తెలుగు మాతృభాషగా గల ముస్లిములకోసం భాషాపరమైన సంస్కరణలు కోరటం,వారు ఎదుర్కొంటున్న వివిధ సామాజిక సమస్యలను చర్చించటం కోసం ఈ బ్లాగు
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
10, ఆగస్టు 2012, శుక్రవారం
మూల భాషా? మాతృభాషా?
మూల భాషా? మాతృభాషా?
దైవారాధనలో ఏ భాష ఉత్తమం ? అనే అంశం మీద ఫేస్ బుక్ లో ఆసక్తి కరమైన చర్చ జరిగింది.మూల భాష -మాతృ భాషల పక్షాన ఎవరి వాదన వారు వినిపించారు.ఆవేశపడకుండా ఆలోచనతో ప్రశాంతంగా విషయ అవగాహనకై చదవండి. చర్చ ఇలా సాగింది:
ముస్తాక్ అహమద్ : అరబీ భాషనే దేవుని భాషగా వాదించే తీరు కొందరు ముస్లిం పండితుల్లోనూ కనిపిస్తుంది.అల్లాహ్ ఏదో ఒక ప్రత్యేక భాషా నిర్మాత కాదు.భాషా దురభిమాని కాదు .ఆయన సకల భాషల నిర్మాత.మాదే దైవిక భాష అని వాదించేవారు కాస్త తమ ఇంగితజ్నానంతో ఆలోచించాలి.ఏదో ఒక్క భాష మాత్రమే దేవునికి ఇష్టమైనదై ఉంటే ప్రపంచ ప్రజలందరికీ ఆ ఒక్క భాషే వచ్చి ఉండాలి.పోనీ దేవుడు తన గ్రంధాలన్నింటినీ ఆ ఒక్క భాషలోనే అవతరింపజేసి ఉండాలి.ఆరెండూ జరగలేదంటే దేవునికి ఇష్టమైన ఏదో ఒక్క భాష మాత్రమే ఉందనే వాదం అర్ధం లేనిది.వివిధ భాషలను నేనే చేశాను అని అల్లాహ్ ప్రకటించాడు (ఖురాన్ 30:22). ఏదో ఒక ప్రత్యేక భాషను మాత్రమే దేవుడు ఇష్టపడటం ఏమిటి?హాస్యాస్పదం. అలా అనటం అల్లాహ్ పై ఘోర నిందారోపణ చేయటమే అవుతుంది.ఇది తమకున్న సంకుచితత్వాన్ని భాషా దురభిమానాన్నిఅల్లాహ్ కు అంటగట్టడమే అవుతుంది.అల్లాహ్ కు భాషా దురభిమానం వంటి బలహీనత లేదు. అల్లాహ్ దాసులు సకల భాషలనూ సమాదరించాలి.ఉమ్ముల్ కితాబ్(లౌహే మహ్ఫూజ్ ) అనే మాతృ గ్రంధం అరబీ భాషలో లేదు.దానిలో నుండి ఖురాన్ ను తీసి అరబ్బుప్రజలకు అర్ధం కావటానికి సరళమైన అరబీ భాషలోకి అనువదించి పంపించాడు.( ఖురాన్ 43:3,4 ,44:58).అందుకు కారణం అరబీ భాష ఔన్నత్యం కాదు .సంబోదకులు అరబీ బాష తెలిసినవారు కావటమే ( ఖురాన్ 12:2,43:1-3). భాష ఎంత గొప్పదైనా ఆ భాషరాని ప్రజల ముందు ఆ భాషలో మాట్లాడితే చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే కదా?అలాగే మనమూ ఖురాన్ ను ఆయా భాషలలోకి మార్చి ప్రజలకు వినిపించాలి.శ్రోతల భాష కు ప్రాధాన్యత ఇవ్వాలి.ఇది విశ్వాసులకు విధి (వాజిబ్).అరబీ భాషా భజన ఆపాలి.సందేశకులు శ్రోతల మీద తమ భాషను రుద్దకుండా ప్రజల భాషను నేర్చుకొని వారి భాషలోనే సందేశమివ్వాలి.అదే అల్లా మరియు ప్రవక్త సంప్రదాయం.అర్ధంకాని భాషలో భావం తెలుపుదామనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది( ఖురాన్41:44).ఖురాను గ్రంధాన్ని సుమారు వెయ్యి సంవత్సరాల వరకూ అనువాదం చెయ్యకుండా అరబీ రాని ప్రజలను నరకం లోకి నెట్టారు.దైర్యం చేసి ఫారశీక భాషలోకి చక్కగా భావానువాదం చేసిన మౌదూదీ ని కూడా కాఫిర్ అన్నారు.--- ముస్తాక్ అహమద్,కాకినాడ ఫోన్.9848516362 scriptural.info@gmail.com
నూర్ బాషా రహంతుల్లా: మాత్రుభాషలో దైవారాధనవలన ఉన్న ప్రయోజనాలు తాను పలికే ప్రతి పలుకూ చక్కగా అర్ధంకావటం,హ్రుదయం స్పందించటం,తెచ్చిపెట్టుకున్న క్రుత్రిమత్వం లేకుండా దేవుడు తనను పుట్టించిన భాషలోనే హక్కుగా సహజంగా ప్రార్ధించటం.ఇలాంటి లాభాలన్నీ మూల భాష ద్వారా ఆ భాష బాగా నేర్చిన పండితులకుకలిగితే కలుగవచ్చు కానీ మూల భాషరాని వాడికి మాత్రం ఆ భాష వలన ఏ లాభమూ లేదు. అతనికి మాత్రుభాషలోని అనువాదమే వేదం లాంటిది.
జమీల్ అహ్మద్ :మూల భాష రాని వారికి తాను పనికే ప్రతి పలుకూ దేవుడిచ్చిన సందేశమే అని ఎలా తెలుస్తుంది?వేరే వారు అనువదించిన కుత్రిమత్వమే కదా అందులో ఉండేది. సహజత్వం మూల భాషలోనే కదా ఉండేది. మూల భాషను నేర్చుకుంటేనే సహజత్వాన్ని పొందగలం.
ముహమ్మద్ నజీరుద్దీన్ : పారశీక భాషలో తొలి అనువాదం చేసినవారు మౌదూదీ కాదు షాహ్ విలియుల్లాహ్ ముహద్దిస్ దహల్వీ రహిమహుల్లాహ్, (2/3/1703-17/8/1462).
జమీల్ అహ్మద్ : ఇక అరబీ భాష విషయంలో మీరు వ్రాసిన మాటలు చాలా వరకు నిజమైనప్పటికీ, కొన్ని విషయాల్ని మనం కూడా నమ్మకం తప్పదుః 1- అల్లాహ్ ఉద్దేశాన్ని మనం మన భాషలో అనువదింపబడిన ఖుర్ఆన్ ద్వారా తెలుసుకోవచ్చు. కాని ఖుర్ఆన్ అరబీ భాషలో పారాయణం చేయడం అధిక పుణ్యం. దీనిని మనం తిరస్కరించరాదు. 2- నమాజులో ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో అరబీలో ఉన్న సూరాలను, దుఆలను, జిక్ర్ ను మాత్రమే చదవాలి. వాటి అనువాదాలను చదవడం సరిపోదు. ఈ విషయాలు మింగడుపడనివారికి నచ్చజెప్పే మరెన్నో లాజిక్ పద్ధతులు కూడా ఉన్నాయి. కొరిన వారు మాతో సంప్రదిస్తే ఇన్షాఅల్లాహ్ ప్రయత్నం చేస్తాను. soolaaaaar@yahoo.com
వసీం అక్రమ్ : మనం హజ్ చేస్తాము.అక్కడ రంగు,వర్ణం,ప్రాంతం అనే బేధాలు ఉండవు. కదా? అరబీ భాష ప్రావీణ్యం లేకపోతే వింత చూపులు చూసుకోవాల్సి వస్తుంది.ఎప్పుడైనా ఫారిన్ వెళ్ళామనుకోండి,అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ లో నమాజు ఆజాను,ఖుత్బాలు ఇస్తే ?అందుకే అరబీ భాష ఉండటం వల్ల మనలో ఐకమత్యం పెరుగుతుంది.
నూర్ బాషా రహంతుల్లా : తన సొంత జనం భాష రాని ఏ వ్యక్తినీ దేవుడు ప్రవక్తగా పంపలేదు. (ఖురాన్14.1) మూల భాష రాని వారికి తాను పనికే ప్రతి పలుకూ దేవుడిచ్చిన సందేశమే అని తెలియజెప్పినవాళ్ళే ఖురాన్ అనువాదకులు.అనువద్దం మూల భాషలోనుంచి మాత్రుభాషలోకి జరుగుతుంది కాబట్టి సొంత భాషలోకి దైవ సందేశాన్ని పొందిన హ్రుదయానందం చెప్పనలవికాదు.హ్రుదయం తెరువబడుతుంది.మనసు ఆలోచిస్తుంది.ఐకమత్యంకోసం ఎవరి మాత్రుభాష వారికి ఉపయోగపడుతుంది.పరాయి భాషతో ఐకమత్యం వచ్చినట్లు ఆసమయానికి కనబడినా తిరిగి సొంత భాషలోకి అనువదిస్తేనే అర్ధమయ్యేది, పనులు సాగేది. ప్రవక్త అరబ్బేతర భాషల వారితో వ్యవహారాలు నడిపేందుకు వీలుగా జైదును హెబ్రూ, సిరియా భాషలు నేర్చుకొమ్మన్నారు.
