తెలుగు ముస్లిముల నమాజు తెలుగులో ఉండాలి (ఆంధ్రపత్రిక 19.7.1987)
పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే. తెలుగులో నమాజు ఇస్లాం అనే అనాలి.మహమ్మదీయ మతము అనకూడదు.ముస్లిములు అనాలి కానీ మహమ్మదీయులు అనకూడదు. అరబ్బీ బాష అత్యున్నతమైనదే కావచ్చు. ఆది అర్ధం అయ్యే వారికే దాని గొప్పతనం తెలుస్తుంది.ఆందరికీ అదే భాషను అవశ్యం చెయ్యటం కంటె ఆ భాషలో వెలువడిన దైవ సందేశాన్ని అందరికీ అర్ధం అయ్యెట్లు చెప్పటం వివేకవంతంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని దృష్టిలో భాషకంటె భావమే విలువైనది. ఖురాన్ బోధ చాలా సులువైనది(చంద్రుడు17,22,40). కానీ ప్రపంచంలోని కోట్లాది అరబ్బేతరులకు అది అర్ధం కాని మంత్ర పఠనంలా ఎందుకు ఉంది? కేవలం ఆ మహా ఘనత గల దైవ సందేశాన్ని(కహఫ్:1)అరబ్బీ భాషలో బంధించటం వల్లనే కాదా? "ఏ జాతి వారి తాత ముత్తాతలకు భయ బోధ చేయబడలేదో వారిని భయపెట్టటం కోసం ఈ అరబ్బు ప్రవక్తగా పంపబడ్డారు(యాసీన్:6). ఈ అరబ్ ప్రవక్త తెచ్చిన భయబోధ ఆ జాతి వారికే పరిమితమై ఉంటుందని, అరబ్బేతరులకు వర్తించదని ఎవరైనా చెప్పగలరా? మానవ నిర్మితమైన పారంపరిక ఆచార్యాలను నిలుపుకోవాలనే తలంపుతో, దైవోపదేశాలను వదిలివేసి, కేవలం మన హేతుబుధ్ధితో అగోచర విషయాలను తర్కించబూనటం అవివేకం అవుతుంది. (ఇమ్రాన్:7) అందరికీ వచ్చే భాష అందరికీ అర్ధమయ్యే భాష ఏది? "వీళ్ళు గ్రహించటం కోసం ఈ ఖురాన్‌ను నీ భాషలో సులువుగా చేశాము"(పొగ:58) అంటే అరబ్బులు తప్ప ఇతర భాషల జనం దాన్ని గ్రహించకూడదని దేవుని భావం కాదు. ప్రవక్త అరబీయుడు,అతని స్వజనం అతని మాటలు వినాలంటే అతని భాషలోనే దైవ సందేశం రావాలి. ప్ర్రవక్తకే అర్ధం కాని భాష ప్రవక్త జాతి ప్రజలకు అర్దం ఎలా అవుతుంది? ఒక వేళ దేవుడు పరాయి భాషలను అర్ధం చేసుకునే అద్బుత శక్తిని ప్రవక్తకు ఇచ్చి సందేశాన్ని పంపినప్పటికీ ఆ జనం "అరబ్బీ ప్రవక్త- అర్ధంకాని అజమీ కురాన్" అని ఎగతాళి చేస్తారు (సజ్దా:44). ఆరబ్బేతరుడు అరబీలొ ప్రవచిస్తూ వస్తే అతన్నీ నమ్మరు (కవులు:198,199). అందువలన ప్రవక్త స్వభాషలోనే ప్రవచనం రావటం ఎంత ఆవశ్యకమో ఆ ప్రవచనం ఆయా ప్రజల భాషలలోనే వారికి అందించబడటం కూడా అంతే అవసరం. ఆద్వితీయ దేవుని గురించి అరబ్బులకు అరబీలో చెబుతుంటేనే, నీ మాటలు మా హృదయాల్లో దూరవు, మా చెవులు చెవిటివైపోయాయి. నీకూ మాకూ మధ్య పెద్ద తెర ఒకటి అడ్డంగా ఉంది, నీ దారి నీదీ మాదారి మాదీ అన్నారు విగ్రహారాధకులు(హామీం:5). అరబ్బేతరులకు అరబీలొ చెప్పి ఒప్పింపచేయటం అలవి అయ్యే పనేనా? రాజ్యాధికారం పొందిన ఆంగ్లేయులు ఇంగ్లీషును అందరిమీదా రుద్దినలాగా అరబీని అందరికీ అంటగట్టగలిగితేనే అది సాధ్యం అవుతుంది. ఆయినా సర్వలోకాల ప్రభువు ఖురాన్‌ను అరబీలొ పంపి ఆదమరచి నిద్రపోలేదు. పంపిన ఉద్దేశం వెల్లడించాడు.