ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, మే 2010, సోమవారం

క్షమించు నాన్నా!

మమ్మల్ని క్షమించు నాన్నా!
"ఏ పాదసేవ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్న విమలతరమో
ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజలకన్న పుణ్యతరమో
ఏ పాదతీర్ధము పాప సంతాపాగ్ని ఆర్పజాలిన అమృత ఝరమో
అట్టి పితరుల సేవను ఆత్మ మరచిన వారిని కావగలవారు లేరీ జగాన"

నేనెంత పాపిని దేవా? ఎన్ని సార్లు ఇలాంటి పద్యాలు విన్నాను?ఎంతమందికి తల్లితండ్రుల సేవ గురించి చెప్పాను?
నా దగ్గరకు వచ్చే సరికి నేనే పాటించలేదే? నా అన్నదమ్ములతో పంతాలకు పోయి కన్నవారిని చూడ లేక పోయానే?
తల్లిదండ్రుల్ని వాటాలు వేసుకుని, వంతులవారీగా మా పంతాలు నెగ్గించుకున్నాం.
మా పరీక్షాకాలం చూస్తూనే ముగిసిపోయింది. ఆత్మహత్య చేసుకున్న నాన్న తిరిగొస్తాడా?పిల్లలు, వృద్ధులూ సమానం అంటారు.డబ్బులిమ్మని మారాం చేస్తే మా పిల్లలకెలా ఇచ్చాం? మా తండ్రికెలా ఇచ్చాం? పిల్లలు బెల్లంలా తల్లిదండ్రులు రాబందుల్లా కనిపించారే, ఎంత స్వార్ధపరులం తండ్రీ.జీవిత యాత్రను దిగ్విజయంగా ముగించుకొని మా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు.
మమ్మల్ని తమ కరుణా కటాక్షాలతో ఓడించి వెళ్ళారు.వాళ్ళకేమీ ఇవ్వకుండా లక్షలాది రూపాయలు సంపాదించాం.
వాళ్ళు బ్రతికున్నప్పుడు వాటిని కూడబెట్టాం.ఈ ఆస్తులు మమ్మల్నిప్పుడు వెక్కిరిస్తున్నాయి. వాళ్ళేం కట్టుకు పోయారు?
రేపు మేమూ వట్టి చేతుల్తో ఈ ఆస్తిని పిల్లలకొదిలేసి వెళ్ళాలిగా? మేమేం సాధించినట్లు? ఇంత పాపం చేసింది పిల్లలకోసమే గదా!
పిల్లలు నన్నీ పాపాలు చేయమన్నారా? లేదే.అయ్యా, కొడుకా, దేహీ అని అభ్యర్ధించిననాడు మా తల్లిదండ్రులకు మేమేం చెయ్యలేదు. వాళ్ళు చేసిన తప్పుడు పనుల్ని ఎత్తిచూపుతూ ఇంట్లోకి రానియ్యకుండా వెళ్ళగొట్టాం.ఎవరి కోరికలు కొరతలు పితుర్లు వారివి.
ముసలి వారి మాట ముల్లు లేని బాట అనే మాట ఇప్పుడు గుర్తొస్తోంది.ఇప్పుడనుకుంటే ఏం లాభం? ఆనాడు ముసలోళ్ళకు పెట్టింది ముండలకు పెట్టిందీ ఒకటే అన్నాం, ఈనాడు నాకేం పెట్టినా తినేటప్పుడు చనిపోయిన నా ముసలి తల్లిదండ్రులే గుర్తొస్తున్నారు.
బిడ్డల్లో ఎవరు పేదరికంలో ఉంటే తల్లిదండ్రులకు ఆ బిడ్డలనే ఆదుకోవాలని ఉంటుంది.
ఆనాడు మీది పక్షపాతం అనుకున్నాను. మీరెంత పక్షపాతంతో ఉన్నా,మీ ముద్దుల కొడుకును ఎంతగా ప్రేమించి, వాడి కోసం మీ సర్వస్వాన్ని త్యాగం చేసినా, మమ్మల్ని కోర్టులకు లాగినా, భరణం గుంజినా మీకేం సుఖం దక్కింది?
అన్నదమ్ముల మధ్య అగాధం ఏర్పాటు చేశారే గాని మమ్మల్ని కలపగలిగారా?చివరికి మీరు నమ్ముకున్న ప్రియపుత్రుడు కూడా మిమ్మల్ని బయటకు గెంటేశాడు మీ ఆస్తి తీసుకున్నాడు గానీ మిమ్మల్ని వృద్దాశ్రమానికి తరలించాడు.తన కంటే ఎంతో బాగు పడ్డ  అన్నలు ఎందుకు చూడరనే పంతంతో చేసిన పని అది.పంతాలు ఎంత పాపాలకైనా దారి తీస్తాయి.