సుహైబ్ గ్రీకు భాష వారి మధ్య పెరిగి అరబ్బీ మరచిపోయాడు. అరబ్బీ రాకపోయినా అతను విశ్వాసాన్ని బట్టి ముస్లింగానే పరిగణించబడ్డాడు.
సల్మాన్అనే పర్షియన్కు జొరాష్ట్రియన్, క్రైస్తవ లేఖనాలూ, ఖురాన్లోనూ మంచి పరిజ్ఞానం ఉంది. ముహమ్మద్ప్రవక్త గారి జీవిత కాలం లోనే ఖురాన్ను ఫారసీ భాషలోకి తర్జుమా చేసిన మొదటి వ్యక్తి ఈయనే.
జమీల్ అహ్మద్ : అరబ్బేతర భాషలు నేర్చుకోవడం తప్పు అని ఇక్కడ ఎవ్వరూ చెప్పడం లేదు మరియు అరబ్బీ భాష వచ్చిన వాడే ముస్లిం రాకపోతే ముస్లిం కాదు అని ఎవ్వరూ చెప్పడం లేదు. ఎవరు ముందుగా ఖురాన్ ను అనువాదం చేసారు అనేది కూడా సమస్య కాదు. మూల భాషే రాక పోతే ఎవరైనా గ్రంధాన్ని ఎలా అనువదించగలరు.
నూర్ బాషా రహంతుల్లా : ఏదీ తప్పుకానప్పుడు ఇక సమశ్య ఏముంది?జై మాత్రు భాష,జై జై మూలభాష అందాం.మూల భాషను నేర్చి మాత్రుభాషల్లోకి దైవసందేశాన్ని అందజేసిన మహనీయులు,ప్రజల జ్నాన సంపదను పెంచిన వైతాళికులు అనువాదకులే. అనువాదకులందరికీ నమస్కారం.
జమీల్ అహ్మద్ : సమస్య ఏమంటే ఎవరికి వారు అర్థం చేసుకొని పొందే ఆనందానికి ఇతరుల అర్థానికి పొందే ఆనందానికి చాలా తేడా ఉంటుంది
నూర్ బాషా రహంతుల్లా: ఆ తేడా ఎప్పుడూ ఉంటుంది.అది తేడా మాత్రమే.సమశ్య కాదు.తెలుగులోనుంచి అరబీ లోకి మార్చినా అలాంటి తేడా ఉంటుంది.అసలు గ్రంధమే లేక పోవటం/రాకపోవటం కంటే అనువాద గ్రంధమైనా ఉండటమే మాలాంటివారికి మహా భాగ్యం.
జమీల్ అహ్మద్ : అది సమస్య కాబట్టే ఈ వాదన జరుగుతుంది. గ్రంధము తెలుగులో భగవంతుడు అవతరింపజేసి ఉంటే ఖచ్చితంగా తెలుగు నెర్చుకున్న వాడికి ఎక్కువ ప్రయోజనం కలిగేది. గ్రంధమే లేకపోతే అనువాదం అన్న సమస్యే ఉత్పన్నం కాదు. గ్రంధం అరబ్బీలో ఉంది కాబట్టే అరబ్బీ నేర్చుకున్న వారికి వేరే ఏ ఇతర భాషలు నేర్చుకున్న వారి కంటే ఎక్కువ ప్రయోజనము ఉంటుంది
నూర్ బాషా రహంతుల్లా: అది మీకు సమశ్య కావచ్చు.మీరు అరబీలోనే ఆ ఃఎక్కువఃప్రయోజనం పొందుతున్నారు,పొందండి.అనువాదకుల దయ వల్ల ఇప్పటికే ప్రజలు చాలా ప్రయోజనం పొందారు.ఇంకా పొందుతారు.అనువాదాల్లోనుండి దైవసందేశం అన్ని భాషల్లోకి తన్నుకొని బయటకు వస్తోంది.పిక్తాల్,మౌదూదీ,ఇర్ఫాన్ లాంటి వారి అనువాదాల వల్ల అపారమైన మేలు కలిగింది,కలుగుతోంది.
జమీల్ అహ్మద్ : అరబ్బీ నేర్చుకోవడము ద్వారా చాలా మంది ఆ ఎక్కువ ప్రయోజనము పొందుతున్నారు. మీరు అనువాదం వల్ల పొందిన ప్రయోజనము కంటే ఎక్కువ ప్రయోజనము పొందాలని అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాను.
నూర్ బాషా రహంతుల్లా: అల్లా కృప. మన తెలుగు భాషలో కూడా ఖురాన్ కు పది అనువాదాలు వచ్చాయి.హదీసులు ,ఆయా విషయాలపై ఇస్లాం వైఖరిని వెల్లడిస్తూ వందలాది పుస్తకాలు ముద్రణై ఆత్మీయ వెలుగులు తెచ్చాయి.ఎవరికివారే దైవ గ్రంధాలను తమ సొంతభాషలో పరిశోధించుకుంటున్నారు,అనుమానం వస్తే ప్రశ్నిస్తున్నారు. ఈ అనువాదాల వల్ల దైవ జ్నానం ప్రజల మధ్య విస్తరించింది.వీలైతే మీరు మూలభాష ద్వారా పొందిన ఆఎక్కువ జ్నానాన్ని మన భాషలో కూడా అందించండి.
1. 1925-చిలుకూరి నారాయణ రావు ఖురాన్ షరీఫ్ మద్రాసు
2. 1941-ముహమ్మదు ఖాసిం ఖాన్ ఖురాన్ షరీఫ్ 9 సూరా హైదరాబాద్
3. 1948-మున్షీ మౌల్విముహమ్మద్ అబ్దుల్ గఫూర్, కురానె మజీద్ కర్నూలు
4. 1980-షేక్ ఇబ్రాహీం నాసిర్ అహమ్మదియ్యా కురాన్ , హైదరాబాద్
5. 1985-హమీదుల్లా షరీఫ్ ,దివ్య ఖుర్ ఆన్ జమాతె ఇస్లామి హింద్ హైదరాబాద్
6. 2004-అబుల్ ఇర్ఫాన్ , ఖురాన్ భావామృతం , హైదరాబాద్
7. 2007-యస్.ఎం.మలిక్ , ఖుర్ ఆన్ అవగాహనం అబుల్ అలా మౌదూదీ
8. 2008-డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా,సౌదీ అరేబియా
9. 2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ ళి2870 పేజీలురి (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి ళిఅహ్ సనుల్ బయాన్రి హైదరాబాదు
10. 2010-అబ్దుల్ జలీల్ ,పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ.862 పేజీలు.
జమీల్ అహ్మద్ : ఈ పది అనువాదాలు ఖురాన్ ను ఒకే విధంగా అనువదించాయా?
నూర్ బాషా రహంతుల్లా: ఒకే విషయాన్ని పదిరకాలుగా అర్ధమయ్యేలా చెప్పాయి.చక్కని వ్యాఖ్యానాలతో అనుమానాలను పఠాపంచలు చేశాయి.వీటన్నిటినీ తులనాత్మకంగా పరిశీలించి చదివినప్పుడు కలిగే ఆత్మజ్నానం అంతా ఇంతా కాదు.ఒక్కొక్క మేధావి దైవం తనకు అనుగ్రహించిన జ్నానాన్నిఇలా మాలాంటి వాళ్ళకు పంచాడు.అనువాదకులు సమాజంలో ఆణిముత్యాలు.వారంతా మన బోధగురువులు.
జమీల్ అహ్మద్ : నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నా ప్రశ్న ఎన్ని రకాలుగా అర్థమయ్యేలా చెప్పాయి అని కాదు. అన్ని అనువాదాలు ఒకే రకంగా చెప్పాయా?
నూర్ బాషా రహంతుల్లా: ఒకే రకం అంటే?
జమీల్ అహ్మద్ : ఒక అనువాదంలో చెప్పిన విషయాన్ని వేరొక అనువాదంలో అదేవిధంగా చెప్పారా
నూర్ బాషా రహంతుల్లా : అదేవిధంగా అంటే అవే మాటలతో అనా?
జమీల్ అహ్మద్ : ఒకే అర్ధం గల వేరు మాటలైనా పరువాలేదు
నూర్ బాషా రహంతుల్లా: ఒకే అర్ధం గల వేరు మాటలతోనే అనువాదాలు చేశారు.