ఆది విశ్వాసులకు స్థిరత్వం ఇవ్వాలి,సన్మార్గం చూపించాలి, సువార్త వినిపించాలి (తేనెటీగ:103) నమాజులోకానీ, మరో చోట కానీ అరబీ కురాన్ వింటుంటే మనకు పై మూడు ప్రయోజనాలు కలగటం లేదు.తెలుగు కురాన్ ద్వారా అవి మనకు సిద్ధిస్తున్నాయి. నిశ్చయంగా కురాన్ మనను కష్టపెట్టటానికి గాక మనకు బోధ చెయ్యడానికే వచ్చింది.(ఓ మానవుడా:2,3). మాటిమాటికి పఠించే ఆ ఏడు వాక్యాలు (గుట్ట:87) కూడా ప్రతి ప్రార్ధనలో మనకు బోధ చేస్తూ ఉండాలి.అది మన మాతృభాషలోనే మనకు సాధ్యమవుతుంది. మనిషిని ఉద్ధరించగల ప్రార్ధనలో 4 ముఖ్య విషయాలున్నాయి:- 1. మనల్ని చూస్తున్న దేవుని ముందు మనం నిలబడ్డామని గ్రహించాలి. 2.ఆయన గొప్పతనం మన హీనత్వం గుర్తించాలి. 3.ఆయన మనల్ని ప్రేమించి సహాయం చెయజూస్తున్నాడని తెలిసికొని అడగాలి. 4.మనం అడిగేదేమిటో మనకు అర్దమై ఉండాలి. ఇలా చేసే ప్రార్దన మనల్ని దేవునికి సన్నిహితులుగా మారుస్తుంది.పాపకార్యాలకు పాల్పడనీయదు. దుష్టతలంపులను కలుగనీయదు.దేవుని సర్వొన్నతను పదే పదే గుర్తు చెస్తుంది. క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. హృదయాన్ని శుద్ధి చేస్తుంది.దేవునిపై ఆధారపడే స్వభావాన్ని పెంచుతుంది.దేవుని ప్రీతికోసం ఎట్టి త్యాగానికైనా తగిన తెగింపును ఇస్తుంది.మరి ఇదంతా నైతికమైన సముద్ధరణే గదా? "నిశ్చయంగా నమాజు సిగ్గుమాలిన పనులనుండి అధర్మకార్యాలనుండి ఆటంకపరుస్తుంది" (సాలెపురుగు:46). ఈ వచనాన్ని గురించి అబ్దుల్ గఫూర్ గారు ఇలా వ్యాఖ్యానించారు: "నమాజు చాలా మహిమగలది.దానిని నియమముగా భక్తి పూర్వకముగా చేసినచో అది భక్తులను సిగ్గుమాలిన పనులనుండి పాపకార్యములనుండి మానిపించును. దుర్గుణములను తొలగించి మంచి గుణములను కలిగించుట దాని స్వభావము. ఎట్లు మందును నియమముగా పథ్యముతో సేవించిన రోగము పోయి ఆరోగ్యము చేకూరునో, అట్లే నమాజు సలుపుచు దానికి విరోద కార్యములను మాను కొనినచో, ఆత్మ సంబందమైన రోగములు అను దుర్గుణములు నశించి, ఆత్మకు ఆరోగ్యము అలవడును. భక్తుడు పాపములు వదలుకొనును.దొంగ భక్తి వలన పాపములు తొలగనిచో అది వాని తప్పుయే కాని నమాజు దోషము కాదు.