అమ్మ అదృషవంతురాలు.వృద్దాశ్రమంలోకి వెళ్ళకుండానే పరలోకానికి చేరింది. ఆ తరువాతే గదా నాన్నా నీకీ శ్రమలు!,
కోమాలో ఉన్న భార్యను నీవూ నీ కొడుకూ కలిసి చంపారనీ వార్తలొచ్చాయి.. చుట్టు పక్కల వాళ్ళు ఆమె దుర్వాసన వస్తోంది అంటే ఆమెను ఎంతో దయతో చంపారనీ,అడ్డు తొలగించుకున్నారనీ చెప్పుకుంటున్నారు. కానీ మీ అంతరాత్మ అపరాధ భావనతో మాకంటే ఎక్కువగా మిమ్మల్ని అనుక్షణం నిలదీస్తూనే ఉంటుంది.నీవు బయట జనానికి చెప్పుకున్నకారణం ఒక్కటే. నీవు సంపాదించిన ఇంట్లో నిన్ను ఉండకుండా వెళ్ళగొట్టారు.కానీ నిన్నువెళ్ళగొట్టింది ఎవరు?ఎందుకు వెళ్ళగొట్టారు?అది ఎవరికీ చెప్పలేక పోయావు.అసలు నీవు ఒరిజినల్ గా పేదవాడివి కాదు.నీ కష్టార్జితాన్ని ఒక్క కొడుకుకే అప్పగించి కావాలని పేదవాడిగా మారావు.ముందుచూపున్న ఏ తండ్రీ ఇలా చెయ్యడు.తనమరణానంతరమే బిడ్డలకు ఆస్తి ఇవ్వాలి.మళ్ళీ బిడ్డలనే అడుక్కుతినే పరిస్థితి చేజేతులా తెచ్చుకోకూడదు.నీజీవితం అమాయక వృద్ధులకు గుణపాఠంగా నిలుస్తుంది.
కేవలం డబ్బే మనిషికి శాంతినిస్తుందా?నీవు పడ్డ కష్టం, నీవు చేసిన త్యాగం చాలా గొప్పవే కానీ బిడ్డల మధ్య నీవు చూపిన వివక్ష నీకే శాపంగా మారింది. పలచనైపోయావు తండ్రీ.సాక్షాత్తూ దేవుడే మనుషులకు లెక్క లేకుండా పోయాడు. నీవో లెక్కా?
"ఒకడిని బుక్కా ఫకీర్ని చేసి, ఒకడిని పక్కా వజీర్ను చేసి గారడి చేస్తూ ఉంటావు,
మనిషి మనిషికీ రకరకాలుగా నసీబు రాస్తుంటావు" అని మనం వాపోవటంలేదా?
అసలీ మనుషుల జీవితమే చిత్రవిచిత్రాలుగా ముగుస్తున్నది. మనం ఆ దేవుడు ఆడించే ఆటలో బొమ్మలం ఆ దేవుని రంగస్థలంపై పాత్రధారులం. నిరంతరం ఈ రంగస్థలం పైకి జీవులు వస్తున్నాయి, పోతున్నాయి.రేపు ఎక్కడ కలుస్తామో, ఇక్కడ చేసిన చేష్టల ఫలితం ఎలా అనుభవిస్తామో,అసలెందుకు వచ్చామో, ఏ రకంగా మనం అనుభూతులు, అనుబంధాల మధ్య చిక్కుకు పోతున్నామో చూస్తూనే ఉన్నాం.ఇష్టం లేకపోయినా పాపులుగా మారుతున్నాం. ఎందుకీ దుష్టపు పనులు చేస్తున్నాం?ఎవరికోసం? భార్యాపిల్లల కోసమేనా? అయితే నీవు చేసిందీ మా కోసమే.మేము చేసేదీ మా పిల్లల కోసమే.రేపు వాళ్ళూ చేసేదీ వాళ్ళ పిల్లల కోసమే. ఇదేగా తరతరాలుగా జరుగుతున్న అన్యాయం?
మా అమ్మ, మా తాత, అమ్మమ్మ నా కళ్ళ ముందే ఎటువంటి దురవస్థలో చనిపోయారో కళ్ళారా చూశాను.
ఒక్క బస్తా ధాన్యం ఇవ్వండిరా అని నలుగురు కొడుకుల్ని ప్రాధేయపడిన నాయనమ్మ ఎంత దీనావస్థలో చనిపోయిందో నాకు తెలుసు.సుగరూ, బీపీతో బాధపడే ఆమెకు మీరు ఏమీ చేయలేదు.పెదనాన్నా మీ నలుగురు అన్నదమ్ములూ ఎందుకు కలిసి ఉండరు?అని పసి మనసుతో అడిగితే ఆయనేమన్నాడో తెలుసా?" మీరు అలాగే కలిసి ఉండండయ్యా . మేము కలిసి ఉండ లేక పోయాం".అన్నదమ్ములు ఎందుకు కలిసి ఉండలేరో పెదన్నాన్న ఎంత తెలివిగా చెప్పాడో ఇప్పుడర్ధమవుతోంది.
ఆయన పిల్లలకు మాకు ఏనాడో సంబంధాలు తెగిపోయాయి. వాళ్ళ పిల్లల వివరాలే మాకు తెలియదు.