జమీల్ అహ్మద్ : అంటే పది అనువాదాల అర్థంలో ఎటువంటి తేడా లేదంటరా?వారు అనువదించిన గ్రంధం అర్థానికి అరబ్బీలో ఉన్న గ్రంధంలో ఉన్న అర్థానికి ఏ మాత్రం తేడా లేదంటారా?
నూర్ బాషా రహంతుల్లా: పదాలలో తేడా తప్ప అర్ధంలో తేడా ఏమీలేదు.అర్ధంలో తేడా ఉంటే అనువాదకులకు అరబీ సరిగా రాదని అర్ధం.అర్ధం కూడా సరిగ్గా అనువాదం చెయ్యలేకపోతే అనువాదకుల్ని తప్పుపట్టే ఉభయభాషా ప్రవీణులు బోలెడుమంది ఉన్నారు.నిఘంటువుల్ని తిరగేసి అనువాదాల నిగ్గు తేలుస్తున్నారు.అపార్ధం కలిగే పదాలుంటే నిలదీస్తున్నారు.
జమీల్ అహ్మద్ : అన్ని అనువాదాలలో ఒకే అర్థం ఉంటే నిఘంటువుల్ని తిరిగేసి నిగ్గుతేల్చాస్సిన అవసరము ఉండదు. తేడా ఉంటేనే నిగ్గుతేల్చాల్సిన అవసరము ఉంటుంది. ఖురాన్ ను ఇంతవరకు 100 శాతం కరెక్ఠుగా అనువాదం చేసానని ఏ అనువాదకర్త చెప్పలేదు. ఏదో తమ వంతు ప్రయత్నం మాత్రమే చేసారు. ఉభయభాషా ప్రవీణులు కూడా అనువాదాలు 100 శాతం కరెక్టు అనే పరిస్థితి లేదు. ఉభయభాషలు తెలిసిన వారికే దానిలో తేడా అర్థమవుతుంది.అనువాదాలు అవసరమే అనువాదాలు మూలం వైపుకు వెళ్ళడానికి ఉపయోగ పడాలి.అనువాదమే అంతా అని అనుకోకూడదు అని నా అభిప్రాయం.
నూర్ బాషా రహంతుల్లా : అయితే అనువాదాలు వద్దనేగా మీ వాదన?అలాంటప్పుడు ఉభయభాషలు తెలిసినవారుమాత్రం ఏం చేద్దామని?తేడాలు తెలుసుకుంటూ ఉంటారా?మరో భాషతో పనేముంది?అంతా అరబీలో నడుపుకుపోవచ్చుగదా?
జమీల్ అహ్మద్ : అనువాదం వద్దు అని నేను ఒక్క వాదన చేయలేదు. నేను చేయని వాదనను నాకు అంటగట్టడం అర్ధరహితం. అనువాదం ఉంటే చాలు అన్ని అర్తమైపోతాయి మూల భాషతో మాకు పని లేదు. మా కోసం అనువాదం చేయడాని కొంతమందిని నియమించుకున్నాం వాళ్లే మాకు దిక్కు తప్పైనా ఒప్పైనా అనుకుంటే మీ ఇష్ఠం.
నూర్ బాషా రహంతుల్లా : మూలభాషే సర్వస్వం అయితే అనువాదం ఎందుకు?అనువాదంతో ఏం చేద్దామని?ధార్మిక విశ్వాసాలను మాకు మూలభాష వచ్చేదాకా అనువాదంకాపాడుతుంది అనుకోకపోతే అనువాదాలు ఇక ఎందుకు?మూల భాషరాని కోట్లాది మందికి అనువాదమే కదా అంతా.వారికి మూల భాష ఎప్పటికి వస్తుంది,స్వయంగాతేడాలు ఎప్పటికి గ్రహిస్తారు?మూల భాషను వచ్చినా రాకపోయినా చచ్చినట్లు అందరూ నేర్చుకోవాలి/చచ్చేదాకా నేర్చుకోవాలి అంటే జరిగే పనేనా?అనువాదకులు ఎవరూ ఎవరో నియమిస్తే అనువాదాలు చేయలేదు.ప్రజాహితం కోరి ఆ మహానుభావులు దైవగ్రంధాన్ని అనువదించారు.వారు బోధ గురువులు.బాధగురువులు మాత్రం మూలభాషరాని వారిని బాధపెడుతున్నారు.ఆ భాధ పడాలా వద్దా అనేది ఎవరిష్టం వారిది.నిర్బందించి ఎవరినీ మార్చలేము.
జమీల్ అహ్మద్ : నిర్భందించి ఎవ్వరినైనా మార్చాల్సిన అవసరం ఎవరికీ లేదు. మూల భాష నేర్చుకోవడము వలన ప్రయోజనము ఎక్కువ అనేవారు బాధగురువులుగా కనిపిస్తే చాలా సంతోషం. మూల భాష రాని వాళ్లు చచ్చినట్టు నేర్చుకోవాలి అని ఎవ్వరూ బలవంతము చేయడం లేదు. నేర్చుకుంటే ప్రయోజనం ఎక్కువ అని మాత్రమే చెపుతున్నాను. దానికి బాధ గురువులు బాధపెడుతున్నారని బాధపడనవసరము లేదు.
నూర్ బాషా రహంతుల్లా: ఆ ఎక్కువఃప్రయోజనం ఏమిటో చెప్పండి.అది నచ్చితే నేర్చుకుంటారుగా.మూలభాషను వ్యతిరేకిస్తే మాకు మాత్రం కలిగే ప్రయోజనం ఏముంది?మాకు అరబీ రాకనే ఈ అవస్థ.మాతృభాష ద్వారా అంతా అర్ధమౌతోంది కదా? మూలభాష నేర్చితే కొత్తగా కలిగే ప్రయోజనం ఏమిటి?భావం అర్ధంకావటమేనా లేక మూలభాషాపదాలు ఉచ్చరించితేనే అలౌకిక ఆనందం పుణ్యం...లాంటివి ఏమైనా కలుగుతాయా?లేక భావాన్ని గ్రహించటంతో నిమిత్తం లేకుండా మూల భాష ఉచ్చారణ ఏమైనా నిర్బంధం చేయబడిందా?
జమీల్ అహ్మద్ : భావం అర్ధం కావటమే ముఖ్యం అరబ్బీ నందు చాలా పదాలు ఎంత గొప్ప పండితులు అనువాదం చేసినా అవి వారినే తృప్తి పరచలేకపోయాయి. ఆ పండితులు ఉన్నంతలో వారు మంచి ప్రయత్నమే చేసారు. వారి ప్రయత్నంలోని నిజాయితీ ని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు. మూలభాష నేర్చుకొని మూల భాష పదాలు ఉచ్చరిస్తూ భావం అర్థం చేసుకునే వారు నిజాయితీగా చాలా ప్రయోజనం పొందుతారు
నూర్ బాషా రహంతుల్లా: సంతోషం.అరబీ భాష దాని నుడికారం రీత్యా ఎంతో సుసంపన్నమయిందే, అయినా అదీ మానవ భాషే. మనిషి మాట్లాడే భాషలు ఏవైనా సరే ఎన్నో పరిమితులతో కూడుకున్నవి. అవి ఖురాన్లోని సువిస్తారమైన విషయాలకు సమగ్రమయిన మకుటాలు కాగల పదాలు, సమాసాలు అందజేయలేవు.- (అల్ బకరా సూరా ప్రవేశికలో మౌలానా మౌదూదీ గారి వ్యాఖ్యానానికి మలిక్గారి అనువాదం.)భాషలకన్నా అవి అందజేసే భావాలే ముఖ్యమైనవి.భాషల గురించి లిపులగురించి ఎన్ని వివాదాలున్నా భావాలే మనసుల్ని ఏలగలవన్నది మాత్రం నిర్వివాదాంశం. (మలిక్ 29.7.83)
జమీల్ అహ్మద్ : అది మానవ భాష కాబట్టే నేర్చుకోవడానికి భయపడనవసరము లేదు. అది పరభాష నేనెందుకు నేర్చుకోవాలనుకునే వారిని బలవంతం చేయవలసిన అవసరం లేదు. వారు నేర్చుకోనంత మాత్రాన అరబ్బీకి వచ్చే ప్రమాదమేమి లేదు. భావం అనేది భాష నుండే వస్తుంది. భావం అర్ధం కావాలంటే భాష రావాలి
నూర్ బాషా రహంతుల్లా: అర్ధమయ్యేదే మాతృ భాష.మస్జిద్లో తెలుగు భాషలో ధార్మిక విషయములు మైకులో చెప్పటం ఏ మాత్రం తప్పు కాదు. చాలా మంది తెలియక ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారు. దైవ ప్రవక్తలు కూడా తమ జాతి ప్రజలు మాట్లాడే భాషల్లోనే వారిని సంబోధించారు. భాషతో ధర్మానికి సంబంధం లేదు. దివ్య ఖురాన్మూలగ్రంధం అరబీలో ఉండటం మూలాన మనం దానికి ప్రత్యేకతనిస్తాము. కానీ ప్రసంగాలు, బోధనలు, ఉపదేశాలు, హితబోధలు అన్నీ ఆయా ప్రజల భాషల్లోనే జరగాలి, జరుగుతున్నాయి కూడా.అంతే కాని ఏదో తెలియని భాషలో అన్యమనస్కంగా, పరిపరి విధాల పోయే హృదయాన్ని అదుపులో పెట్టుకోవడం చేతకాక ఉపన్యాసాలు చెయ్యడం, వినడం, ఎక్కడా జరగడం లేదు. సంకుచిత భాష, వర్గ, జాతి పరిధుల నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. (మలిక్ 11.10.85)
జమీల్ అహ్మద్ : మస్జిద్లో తెలుగు భాషలో ధార్మిక విషయములు మైకులో చెప్పటం ఏ మాత్రం తప్పు కాదు. తప్పు అని ఎవరు చప్పారు. దివ్య ఖురాన్మూలగ్రంధం అరబీలో ఉండటం మూలాన మనం దానికి ప్రత్యేకతనిస్తాము కాదు ప్రత్యేకత వచ్చింది. ఆ ప్రత్యేకత చివరివరకూ ఉంటుంది కూడా.
