, ఆయననే ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతివల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి, తాను కోరినవారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్ విషయంలో పిడివాదానికి దిగుతున్నారు! ఆయన మహా శక్తిమంతుడు ,యుక్తిపరుడు”. (రఅద్ 13:12,13).
“మీరు త్రాగే మంచినీరు గురించి ఎన్నడైనా ఆలోచించారా? దానిని మేఘాల నుంచి మీరు కురిపిస్తున్నారా? లేక దానిని కురిపించేది మేమా? మేమే గనక తలచుకుంటే దానిని చేదునీరుగా మార్చేయగలం. మరలాంటప్పుడు మీరు ఎందుకు కృతజ్ఞత చూపరు?”. (వాఖియ 56:68-70)
“మీరు త్రాగే ఈ నీరు గనక భూమిలో ఇంకిపోతే మీ కొరకు నీటి ఊటను బయటికి తెచ్చేదెవరో చెప్పండి”. (అల్ ముల్క్ 67:30)
*ఒక చీమ తన వెనుక కాళ్ళను ఆకాశం వైపుకు ఎత్తి “దేవా! నీవు సృష్టించిన ఇతర ప్రాణుల మాదిరిగానే మేము కూడానీ ప్రాణులం. నీ వర్షపు నీరు లేకుండా మేము బ్రతుకలేము’” అని వేడుకొంది. ఇది విన్న సులైమాన్ ప్రవక్త ‘మరలిపోదాం పదండి, ఇతర జీవాల ప్రార్థనా ఫలంగా మీపై వర్షం కురిసినట్లే”’ అని వెనుతిరిగారు. (ముస్నద్ అహ్మద్).
బైబిల్ లో నక్షత్రాలు :
సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. ద్వితీయోపదేశ కాండము 4:19
ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు యోబు 9:9
*కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా? జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటినిబయటికి రప్పింపగలవా? యోబు 38:31-35
నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.(కీర్తన 147:3)
ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు (ఆమోసు5:8)
నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను.నక్షత్రములు తమ మార్గములలోనుండిసీసెరాతోయుద్ధముచేసెను. న్యాయాధిపతులు5:20
నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును యెషయా 14:13
యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి మత్తయి 2:2
నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు గదా 1 కోరింథీయులకు 15:41
ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూత. (ప్రకటన గ్రంథం1:20)
సూర్య 1.12.2013
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)