నమాజు చేయునపుడు దేవుని సాన్నిధ్యమున నిలచి భక్తితోనుందునని వాగ్ధానము చేసి నమాజు ముగించిన పిదప పాప కార్యములు చేయువాడు మాట తప్పిన వాడగును. అట్లు చేయవలదు అని నమాజు హెచ్చరించుచుండును". "నేను జిన్నాతులను మానవులను పుట్టించినది వారు నన్ను ఆరాధించుట కొరకే" (51:56) అంటే మనిషి జీవిత ఉద్దేశమే దైవారాధన. తీర్పుదినాన దేవుని సిం హాసనానికి కుడివైపు చేరిన సజ్జనులు నరకాగ్నిలొ మాడుతున్న వారిని ఒక ప్రశ్న వేస్తారు:"మీరు నరకంలో త్రోయబడటానికి కారణం ఎమిటి?" అంటే వాళ్ళు నాలుగు కారణాలు చెబుతారు. ఆందులో మొదటిది" నమాజు చెయ్యకపోవటం"(74:43) “ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజుకు పిలుపు వినబడగానే మీ వ్యాపారాన్ని వదిలిపెట్టి దేవుని ధ్యానించటానికి పరుగెత్తి రండి. ఆది మీకెంతో మేలైనదని తెలిసికోండి"(62:9) మరి ఇంతమేలైనది,మనల్ని నరకశిక్ష నుండి తప్పించేది,నైతికంగా ఉద్ధరించేది అయిన నమాజు అనేక మందికి నిరుపయోగంగా ఉంటున్నది.నమాజు ద్వారా మనిషి పొందవలసినంత ప్రయోజనం పొందటం లేదు.అర్ధంకాని సంస్కృతమంత్రాలలాంటి కొన్ని పదాలను వల్లించటం అనే తంతుతో నమాజు ముగుస్తున్నది. గొంతులోనుండి వెలువడే నమాజు ఉచ్చారణ కంటే, హ్రుదయంలోంచి పెల్లుబికే ప్రార్ధన నిశ్చయంగా గొప్పది. నమాజు అనేకుల జీవితాల్లో మార్పుతేలేకపోవటానికి ఒక కారణం "ఆ నమాజు వాళ్ళకు అర్ధంకాక పోవటం". అర్ధంకాకపోవటానికి కారణం అతనికి అరబ్బీ భాష రాకపోవటం దేవునికి అరబ్బీ భాషలొ మాత్రమే నమాజు చెయ్యలి అనే కట్టడి.ప్రతి విశ్వాసీ తప్పని సరిగా అరబ్బీ నేర్వాలి అనే నిర్బంధం.అర్ధం అయినా కాకపొయినా సరే అరబ్బీలో రాయబడిన కురానే చదవాలి అని ఒత్తిడి చెయ్యటం.ఇది అనుల్లంఘనీయమైన సంప్రదాయం కావటం. "మోకరించి మీ మాత్రుభాషలో దేవుని అయిదుపూటలా ప్రార్దించుకోండి,మీకు వచ్చిన భాషల్లొనే కురాన్ చదువుకోండి అంటే ప్రపంచ ప్రజలందరికీ "అర్ధం అయ్యే నమాజు" అందుబాటులొ ఉందేది.కానీ అరబ్బీలో మాత్రమే ఇలా ఇలా వంగుతూ లేస్తూ నమాజు చెయాలి అనటంతో ఈ శారీరక విన్యాసం ప్రజలకు అర్ధం కాలేదు. "అర్ధం లేనిచదువు వ్యర్ధము" అన్నట్లే" అర్ధం కాని ప్రార్ధన కూడా వ్యర్ధమే". మహా ప్రవక్త గారి మాత్రుభాషలోనె దైవ సందేశం ఎందుకు వచ్చింది?మరో భాషలోవస్తే ఆయనకు అర్ధం కాదనే గదా!". "సకలలోకాల ప్రభువా! అనంత కరుణామయుడా!, అపారకృపాశీలుడా!, తీర్పు దినపు యజమానీ! మాదేవా!, నీకే స్తోత్రములు! మేము నిన్నే ఆరాధిస్తాము. సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము. నీవు దీవించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి మార్గం, మార్గభ్రష్టులు కాని వారి రుజుమార్గం మాకు చూపించు". అని చెప్పుకుంటే ఒక తెలుగు వానికి నమాజు అర్ధవంతంగా ఉంటుంది.