నూర్ బాషా రహంతుల్లా: ప్రసంగాలు, బోధనలు, ఉపదేశాలు, హితబోధలు అన్నీ ఆయా ప్రజల భాషల్లోనే జరిగినప్పుడు/జరగటం తప్పుకానప్పుడు ఆ ప్రత్యేకత వచ్చిన భాషతో ఇక పనేముంది?
జమీల్ అహ్మద్ : ఆయా ప్రజల భాషల్లో జరిగే తప్పులను సరిచేసేదే మూల భాష . ఆ ప్రత్యేక భాష అవసరం లేనపుడు అనువాదంలో మిగిలేవి పిట్ట కధలే
నూర్ బాషా రహంతుల్లా: ఇప్పటికీ తప్పుల సవరణ పూర్తికాలేదా?తప్పులేని అనువాదం ఒక్కటీ తయారుకాలేదా?అనువాదకులందరూ పిట్టకదలతోనే సరిపెట్టుకున్నారా?అర్థం కాని భాషలో, శబ్దాలు కూడా సరిగ్గా వినరాకుండా కునికిపాట్ల మధ్య వినే ఖురాన్ ఏ విధంగానూ ఫలప్రదం కాదు (మలిక్ 19.7.85)
కవి యాఖూబ్ : ఆరాధానానందం పరమావధి.అది కలగని స్థితి వుంటే, ఇన్ని విషయాలూ వ్యర్ధమే.!
నూర్ బాషా రహంతుల్లా: ఆరాధనానందం భలేపదం వాడారు కవి యాకూబ్ గారూ.అది సొంత భాషలోనేగా కలిగేది?
రామ్ ప్రసాద్ కేసిరాజు : చాలా మంచి అలోచన.తప్పని సరిగా అచరించాలి.
సయ్యద్ అబ్దుస్సలాం : అరబీ దేవ భాష లేదా ప్రళయ దినాన అల్లాః అరబీలో మాట్లాడుతాడు అన్న విషయాన్ని ధర్మపండితులలో అగ్రగణ్యులు తోసి పుచ్చారు, అటువంటి కథనాలను బలహీమైనవిగా పేర్కొన్నారు. ఇక ఖురాన్ లౌహి - ఎ - మహాఫూజ్ లో అరబీలో లేదు అన్న మాట గాలి ఖబురులా చెప్పేస్తే సరిపోతుందా...దేనికైనా ఆధారం కావాలి...ఖురాన్లోని ఒక్కో అధ్యాయ అవతారానికి ఒక్కో నేపధ్యం ఉంది, వాటన్నింటిని తెలుసుకోకుండానే ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు చెప్పడం ఎంత వరకు సబబు..? కురాన్ని విమర్శించిన వారిలో ఈనొక్కడే ప్రధముడు కాదు....అలాంటి వారు కోకొల్లలు వచ్చారు...ఐతే ఖురాన్ వారితో చేసిన చాలెంజ్ - ఇందులోని ఆయాతు వంటి ఒకే ఒక్క ఆయతుని లిఖించుకు తీసుకు రమ్మని...అది ఇప్పటి వరకు ఏ మానవ మాత్రునికి సాధ్యం కాలేదు...కారణం అది అల్లాః వచనం అవ్వడమే, ఇక అనువాదం అంటారా ఎవరికీ ఏ భాష మీద బాగా పట్టుంటుందో వారు అంతగానే బాగా అనువాదం చేయగలరు...ఇది మీరు కూడా గమనించగలరు... ఇక అనువాద మర్యాదల విషయానికొస్తే ఏ గ్రంథాన్ని అనువదిన్చాలన్నా అనువాదకర్తకు ఏక సమయంలో రెండు భాషల సాహిత్యం మీద సమాన స్థాయి ప్రావిణ్యం ఉండాలి...అలా ఉన్నప్పటికీ అనువాదకర్త తన మనో భావాలని అందులో ఏమైనా జోప్పించాడా? లేదా అని తెలుసుకోవడానికి మూలం ఎంతైనా అవసరం...కనుక అల్లాః మేమే ఈ గ్రంథాన్ని అవతరింప జేశాము. మేమే దీన్ని రక్షిస్తాముః అని చెప్పింది మూలం విషయంలో అన్నది గమనార్హం..ఇక వితండవాదానికి దిగే వారంటారా వేయి కారణాలు చెప్పిన వినరు...మరిన్ని వివరాలు మీతో పంచోకోవాలని ఉంది, సర్, నూర్ బాష రహమతుల్లా గారు ప్లీజ్ మీ ఈ మెయిల్ ఐడి ఇవ్వగలరు....
నూర్ బాషా రహంతుల్లా: సంతోషం.ఉమ్ముల్ కితాబ్(లౌహే మహ్ఫూజ్ ) అనే మాతృ గ్రంధం అరబీ భాషలోనే ఉంటే దానిలో నుండి ఖురాన్ ను తీసి అరబ్బుప్రజలకు అర్ధం కావటానికి సరళమైన అరబీ భాషలోకి అనువదించి పంపించాల్సిన అవసరం ఏమిటి? ( ఖురాన్ 43:3,4 ,44:58) అనే ముస్తాక్ గారి గాలి ప్రశ్నకు జవాబు చెప్పండీ.అరబీ భాష మూల భాష కాబట్టి దాని ఔన్నత్యాన్ని అందరూ అంగీకరిస్తారు.కానీ అనువాద భాషలను ఎందుకూ పనికిరాని భాషలు అంటూ కొందరు వితండవాదం చెయ్యటం న్యాయమేనా?మీ మెయిల్ ఐ.డి.ఇస్తే “ తెలుగు దేవ భాషేఃపుస్తకం” పంపిస్తాను.నా ఐ.డి. nrahamthulla@yahoo.com.జవాబులు మాత్రం ఇక్కడే ఇవ్వండి.ఎందుకంటే మీ అందరి అభిప్రాయాలను నేను రాబోయే వ్యాసాలలో వాడుకుంటాను.