ఇక మా అన్నదమ్ముల పిల్లలు కూడా అచ్చం అలాగే తయారవుతున్నారు. ఇక ఎక్కడ అన్నయ్య? ఎక్కడ తమ్ముడు?
ఎవరి భార్యా పిల్లల గొడవలో వాళ్ళున్నారు.గొప్ప గొప్ప పెళ్ళి సంబంధాలు తేవాలని, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడిపోవాలని పరుగులు తీస్తున్నారు. అసూయలు, ఈర్ష్యలు, పోటీలు, ఆర్ధిక సమస్యల్లేవు గానీ, ఆర్ధిక పోటీ, అసూయల పోటీ పుష్కలంగా ఉన్నాయి. అనుబంధాలు అసలే లేవు.ఆర్ధిక సాయం అంటే ఆమడ దూరం పరుగుల పోటీ జరుగుతోంది.ఇక మా భార్యలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అంతా పిల్లల పరుగుల పోటీల్లో,ఒకరి పిల్లల్ని ఇంకొకరి పిల్లలు ఓడగొట్టి ముందుకు రావాలని ప్రోత్సహిస్తూ,
ఈలలు వేస్తూ, ఒకరిపై మరొకరు రంకెలు వేస్తూ, మెటికెలు విరుస్తూ, పిల్లలతోటే వేగలేక చస్తూ ఉంటే, ఇంకా ఈ ముసలోళ్ళను కూడా పోషించాలా ఏ వృధ్ధాశ్రమాల్లోకో ఈడవండి అంటూ వారివారి భర్తల మెడలు వంచుతున్నారు.
ఆడవాళ్ళు ఆగ్రహిస్తే అన్నదమ్ముల మధ్య ఐక్యత కుదురుతుందా? ఇంట్లో వాళ్ళంతా ఆకలికి చావరా?మా బంగారు కొడుకుల్నీ, కూతుళ్ళనే హాస్టళ్ళలో ఉంచి చదివిస్తున్నాం.ఈ ముసలోళ్ళను వృద్ధాశ్రమాల్లో తోస్తే తప్పేంటి అని వాదిస్తున్నారు.నీకు బాగాలేక వ్రుద్ధాశ్రమ నిర్వాహకుడు పోన్ చేస్తే నీ శవం కూడా తన ఇంటికి రాకూడదని నీ ముద్దుల కోడలు తెగేసి చెప్పిందన్నావు.నీ ఆస్తి కోరి వారికే ఇచ్చినా నీకు మజ్జిగ కూటికి కూడా గతి లేదు అని వాపోయావు.పైగా నీవు ఉతుక్కుంటున్నా బట్టల్ని విసిరేసి నిన్ను బయటకు నెట్టేసిందన్నావు.వూరంతా పెద్దమనుషుల మధ్యపెట్టీ అల్లరి చేశావు.సమస్య పెద్దదయ్యిందే గానీ నీ బాధలు తీరలేదు.నీ పక్షపాతానికి అలిగిన కొడుకులు కూడా నిన్ను దగ్గరికి రానివ్వలేదు.
ఈ బాధంతా పడీ పడీ ఆత్మహత్య చేసుకొని క్షణాల్లో విముక్తుడివయ్యావు నాన్నా.ఎందుకు?నీ తలరాత దేవుడే ఇలా రాశాడా? అల్లా అనుమతిలేనిదే ఏ ప్రాణికీ మరణం రాదంటారే? నీ అవస్థ అల్లా కూడా గ్రహించలేదా?మాకు రేపేం జరుగుతుందో తెలుసుకోలేని మానవమాత్రులం.మేమేమీ చేయలేకపోయాం.ఇప్పుడు చేద్దామన్నా నీవు లేవు.కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుదామని వుంది.నా బాల్యంలో నీవు చెప్పిన కధలు అనుభవాలు హితోపదేశాలు విందామని వుంది.ఇంత పెద్ద ఇంట్లో నీవు అంగుళం అంగుళం తిరిగి నీకొడుకు సంపాదించిన ఆస్తి అని చూసి అనుభవిస్తూ మురిసిపోతుంటే చూడాలని వుంది.దేవుడు అమ్మకూ నీకు పరలోకమిచ్చి నీసహవాస భాగ్యం లేని నిస్సార జీవితాన్నిచ్చాడు.సిరిసంపదలున్నా నిన్ను మాడ్చి చంపామనే నిరంతర వ్యధతో కూడిన ఈ జీవితమే మాకు కనబడని శిక్ష. దుర్మార్గపు మనసుతో నీకు చేసిన అన్యాయానికి శిక్ష ఇక్కడే అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను.నేను దైవాన్ని క్షమాపణ అడగను.నా బిడ్డలూ నన్ను చూడకుండా నాకు ఈ లోకంలోనే శిక్ష కావాలి.నన్నుక్షమించు నాన్నా. (గీటురాయి 11.8.2007)