అల్లా అంటే ఒక్కడేననీ ఆయనకు ఆలుబిడ్డలు లేరనీ, ఆయన ఎవరికీ పుట్టలేదనీ, ఆయన ఎవరినీ కనలేదనీ ఆయన సర్వోన్నతుడైన ఏకైక దేవుడనీ-విగ్రహారాధన హేయమనీ, తీర్పు రోజున మనం లెక్క అప్పజెప్పుకోవలసి ఉంటుందనీ తెలుగుజనానికి తెలుగులోనే అర్ధం అవుతుంది. ఆయన అద్వితీయుడనీ ఆయనకు సాటి కల్పించరాదని తెలుగులో చెబితే తెలుగుజనం సుళువుగానే అర్ధం చేసికొంటారు. కానీ అక్కడినుండి ఆరంభమయ్యే అరబ్బీ ఆంక్షలు, నియమనిష్టలు, ప్రత్యేక తరహాలో సాగే ప్రార్ధనా పద్దతులు వారిని అల్లా సన్నిధికి రాకుండా ఆటంకపెడతాయి. ఆయన సన్నిధికి వచ్చి"అలహందులిల్లాహి" అనవలసినదేగాని"సర్వలోకాలప్రభూ"అని సంబోధించలేడు తెలుగువాడు.గుండెలోని భావం గొంతుదాటి రాకూడదా? అది దేవుడు వినడా? అరబ్బీ రాని ప్రజల యాతన చూడండి. మతంలో బలాత్కారం లేదన్న వాళ్ళే బలవంతంగా ఒక భాషను నిర్బంధం చేసారు.ఆ భాషరానిదే నీవు ముస్లిం కాదు పొమ్మన్నారు.దేవుని ప్రార్ధించుకోటానికి ఆ భాషలో ఉచ్చరించనిదే మసీదు గడపతొక్కటానికి సైతం నీకు అర్హత లేదు పొమ్మన్నారు.అన్ని రంగులూ, అన్ని భాషలూ దేవునివేనని చెప్పేవారూ ఈ భాష తప్ప మరో భాషలో చేసే ప్రార్ధన దేవునికి అర్ధం కాదు అన్నట్లుగా పట్టు పడుతున్నారు. నమాజు మనిషిని నైతికంగా ఉద్ధరిస్తుంది.కాని అరబిక్ సూరాల కంఠస్తం అవశ్యం కావటం వల్ల అన్యుల ప్రవేశానికి ఆటంకం కలిగిస్తొంది.హ్రుదయంలో వున్న విషయాలను చెప్పుకొను వీలు లేదు.తెలుగు భక్తుడు,అరబ్బీ దేవుడు.తెలుగు ముస్లిములు అయిదు వేళలా దేవుని తెలుగులోనే ధ్యానిస్తే వారి మది సేద తీరుతుంది.అరబ్బీ ఆచార సంపన్నులు తెలుగుముస్లిముల తెలుగు ప్రార్ధనలకు ఆమోదముద్ర వేయరట! మరి మన తెలుగు ప్రార్దనలు అల్లా దరి జేరవా? గడ్డం పెంచలేదనీ, నమాజు సమయంలొ కాలి గిలకలు కాన రాలెదనీ, అన్నం తిన్నాక ఫలానా వరుసలో చేతివేళ్ళు నాకలేదనీ, అరబ్బీ రాదనీ విమర్శించే వాళ్ళను లెక్క చెయ్యకండి.అన్ని భాషలూ దేవునివే గనుక అయితే, అన్ని భాషలను ఆయనే అనుమతించి ఉంటే ఈ ప్రత్యేక భాషాదాస్యం చెయ్యమని ఆయన చెప్పడు. తెలుగు ముస్లిములకోసం తెలుగులో నమాజును,తెలుగు మసీదులను ప్రారంభించాలి. అల్లా సన్నిధికి చేరి మన హృదయాలను తెరిచే అవకాశం మనకు తెలుగులోనే దొరుకుతుంది"
--- నూర్ బాషా రహంతుల్లా (ఆంధ్రపత్రిక 19.7.1987)