సాయికిరణ్ గౌడ్ : Awesome brief sir , double like
సయ్యద్ అబ్దుస్సలాం : సర్, ముష్తాక్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, మిడి మిడి జ్ఞానం గల వ్యక్తులు చెప్పేది హేతుబద్ధాంగానూ ఉండదు.కనీసం ప్రామాణికమైనదిగా కూడా ఉండదు. లౌహ్ - ఎ- మహ్ఫూజ్ అన్నది ఒక అగోచర విషయం...అందులో కేవలం ఖురాను గ్రంథమే కాదు సృష్టిరాసులన్నింటి విదిరాతలు సృష్టిలో జరిగింది, జరగనున్నది ప్రతి విషయం నమోదయి ఉన్నదన్న విషయం మహనీయ ముహమ్మద్ (స) వారి పలు ప్రవచనాల ద్వారా తెలుస్తుంది..అలాగే లౌహే మహ్ఫూజ్లోని సమాచారమంతా ఏ భాషలో ఉంది అన్న విషయమూ అగోచారమినదే...లౌహే మహ్ఫూజ్లో ఖురాన్ ఏ భాషలో ఉందన్న మాటే నేను ఎత్తలేదు.. ఇక సులభమైన భాష అని ఖురానులో ఎక్కడా లేదు. స్పష్టమైన అరబీ భాషలో అని ఉంది, ఈ గ్రంథాన్ని గుణపాఠం గ్రహించేందుకు సులభతరం చేసాముః అని ఉంది. ఇక అనువాదం చేయబడి, ఇంకేదో చేయబడి అన్న మాటే రాదు. ఇక భాష అన్నది అది ఏదైనా దేవుని వరప్రాసడమే...వ మిన్ ఆయాతిహి ఇఖ్తిలాఫీ అల్సినతికుం వ అల్వానికుం (రూం అధ్యాయం ౨౨ వ వచనం) భూమ్యాకాశాల సృష్టి, మీ భాషల్లో, రంగుల్లో గల వైవిధ్యం కూడా ఆయన (శక్తి) సూచనల్లోనివేఁ. పొతే తెలుగు ప్రసంగాలు జరగాలి, తెలుగు భాష మూడు పూలు ముప్పై కాయల్లా వర్థిల్లాలని కోరుకోవడమే కాక ఆ నిమిత్తం మా ప్రయత్నం మేము చేస్తున్నాము కూడా...అందులో భాగమే (విదేశాల్లో) కువైట్లో మొదటి సారి తెలుగు భాషలో జుమ ప్రసంగం మినిస్ట్రీ తరపు నుంచి జరుగుతుంది. ఉర్దూ మాట్లాడే కొందరిలో భాషా దురభిమానం ఉందన్న చేదు అనుభవం ఇక్కడ సైతం చవి చూసాము.. భాష దేవుని వరం అని అన్య రచయితల వ్యాస, పుస్తక సహకారంతో వ్రాసిన ఓ చిరు వ్యాసాన్ని మీ వాల్ మీద పోస్ట్ చేస్తున్నాను..చదవగలరు... నా ఈ మెయిల్ ఐడి - abdussalamsyed@ymail.com
నూర్ బాషా రహంతుల్లా: భాష దేవుని వరం.భాషా వైవిద్యం ఆయన శక్తి సూచన అంటూ ఇప్పటి దాకా ఉర్దూ అరబీ భాషల్లో ఉన్న దైవ సందేశాలను అనువాదం చేసి తెలుగులో కూడా జుమాప్రసంగాలను చేస్తున్నందుకు మీరంతా అభినందనీయులు.తాడేపల్లి మండలం నులకపేట మసీదు ఇమామ్ జలీల్ గారు (ఫోన్.9948151159) అనేక సంవత్సరాలనుండి క్రమంతప్పకుండా ఒక వారం ఉర్దూలో ఒకవారం తెలుగులో ప్రసంగిస్తున్నారు.ఉర్దూ ముస్లిములు,తెలుగు ముస్లిములు తన్నుకొని పోలీసు కేసులదాకా వెళ్ళిన భాషల గొడవను ఆయన అలా తీర్చారు.లౌహే మహ్ఫూజ్ ఏ భాషలో ఉందో మనకు తెలియదు.ఇన్నాళ్ళూ ఇస్లాం సందేశాలు తెలియలేదు కాబట్టి ఏమి అడగాలో తెలియలేదు.మీలాంటి వారంతా కొన్నిఏళ్ళుగా వాటిని తెలియజెప్పుతున్నారు కాబట్టి విషయాలు తెలిసేకొద్దీ తెలుగు జనం నోరు తెరిచి ప్రశ్నలు అడుగుతున్నారు.అడిగే వాళ్ళను గాలి ప్రశ్నలు వేసేవాళ్ళూ, మిడి మిడి జ్ఞానం గల వ్యక్తులు,హేతుబద్దత లేనివాళ్ళూ ,వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు అనకుండా ఓపికగా చెబుతూనే ఉండండి.మీరు మాట్లాడేవి సొంత మాటలు కాదు , దైవవాక్యం మీద బేస్ అయ్యి రిఫరెన్సులతో సహా మాట్లాడుతారు గనుక వాదనలో తప్పు ఉంటే తెలిసిపోతుంది.తప్పు మార్గంలో పోతున్నామని తెలిసిన వ్యక్తి ఎప్పటికైనా తప్పు దిద్దుకుంటాడు.మీకు నా పుస్తకాలు మెయిల్ చేశాను.
సయ్యద్ అబ్దుస్సలాం : ధన్యవాదాలు సర్
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం : బాగా వ్రాశారు. తెలుగువారు ఏ మతస్థులైనా తెలుగులోనే ప్రార్థనలూ, పూజలూ చేయాలి. తెలుగు హిందువులు కూడా తెలుగులోనే సమస్త మత కార్యక్రమాల్నీ నడిపించుకునే రోజు రావాలి. నేను కూడా ఇందుకోసం కృషి చేస్తున్నాను. త్వరలో ఈ గడ్డ మీద తెలుగు హిందూమతం ప్రతిష్ఠాపితమవుతుంది.
నూర్ బాషా రహంతుల్లా: A Muslim believes that faith is not complete when it is followed blindly or accepted unquestioningly. Man must build his faith on well-grounded convictions beyond any reasonable doubt and above uncertainty. Islam insures freedom to believe and forbids compulsion in religion.
బాషా కడప: నిస్సందేహంగా సకల భాషలూ దైవానివే. ఖురాన్ ను అరబీలో భాషలోనూ, అంతకుముందు గ్రంథాల్ని ఇతర భాషల్లోనూ అవతరింపజేశాడు. ఇక్కడ గొప్ప భాష, హీన భాష అనే తేడాలేమీ లేవు. కానీ ముస్లిములు నమాజ్ లో చదివే సూరాల్ని తెలుగులోనో, మరో భాషలోనో అనువదించి చదవడానికి అనుమతి లేదు. ఎందుకంటే ఇందులోనే విశ్వమానవ సారూప్యత కనబడుతుంది. ఉదాహరణకు మీరు చైనాకు వెళ్ళారనుకోండి. అక్కడ ఒక మస్జిద్లో నమాజ్ సూరాల్ని చైనీస్ భాషలో పఠిస్తుంటే ఒక్క ముక్క అర్థమవుతుందా? అలాగే ఒక ఇతర దేశస్థుడు మన రాష్ట్రానికి వచ్చాడనుకోండి. మనం పూర్తి తెలుగులో నమాజ్ ప్రారంభిస్తూ "అల్లాహుఅక్బర్ " అనికాకుండా "దేవుడే గొప్పవాడు" అని ప్రారంభిస్తే ఎలా వుంటుంది? పాపం అతను దిక్కుతెలీక చస్తాడు. కాబట్టి ఒక ముస్లిం అనేవాడు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా అజాన్ చెప్పడంలోగానీ, నమాజ్ సూరాల్లోగానీ తేడావుండదు. ఇక మస్జిదుల్లో ప్రసంగాలు, దువాలు స్థానిక భాషల్లో చేసుకోవడానికి లక్షణంగా అనుమతి వుంది. ఎవరన్నా వితండవాదంతో "లేదు లేదు నమాజ్ సూరాలు కూడా తెలుగులో అనువదించి చదవాలి" అని పట్టుపడితే అతనికంటే మూర్ఖుడు ఎవడూ వుండడు. ఇక గుళ్ళలో సంస్కృత శ్లోకాలు కూడా తెలుగులో అనువదించి పఠించాల్సి వుంటుంది. అంతెందుకు... మన జాతీయగీతం హిందీలో వుండాల్సింది బెంగాలీలో ఎందుకు వుంది? ఆ భాష దేశంలో ఎంతమందికి వచ్చో చెప్పండి. ముందుగా మార్పు జరిగితే జాతీయగీతాన్ని తెలుగులో మార్చాలి. ఇకపై జనగణమన అని మొదలుపెట్టకూడదు.
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం :అది మన జాతీయగీతం అని ఎవఱన్నారండీ ? నా బొంద, అది మనది కాదు. అది ఇండియాది. మన జాతీయగీతం "మా తెలుగుతల్లికి మల్లెపూదండ..." మాత్రమే. మన ఆంధ్రా ప్రస్తుతం ఇండియా కింద సామంతదేశం. ఆఫ్టరాల్ సామంతదేశానికి మహాసామ్రాజ్యాన్ని మార్చేటంత సీనుండదు. ఇహపోతే హిందూ గుళ్ళల్లో తెలుగుని ప్రవేశపెట్తే ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. కొంతకాలానికి హిందూగుళ్ళన్నింటినీ తప్పకుండా తెలుగులో నింపేస్తాం.