 వృద్ధులకు సుద్దులు
Let neither son nor wife, neither brother nor friend,
have power over you as long as you live.
While breath of life is still in you,
let no man have dominion over you.
Give not to another your wealth,
lest then you have to plead with him;
Far better that your children plead with you than that you should look to their generosity.
Keep control over all your affairs;
let no one tarnish your glory.
When your few days reach their limit, at the time of death distribute your inheritance.
( Sirach The Wisdom Books Chapter 33 :20-24)

13 కామెంట్‌లు:

  1. రహమతుల్లా గారూ ,
    చాలా బాగుంది. మనలో ప్రతి ఒక్కరి నీడా ఇందులో కనపడుతోంది..

    రిప్లయితొలగించండి
  2. Human being is having only 3 problems. (1) Relations (2) Health and (3) Wealth. If one is not set right the relationship with their parents he will have the problems of Health and Wealth. Life is nothing but relations. Have good relations with parents.

    రిప్లయితొలగించండి
  3. ముసలి వారి మాట ముల్లు లేని బాట-నాకు కొత్త మాట.
    రహంతుల్లా సార్! హృదయాన్ని అల్లలాడించారు.మా నిషాద లోని విశదమ౦తా ఇందులో!

    రిప్లయితొలగించండి
  4. రహమతుల్లా గారూ
    మీ క్షమించు నాన్నా చదివాను. హ్రుద్యంగా ఉంది. ఇలాంటి విషయాన్ని గురించి తలుచుకుంటూ పోతే
    ఒక జీవన చిత్రం ప్రతిఒక్కళ్ళకీ కళ్ళముందు మెదులుతుంది. . మన తరం వాళ్ళకైతే ఒక్కసారి తలుచుకుని బాధ పడడానికో లేక సరిదిద్దుకొవడానికో కొంత వరకైనా అవకాశం ఉంది. కానీ ఇప్పటి వాళ్ళకైతే వాళ్ళ జీవనశైలి ఇలాంటి మనసుకు తగిలే విషయాలను గురించి ఆలోచించి బాధ పడడం కన్నా లైట్ తీసుకొవడం లోనే సరిపుచ్చుకుంటున్నారు. నాకు తెలిసి ఇంకా ముస్లిం కుటుంబాలలో కొంత వరకు పెద్ద కుటుంబాలు ఉండడం వలన పెద్ద వాళ్ళు దిక్కు లేని వాళ్ళవట్లేదు మిగతా వాళ్ళు కాలచక్రం ముందుకే గానీ వెనక్కి తిరగ దన్నట్లు మనం మన పిల్లలకి దోచి పెడితే, మన పిల్లలు వాళ్ల పిల్లలకి దోచి పెడుతున్నారే కానీ వెనక్కి తిరిగి చుసుకునేప్పడికి కాలం తనపని తను చేసుకుంటూ ముందుకెళ్ళి పోతొంది. అనుభూతులని మ్రింగేస్తూ ,బాంధవ్యాలని మరిచిపోతూ మనిషి ముందుకే వెళుతున్నాడుమరి.భార్యలు కుడా తమని అర్ధం చేసుకోకుండా ప్రవర్తించే పెద్దవాళ్ళను కాదనుకుంటున్నారు గానీ తమతో ప్రేమగా, సతాయించకుండా ఉన్న వాళ్ళని హాయిగానే చుసుకుంటున్నారుమరి. కాకపోతె ఏ అనర్ధమైనా డబ్బుతోనే కనక పెద్దవాళ్ళు తమ గురించి ఆలోచించి జాగ్రత్త పడాలిమరి. ఏం చేస్తాం . ఇదంతా ప్రపంచీకరణ మహత్యమే. విదేశీ జీవనశైలితో బాటు వృద్ధాశ్రమాల అవసరము అక్కడినించే దిగుమతీ అయిందిమరి.
    జయభారతి
    bharathi ram kistampally
    bloggerbharathi@gmail.com
    Saturday, December 24, 2011 7:38 PM