నూర్ బాషా రహంతుల్లా: ఆరాధన శబ్ధాడంబరము,పుణ్యమంత్రాలు వల్లెవేయటం కోసమే అయితే అనువాదం అవసరమే లేదు.మాత్రుభాషలో దైవారాధన చేస్తే ఏదోలా ఫీలయ్యేవాళ్ళూ,కన్ ఫ్యూజ్ అయ్యేవాళ్ళూ మూల భాషలోనే నమాజులు చేయటం మంచిది.ఎందుకంటే ఎవరికి ఏ భాష మీద అవగాహన,మక్కువ ఉంటే ఆ భాషలోనే ఆరాధనానందం కలుగుతుంది.ఒక్క భాష మాత్రమే వచ్చినవాడికంటే పది భాషలు వచ్చినవాడు బలవంతుడే.అయితే ఆ బలాన్ని భాషలు రానివారి మీద బలవంతంగా రుద్దితే తట్టుకోలేక,అర్ధం కాక నాస్తికులైపోవచ్చు.ఇప్పుడు ఉన్నది మూలభాషలోని ఒరిజినాలిటీ,అందం,రిథం మాత్రమే కావాలనుకునే శబ్దార్చకులే.భావార్చకులు ఒకే ఆలయంలో పది భాషల్లో హోరెత్తించాలని చూడరు.చూశారంటే గోల చేసి మాత్రు భాషలలో దైవారాధన వృధా,అసాధ్యం అని చెప్పటానికే.మనసున్న ప్రతి వ్యక్తికీ దేవునికి తన ప్రార్ధన మర్యాదపూర్వకంగా అల్లరిలేకుండా భయభక్తులతో ఎలా చేసుకోవాలో తెలుసు.భక్తి అంటే అర్ధంకాని మంత్రాల గోల కాదు.హృదయంలోనుంచి పెల్లుబికే ఆరాధన."ధర్మస్వీకరణలో ఎలాంటి బలవంతం బలాత్కారం లేవు.అల్లాను నమ్మిన వాడు ఎన్నటికీ ఏమాత్రం చెక్కుచెదరని ధృఢమైన ఆశ్రయం పొందినట్లే"(బఖరా 2:256).అందరికీ వచ్చే ఏకైక భాష అందరికీ అర్ధమయ్యే ఒకే ఒక్క భాష అందరికీ వచ్చి తీరాల్సిన భాష అంటూ దేవుడు ఏభాషనూ తయారు చెయ్యలేదు.ప్రతి ప్రవక్తకూడా తన మాతృభాషలోనే మత ప్రచారం చేసేవారు. అసలు దైవసందేశం కూడా ప్రవక్తల యొక్క మాతృభాషలోనే వచ్చేది. ఎందుకని? ప్రవక్తకు ముందు అర్ధం కావాలి. ఆ తరువాత ఏ ప్రజలకైతే చెప్పబోతున్నాడో ఆ ప్రజలకు అర్ధం కావాలి.
సొంత భాషలోకి చేసిన తర్జుమానే అర్ధం కానప్పుడు మూలభాషలోది అసలే అర్ధంకాదు.వక్రీకరణలు చెయ్యాలనుకునే వక్రబుద్దులు మూలభాషీయుల్లో కూడా ఉంటారు.దేవుని దృష్టిలో భాషకంటే భావమే ముఖ్యమైనది.అర్ధం కాని మంత్రపఠనం కంటే హృదయం లోనుంచి వెలువడే కన్నీటి ప్రార్ధనే విలువైనది.లయబద్దమైన వేదమంత్రాల శబ్ధానికే ఉప్పొంగటం,ఆపదాలు విని పలకటం వల్ల కలిగే పుణ్యం కంటే వాటి అర్ధం మన భాషలో విని అర్ధం చేసుకొని మన భాషలోనే తిరిగి మనసుతో చెప్పటం వల్ల కలిగే ఫలితం ఎక్కువ.వక్రీకరణ,పెడర్ధం లేకుండా చేసిన సరయిన తర్జుమాలూ ఉన్నాయి.వాటి వల్లనే మాకు ఇలా ప్రశ్నించగలిగే జ్నానం వచ్చింది.మూల భాష నేరిస్తేనే భక్తుడికి ప్రార్ధనార్హత కలుగుతుంది అని శాసిస్తే వెనుదిరిగిపోతారు.అలాంటి నిర్బంధమూ లేదు.హృదయ భాష మాతృ భాషే.ఎన్ని భాషలైనా అదనంగా నేర్చుకుంటే తప్పు లేదు.ప్రయోజనం కూడా ఉంది.కానీ అది ఒకడి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది.దానికి పరిమితీ లేదు.నిర్బంధంగా నేర్పజూస్తేనే సమశ్య."మేము పంపిన ప్రతి ప్రవక్తా విడమరచి చెప్పటానికి వీలుగా తన జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే మా సందేశం ప్రజలకు అందజేశాడు"(ఇబ్రాహీం14:4). నిర్బంధానికి గురై ప్రశ్నించకుండా ముస్లిం దేనినీ గుడ్డిగా నమ్మకూడదు.ముస్లిం తనకున్న సందేహాలన్నీ తీర్చుకొని,ఏ మాత్రం అనుమానాలు లేనివిధంగా పటిష్టమైన విశ్వాసాన్ని స్వచ్చందంగా పొందాలి.మా మతాన్ని నమ్మి తీరాలి అనే నిర్బంధం ఇస్లాం ఎవరిమీదా విధించదు.సోదరులారా అలాగే తెలుగు ముస్లిములమీద అరబీ నిర్బందం కూడా వద్దు అనుకోండి.
తాడేపల్లి గారూ "హిందూ గుళ్ళల్లో తెలుగుని ప్రవేశపెట్తే ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. కొంతకాలానికి హిందూగుళ్ళన్నింటినీ తప్పకుండా తెలుగులో నింపేస్తాం" అని మీరు అంటుంటే సరే ఎవరి భాషలో వారు పూజలు చేసుకోండి దైవాన్ని కొలుచుకోండి అనకుండా మిమ్మల్ని మూర్ఖుడు అన్న మూర్ఖులు ఎక్కడన్నా తగిలారా ?విశ్వవ్యాప్తంగా ఒకరికొకరు అర్ధం కావాలంటే,ఐక్యత రావాలంటే దేవభాష సంస్కృతంలోనే మంత్రాలు చదవాలి, మాతృభాష ప్రసంగాలకు పనికొస్తుంది కానీ పూజల్లో చెల్లదు అని మూర్ఖంగా వితండ వాదం చేస్తూ మీపై ఎవరన్నా సంస్కృతపట్టు పట్టారా ?నీదీ ఒక భాషేనా?నీది దేవుడు అంగీకరించని భాష,పూజకు పనికిరాని పనికిమాలిన భాష అని ఎగతాలి చేసిన అహంకారులు,అపహాసకులు మీకు తారసపడ్డారా?
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం :మాటే మంత్రమూ
మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే
మంగళదాయకం
ఇది కల్యాణం, కమనీయం...
అని సినిమా కవి ఊరికే అనలేదు. దేవుడు మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఏ భాష ? అని చూడడు. నేనీ మధ్య పచ్చివ్యావహారిక తెలుగులో హృదయపూర్వకమైన ఒక సుదీర్ఘప్రార్థన వ్రాసి దేవుడి ముందు పెట్టాను. ఆయన దాన్ని స్వీకరించానని, అంగీకరించాననీ నాకు తెలియజేశారు. అప్పట్నుంచీ ఆనందంలో మునకలు వేస్తున్నాను. అనుభవజ్ఞానం కంటే వాదన గొప్పది కాదు గదా !
"...అయితే ఆ బలాన్ని భాషలు రానివారి మీద బలవంతంగా రుద్దితే తట్టుకోలేక,అర్ధం కాక నాస్తికులైపోవచ్చు..."
హిందువులలో కొందఱికి ఇలాగే జఱిగింది. జఱుగుతోంది.
"...ప్రతి ప్రవక్తకూడా తన మాతృభాషలోనే మత ప్రచారం చేసేవారు...."
ఈ అంశాన్ని కన్వీనియంటుగా మర్చిపోతారు అందఱూను !
"...వక్రీకరణలు చెయ్యాలనుకునే వక్రబుద్దులు మూలభాషీయుల్లో కూడా ఉంటారు...."
అందుకే గదా హిందూగ్రంథాల మీద సంస్కృత పండితుల వక్రీకరణలూ, వాదాలూ ఎక్కువై ఏకంగా ఒక డజన్ ఉపమతాలు పుట్టుకొచ్చేశాయి ద్వైతం, అద్వైతం., విశిష్టాద్వైతం అంటూ ! ప్రాచీన హిందూ ఋషులు ఈ ఉపమతాల్ని ఊహించలేదు, స్థాపించలేదు. సంస్కృతంలో ఉన్న ప్రతిపదానికీ ఫది అర్థాలు చెప్పుకుని జనం కొట్టుకు చచ్చి ఉపమతాలుగా, శాఖలుగా విడిపోయారు. అరబ్బీని మాత్రమే నమ్ముకుంటే ఇస్లాముకూ ఇదే గతి కొద్ది శతాబ్దాల్లో !ఆంధ్రాలోని హిందూమతాన్ని తెలుగు హిందూమతంగా మార్చాలని నేను ప్రతిపాదించినప్పుడు నాకు పెద్దగా వ్యతిరేకత ఎదురుకాలేదు. జనం విరోధించలేదు. కానీ "అది ఎలా సాధ్యం ?" అని మాత్రం అడిగారు. కారణం - మంత్రసాహిత్యమంతా ఇప్పటికీ సంస్కృతంలోనే ఉంది. దాన్ని తెలుగ
ులో వ్రాయాలని పూనుకున్నవాళ్ళెవఱూ లేరు. "లేనిదాన్ని ఎవఱు సృష్టిస్తారు ? ఎలా సృష్టిస్తారు ?" అని వారి సందేహం.
హిందూమతంలో తెలుక్కి అనుకూల వాతావరణం ఇప్పటికే కొంత ఉంది. మన కంటే ముందే పుట్టిన ప్రసిద్ధకవులు తెలుగులో వ్రాసిన ఉద్గ్రంథాలు గుళ్ళల్లో పవిత్ర పారాయణగ్రంథాలుగా పఠించబడుతున్నాయి. పూజించబడుతున్నాయి. బోధించబడుతున్నాయి. నన్నయ మహాభారతం, పోతన భాగవతం, ఎమ్మెస్ రామారావు రామాయణం మొదలైనవి. వీటితో పాటు గుళ్ళల్లో రామదాసు, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమాచార్య, సారంగపాణిలాంటి వాగ్గేయకారుల పాటలు రెగ్యులర్ గా పాడబడుతున్నాయి. సిద్ధేంద్రయోగి కూర్చిన కూచిపూడి నాట్యాన్ని తెలుగు పాటలతోనే అభినయిస్తున్నారు దేవాలయాల్లో ! అయితే పూజ, హోమం, పుణ్యాహవాచనం, ధర్మశాస్త్రం లాంటివాటిల్లో సంస్కృతమే ఉంది. అవి కూడా తెలుగులో ఉండాలని, జఱగాలనీ నేను కృషి చేస్తున్నాను.
బాషా కడప గారూ ! మీ కాన్సెప్టు తప్పు. మనం చైనావాడి కోసమో, మలేషియావాడి కోసమో బ్రతుకుతామా ? లేక దేవుడి కోసం బ్రతుకుతామా ? విదేశీయుడు ఇక్కడికొస్తే వాడి ఖురాన్ వాణ్ణి తెచ్చుకోమనండి. మనం అక్కడికి పోతే మన ఖురాన్ మనం పట్టుకుపోదాం. ఏమిటి ఇందులో కష్ట
ం ? ఇస్లామ్ 200 దేశాల్లో ఉంది. వాళ్ళందఱి కోసం మన తెలుగు ముస్లిములు అర్థం కాని పుస్తకాల్ని తరాల తరబడి నోరు మూసుకొని మొయ్యాలా ? ఏమి ధర్మం ? వ్యక్తిగతంగా మీ Ultimate loyalty ఎవఱికి ? ఖచ్చితంగా చెప్పండి. అల్లాహ్ కా ? లేక విదేశీయులకా ? మీ మతాచరణ మీ హృదయాన్నీ, అల్లాహ్ నీ సంతోషపెట్టడానికా ? లేక అరబ్బీ వ్యామోహపరుల్ని సంతృప్తిపఱచడానికా ? వాళ్ళ దృష్టిలో ఆహా ఓహో అనిపించుకోవడానికా ? మీ ఐడెంటిటీ - మీరు ప్రవక్తకూ, దేవుడికీ విధేయుడైన ముస్లిమ్ కావడంలో ఉందా ? లేక అరబ్బీవ్యామోహంలో ఉందా ? మీరు నిజంగా విధేయుడైతే అరబ్బీ ప్రాధాన్యం దాని ముందు ఏపాటిది ? మీకు మీరే ప్రశ్నించుకొని ఖరాఖండిగా తేల్చుకోండి. మతధర్మంలో ఏమిటీ ట్రాన్స్‌పోర్టేషన్ సిద్ధాంతాలు ? అందఱమూ వేఱే దేశాలకి పోవడం కోసం చెప్పుల్లో కాళ్లు పెట్టుకు కూర్చున్నామా ?
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం నూర్ బాష రహమతుల్లా గారూ ! మనం ఎవఱినీ సమూలంగా మార్చలేం గానీ నా ఉద్దేశంలో - ఉన్న మసీదుల పెద్దలతోనూ, కఱుడుగట్టిన భక్తులతోనూ వాదించడం కంటే మీరే పూనుకొని ఒక కొత్త మసీదు కట్టడం మంచిది. వీలైతే స్థానికంగా పదీ - ఇఱవై మసీదులు. ఇలా ఒక కొత్తశాఖకి నాంది పలకడమే ఉత్తమం. వాటి పాపులారిటీని బట్టి పాత మసీదులవారు కూడా భవిష్యత్తులో మారే అవకాశం ఉంది. కేవలం ప్రతిపాదనలు చేస్తే ఈ జాతి వినదు. చేసి చూపించడమే. నేరుగా పనిలోకి దిగిపోవడమే. మీ సిద్ధాంతాన్ని విశ్వసించే మిత్రులనే అక్కడ ఇమాములుగా నియమించండి.
Basha Kadapa తాడేపల్లిగారూ.. ఖురాన్ ను గానీ, సంస్కృతంలో వున్న వేదాల్నిగానీ, లేక ఇతర మూల గ్రంథాల్ని గానీ నూటికి నూరు శాతం అనువాదం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కేవలం మన సంతృప్తి కోసం మనం అనువాదాలు చేసుకుంటున్నాం. హిందువులు సంస్కృతాన్ని వదిలివేయడం వల్ల మూల గ్రంథాలైన వేదాల్లోని సందేశాన్ని పొందలేకపోయారు. ఒక్కక్కరూ ఒక్కొక రకంగా అనువాదం చేసుకుని అనేక సందేహాలకు గురి అయ్యారు. చివరికి గ్రంథంలోని వాస్తవ అర్థాలే మారిపోతాయి. అలాగే బైబిల్ విషయంలో కూడా.. ఈరోజు ప్రొటేస్టంట్లు, కాథలిక్కుల బైబిల్ గ్రంథాల్లో చాలా వ్యత్యాసాలున్నాయి. ఇవన్నీ అనువాదంలో మానవులు చేసిన తప్పిదాలే. మనం మూల గ్రంథం ఏ భాషలో అవతరింపజేయబడిందో ఆ భాషను గనక త్యజిస్తే రేపు మన వాదనను ఎలా నిరూపించగలం? అనువాద గ్రంథాలు ఎప్పటికీ నిదర్శనంగా నిలబడలేవు. అయినా నాకొకటి అర్థం కాదు. తెలుగుపై భాషాభిమానం వుండటం మంచిదేగానీ.. దానికోసం ఇతర భాషల్ని వదిలేయాలా? అలాంటపుడు మన పిల్లలకి ఇంగ్లీషు, హిందీ భాషలు స్కూళ్ళలో నుంచి తొలగించాలనుకుంటా?
Basha Kadapa నూర్ బాషా రహంతుల్లా గారూ.. మీరు ముస్తాక్ అహమద్, కాకినాడ గారు చెప్పిన మాటల్ని సరిగా అర్థం చేసుకోలేదనుకుంటా? ఖురాన్ ను వివిధ భాషల్లోకి అనువదించి ప్రజలందరికీ తెలియజేయమని ఆయన చెప్పారేగానీ, నమాజ్ లో కూడా తెలుగు సూరాల్ని పఠించమని చెప్పలేదు. ఒకసారి ఆయనతో వివరంగా మాట్లాడండి. నాకు ఆయన మిత్రుడే. ఆయన అలా ఎప్పటికీ చెప్పరు.
నూర్ బాషా రహంతుల్లా కడప భాషా గారూ,ముస్తాక్ అన్న మాటలుః "అరబీ భాష ఎంత గొప్పదైనా ఆ భాషరాని ప్రజల ముందు ఆ భాషలో మాట్లాడితే చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే కదా?అలాగే మనమూ ఖురాన్ ను ఆయా భాషలలోకి మార్చి ప్రజలకు వినిపించాలి.శ్రోతల భాష కు ప్రాధాన్యత ఇవ్వాలి.ఇది విశ్వాసులకు విధి (వాజిబ్).అరబీ భాషా భజన ఆపాలి.సందేశకులు శ్రోతల మీద తమ భాషను రుద్దకుండా ప్రజల భాషను నేర్చుకొని వారి భాషలోనే సందేశమివ్వాలి.అదే అల్లా మరియు ప్రవక్త సంప్రదాయం.అర్ధంకాని భాషలో భావం తెలుపుదామనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది( ఖురాన్41:44).ఖురాను గ్రంధాన్ని సుమారు వెయ్యి సంవత్సరాల వరకూ అనువాదం చెయ్యకుండా అరబీ రాని ప్రజలను నరకం లోకి నెట్టారు.దైర్యం చేసి ఫారశీక భాషలోకి చక్కగా భావానువాదం చేసిన మౌదూదీ ని కూడా కాఫిర్ అన్నారు".మాతృ భాషల్లోకి గ్రంధానువాదం ,సందేశాల ప్రచారం మార్పిడి జరగాలి అన్నందుకే అతన్ని మూర్ఖుడు, గాలి ప్రశ్నలు వేసేవాడు, మిడి మిడి జ్ఞానం గల వ్యక్తి,,హేతుబద్దత లేనివాడు,అతనితో మాట్లాడదలుచుకోలేదు లాంటి విమర్శలు కొందరు చేశారు.ఇక నమాజు కూడా తెలుగులో చెయ్యాలి అని అంటే హింసకు దిగి ఉండే వారేమో.మాతృభాషల్లో అల్లాను ప్రార్ధించుకోవాలనుకునే వాళ్ళమీద దాడులు చేస్తారేమో అనే భయంతోటే ఆ ప్రయత్నాలు జరగటంలేదు.ఎందుకంటే మౌదూదీ నే కాఫిర్ అన్నవాళ్ళకు ముస్తాక్ ఒక లెక్కా?అందుకే నామటుకు నేను అల్లానే ప్రార్ధిస్తున్నాను.అదీ తెలుగులోనే హాయిగా ప్రార్ధిస్తున్నాను.అంతరంగాల లోని ఆర్తనాదాలను ఎరిగిన అల్లా అతి ప్రియమైన రక్షకుడు,అడిగిన వరాలిచ్చే దయామయుడు అని పదే పదే రుజువవుతోంది.