    రిప్లయితొలగించండి
  5. ఆనాడు ముసలోళ్ళకు పెట్టింది ముండలకు పెట్టిందీ ఒకటే అన్నాం, ఈనాడు నాకేం పెట్టినా తినేటప్పుడు చనిపోయిన నా ముసలి తల్లిదండ్రులే గుర్తొస్తున్నారు.
    ఎవరి భార్యా పిల్లల గొడవలో వాళ్ళున్నారు.గొప్ప గొప్ప పెళ్ళి సంబంధాలు తేవాలని, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడిపోవాలని పరుగులు తీస్తున్నారు. అసూయలు, ఈర్ష్యలు, పోటీలు, ఆర్ధిక సమస్యల్లేవు గానీ, ఆర్ధిక పోటీ, అసూయల పోటీ పుష్కలంగా ఉన్నాయి. అనుబంధాలు అసలే లేవు.ఆర్ధిక సాయం అంటే ఆమడ దూరం పరుగుల పోటీ జరుగుతోంది.ఇక మా భార్యలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అంతా పిల్లల పరుగుల పోటీల్లో,ఒకరి పిల్లల్ని ఇంకొకరి పిల్లలు ఓడగొట్టి ముందుకు రావాలని ప్రోత్సహిస్తూ,
    ఈలలు వేస్తూ, ఒకరిపై మరొకరు రంకెలు వేస్తూ, మెటికెలు విరుస్తూ, పిల్లలతోటే వేగలేక చస్తూ ఉంటే, ఇంకా ఈ ముసలోళ్ళను కూడా పోషించాలా ఏ వృధ్ధాశ్రమాల్లోకో ఈడవండి అంటూ వారివారి భర్తల మెడలు వంచుతున్నారు.

    రిప్లయితొలగించండి
  6. పశ్చాత్తాపాన్ని హృద్యంగా చూపారు. ఈ చరిత్ర మళ్ళీ జరగకుండా ఆపే మంచి ప్రయత్నం.

    రిప్లయితొలగించండి
  7. స్పందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. హృదయాన్ని కలచి వేసింది, నేను ఇప్పటివరకూ ,ముస్లిం కుటుంబాల్లో అమ్మీ జాన్ ,అబ్బా జాన్ అంటూ ఎంతో ప్రేమగా గౌరవం గా చూస్తారు అని, క్షమించాలి నాది స్వీయ అనుభవం కాదు, ఇది సినిమా పరిజ్ఞానం లో ఉన్నాను ..ఈ కుటుంబాలలో కూడా ఇదే వ్యధా ? డబ్బే అన్ని సంబంధాలని శాసిస్తుందా ?ఎంత ఘోరం.. కలి కాలం..అంటె వ్యాపార కాలం..ఇంకా ఎన్ని వింతలు చూస్తామో?
    వసంతం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును Lakshmi Vasanta గారూ,ఈ మతం ఆ మతం అని తేడాలేదు.డబ్బే మానవ సంబంధాలన్నిటినీ శాసిస్తోంది.అమ్మీ జాన్ ,అబ్బా జాన్ అంటూ ఎంతో ప్రేమగా గౌరవం గా తల్లిదండ్రుల్ని చూసేవారూ ఉన్నారు.చూడని దుర్మార్గులూ ఉన్నారు.అయినా సరే వృద్ధాశ్రమాలు నిర్వహించకూడదనే ఆజ్నలతో దుర్మార్గపు బిడ్డలున్న ముస్లిం ముసలోళ్ళ పాట్లూ మరీ ఘోరంగా ఉన్నాయి.ఇలాంటి వాళ్ళు హిందువుల,క్రైస్తవుల వృద్ధాశ్రమాల్లోనే ఉంటూ కాలం వెళ్ళదీస్తున్నారు.లేదా ఆదుకునే వారులేక ఇలా మస్తాన్ లాగా వీధులపాలౌతున్నారు.https://www.facebook.com/photo.php?fbid=587857674579560&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=photo_comment

      తొలగించండి