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం "...దానికోసం ఇతర భాషల్ని వదిలేయాలా? అలాంటపుడు మన పిల్లలకి ఇంగ్లీషు, హిందీ భాషలు స్కూళ్ళలో నుంచి తొలగించాలనుకుంటా?..."
తప్పనిసరిగా తొలగించాలి. వదిలేయాలి. తెలుగ్గడ్డ మీద ఇతర భాషలు కలుపుమొక్కల్లా పిచ్చిపిచ్చిగా పెఱిగిపోయి అసలుమొక్కని ఎదగనివ్వడం లేదు.
Jameel Ahmed
తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం గారు మీరు ఎవఱినీ సమూలంగా మార్చలేరు గానీ నా ఉద్దేశంలో - ఉన్న స్కూలు యాజమాన్యలతో, కఱుడుగట్టిన టీచర్ల తోనూ వాదించడం కంటే మీరే పూనుకొని ఒక కొత్త స్కూలు కట్టడం మంచిది. వీలైతే స్థానికంగా పదీ - ఇఱవై స్కూల్లు. ఇలా ఒక కొత్తశాఖకి నాంది పలకడమే ఉత్తమం. వాటి పాపులారిటీని బట్టి పాత స్కూల్ల వారు కూడా భవిష్యత్తులో మారే అవకాశం ఉంది. కేవలం ప్రతిపాదనలు చేస్తే ఈ జాతి వినదు. చేసి చూపించడమే. నేరుగా పనిలోకి దిగిపోవడమే. మీ సిద్ధాంతాన్ని విశ్వసించే మిత్రులనే అక్కడ టీచర్లుగా నియమించండి.
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం తప్పకుండా జమీల్ గారూ ! మీరు ఎగతాళిగా అంటున్నప్పటికీ అది నిజం చేసి చూపిస్తాను. అందుకు సవివరమైన ప్లాన్ నా దగ్గఱ ఉంది. అది బహుక్రూరమైనది. ఏ విధమైన మొహమాటమూ, దయాదాక్షిణ్యమూ లేనిదీ !
Jameel Ahmed
నాది ఎగతాళి కాదు తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం గారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకరి మీద ఒకరు తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దడం కన్నా మీరు చెప్పిన మార్గంలో ప్రయత్నించడం మేలని చెప్పాను
నూర్ బాషా రహంతుల్లా శబాష్ తాడేపల్లి గారూ,అది బహు కఠినం అనబోయి కౄరం అని ఉంటారు.మీ ప్లాన్ సక్సెస్ అవ్వాలని ఒక తెలుగు బిడ్డగా కోరుకుంటున్నాను.బలవంతంగా రుద్దడం వద్దన్న జమీల్ భాయ్ కి కూడా శుభాకాంక్షలు.
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం కాదు క్రూరమైనదే. నేను సాభిప్రాయంగానే వాడాను ఆ పదం. ఇప్పుడు తెలుగు పట్ల జనం చూపిస్తున్న క్రూరత్వాన్ని భవిష్యత్తులో తెలుగే ఇతర భాషల పట్ల చూపిస్తుంది. అలా జాతకాలు తిరగబడే రోజు వస్తుంది. రప్పిస్తాం. పరాయిభాషల్ని పట్టుకు వేళ్ళాడుతున్న కొంతమంది జీవితాల్ని ఎందుకూ పనికిరాకుండా చేస్తే తప్ప అనుకున్న లక్ష్యం నెఱవేఱదు. తెలుగుజాతిద్రోహుల్ని, ద్రోహాన్ని ప్రోత్సహించేవాళ్ళనీ ఈ గడ్డ నుంచి తఱిమేస్తే తప్ప, కొంతమంది వ్యాపారాల్ని మూల పడేస్తే తప్ప, వాళ్ళని సంపూర్ణ బికార్లుగా మారిస్తే తప్ప, ఈ గడ్డ మీద మళ్ళీ తెలుగు నిలద్రొక్కుకోదు.
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం నాకు మతం కన్నా భాషే ముఖ్యం.
Jameel Ahmed ·
మనము ఇతర భాషల వారిని బహిష్కరిస్తే వారు మనల్ని బహిష్కరిస్తారు. వారి అవసరము లేకుండా మనము బ్రతకగలిగినపుడు వారు కూడా బ్రతకగలుగుతారు. మనము బహిష్కరించినంత మాత్రనా ఎవరో బికార్లుగా మారరు, వారు బహిష్కరించినంత మాత్రాన మనమేమి బికార్లుగా మారము
Jameel Ahmed ·
మీకు భాషే ముఖ్యం కావచ్చు మీ అభిప్రాయంతో అందరూ ఏకీభవించాల్సిన అవసరము లేదు. అది మీ అభిప్రాయం మీకు పూర్తి స్వేచ్చ ఉంది
నూర్ బాషా రహంతుల్లా తాడేపల్లిని చూస్తుంటే తెలుగుస్థాన్ అనే తెలుగుదేశం కావాలని పోరాడిన గురుకుల మిత్రా,భూపతి నారాయణమూర్తి లాంటివారు మళ్ళీ గుర్తొస్తున్నారు.
Jameel Ahmed ·
తాడేపల్లి గారు మీరు తప్పుగా అర్థం చేసుకోకండి మీ తెలుగు భాషలో చాలా ఇంగ్లీషు పదాలు ఉన్నాయి మొదట మీరు దానిని సరి చేసుకుంటే మీ వాదన ఇంకా బలంగా ఉంటుంది
తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం నూర్ బాష రహమతుల్లా గారూ ! మనం ఎవఱినీ సమూలంగా మార్చలేం గానీ నా ఉద్దేశంలో - ఉన్న మసీదుల పెద్దలతోనూ, కఱుడుగట్టిన భక్తులతోనూ వాదించడం కంటే మీరే పూనుకొని ఒక కొత్త మసీదు కట్టడం మంచిది. వీలైతే స్థానికంగా పదీ - ఇఱవై మసీదులు. ఇలా ఒక కొత్తశాఖకి నాంది పలకడమే ఉత్తమం. వాటి పాపులారిటీని బట్టి పాత మసీదులవారు కూడా భవిష్యత్తులో మారే అవకాశం ఉంది. కేవలం ప్రతిపాదనలు చేస్తే ఈ జాతి వినదు. చేసి చూపించడమే. నేరుగా పనిలోకి దిగిపోవడమే. మీ సిద్ధాంతాన్ని విశ్వసించే మిత్రులనే అక్కడ ఇమాములుగా నియమించండి.
Basha Kadapa తాడేపల్లిగారూ.. ఖురాన్ ను గానీ, సంస్కృతంలో వున్న వేదాల్నిగానీ, లేక ఇతర మూల గ్రంథాల్ని గానీ నూటికి నూరు శాతం అనువాదం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కేవలం మన సంతృప్తి కోసం మనం అనువాదాలు చేసుకుంటున్నాం. హిందువులు సంస్కృతాన్ని వదిలివేయడం వల్ల మూల గ్రంథాలైన వేదాల్లోని సందేశాన్ని పొందలేకపోయారు. ఒక్కక్కరూ ఒక్కొక రకంగా అనువాదం చేసుకుని అనేక సందేహాలకు గురి అయ్యారు. చివరికి గ్రంథంలోని వాస్తవ అర్థాలే మారిపోతాయి. అలాగే బైబిల్ విషయంలో కూడా.. ఈరోజు ప్రొటేస్టంట్లు, కాథలిక్కుల బైబిల్ గ్రంథాల్లో చాలా వ్యత్యాసాలున్నాయి. ఇవన్నీ అనువాదంలో మానవులు చేసిన తప్పిదాలే. మనం మూల గ్రంథం ఏ భాషలో అవతరింపజేయబడిందో ఆ భాషను గనక త్యజిస్తే రేపు మన వాదనను ఎలా నిరూపించగలం? అనువాద గ్రంథాలు ఎప్పటికీ నిదర్శనంగా నిలబడలేవు. అయినా నాకొకటి అర్థం కాదు. తెలుగుపై భాషాభిమానం వుండటం మంచిదేగానీ.. దానికోసం ఇతర భాషల్ని వదిలేయాలా? అలాంటపుడు మన పిల్లలకి ఇంగ్లీషు, హిందీ భాషలు స్కూళ్ళలో నుంచి తొలగించాలనుకుంటా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)